Site icon vidhaatha

Amaravati | అమ‌రావ‌తిపై బాబు ముంద‌డుగు – ప‌నుల‌పై కమిటీ ఏర్పాటు

మూడు రాజ‌ధానుల ముచ్చట‌తో గ‌త వైసీపీ ప్రభుత్వం(YSRCP Government) అమ‌రావ‌తిని అటకెక్కించింది. అయితే, ప్రభుత్వం మారేట‌ప్పటికి అమ‌రావ‌తి(Amaravati) ప‌నులు సాగుతున్నాయి. హ‌ఠాత్తుగా ప‌నులు ఆగిపోవ‌డంతో, తెప్పించిన వ‌స్తుసామాగ్రి, చేసిన త‌వ్వకాలు, వేసిన కేబుళ్లు.. ఇలా సగంలో ఆగిపోయిన ప‌నులు, మిగిలిపోయిన మెటీరియ‌ల్ ఎక్కడిక‌క్కడే ప‌డిఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అనుకున్న ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాల‌ని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి(CM Chandrababu), ప‌నులు ఎక్కడ ఆగిపోయాయో, అక్కన్నుంచే మొద‌లుపెట్టాల‌ని అధికారుల‌కు ఆదేశాలు (Restarting the works) జారీ చేసారు.

ఇందు కోసం ఒక సాంకేతిక క‌మిటీ(Technical Committee)ని ఏర్పాటు చేసారు. ఈ క‌మిటీ ఆయా ప‌నుల‌ను ప‌రిశీలించి, చేయాల్సిన ప‌నులు, ఉన్న స‌మ‌స్యల గురించి ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. ఈ మేర‌కు ప‌బ్లిక్ హెల్త్ ఈఎన్‌సీ నేతృత్వంలో ఏడుగురు అధికారుల‌తో క‌మిటీ ఏర్పాటు చేస్తూ, మున్సిప‌ల్ శాఖా ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి(Municipal Special Chief Secretary) అనిల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేసారు.

క‌మిటీలో స‌భ్యులు(Member of the Committee):

ఆర్‌ అండ్ బీ, వీఎంసీ, ఏపీసీపీడీసీఎల్, ఏపీసీఆర్డీఏ, ఏడీసీఎల్ చీఫ్ ఇంజినీర్లు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఒక్కో ప్రతినిధి

ఏపీసీఆర్డీఏలో ప‌నుల‌కు సీఆర్డీఏ సీఈ క‌న్వీన‌ర్‌గా, ఏడీసీఎల్ ప‌నుల‌కు క‌న్వీనర్‌గా ఏడీసీఎల్ సీఈ వ్యవ‌హ‌రిస్తారు.

కమిటీకి అప్పజెప్పిన బాధ్యత‌లు(Responsibilities of the Committee):

అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం తొమ్మిది అంశాల‌పై కమిటీ నెల ‌రోజుల్లోగా నివేదిక ఇవ్వాలి. రాజ‌ధాని నిర్మాణంలో ప‌నుల ప్రస్తుత ప‌రిస్థితిని సాంకేతిక క‌మిటీ అధ్యయనం చేయాలి. 2019 మే నెల నుంచి నిర్మాణం మ‌ధ్యలో నిలిచిపోయిన వివిధ భ‌వ‌నాల ప‌టిష్టతను కమిటీ ప‌రిశీలించాలి.

కమిటీ సమర్పించిన నివేదికను అనుసరించి, ఇంకా అవసరమైన కూర్పులు, చేర్పులు చేసి వెంటనే పని మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. 30 నెలల వ్యవధిలో అన్ని పనులూ పూర్తి చేసి, రాజధాని నగరాన్ని పూర్తిగా అందుబాటులోకి తేవాలని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నిర్ణయించింది.

అధ్యయనం చేయాల్సిన‌ అంశాలు:

రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా కోసం వేసిన పైప్ లైన్లు, విద్యుత్, క‌మ్యూనికేష‌న్ ప‌నుల‌కు జ‌రిగిన న‌ష్టం
రాజ‌ధానిలోని పలు ప్రాంతాల్లో మిగిలి ఉన్న నిర్మాణ సామగ్రి నాణ్యత ప‌రిశీల‌న‌.
పైపులు, ఇనుము, ఇత‌ర సామగ్రి సేవా సామ‌ర్ధ్యం ప‌రిశీల‌న‌
అవ‌స‌ర‌మైన చోట తిరిగి పరికరాలు అమ‌ర్చడంపై సూచ‌న‌లు
నిలిచిపోయిన అన్ని ప‌నుల‌పై ఎలా ముందుకెళ్లాల‌నే దానిపై సిఫార్సులు.
నిలిచిపోయిన ప‌నులు ఎక్కడి నుంచి ప్రారంభించాల‌నే దానిపై నిర్ధిష్టమైన సూచ‌న‌లు
వివిధ కాంట్రాక్ట్ సంస్థల నుంచి వ‌చ్చే క్లెయిమ్‌ల‌ను అధ్యయ‌నం చేసి సిఫార్సులు

Exit mobile version