ఈ ఆఫీస్ అప్‌గ్రేడ్ నిలిపివేయాలి.. ఏపీ గవర్నర్‌కు చంద్రబాబునాయుడు లేఖ

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఈ-ఆఫీస్ అప్ గ్రేడ్ వ్యవహారం నిలిపేయాలని కోరుతూ టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబు నాయుడు గురువారం గవర్నర్‌కు లేఖ రాశారు.

  • Publish Date - May 16, 2024 / 06:00 PM IST

ఈ ఆఫీస్ మూసివేతపై అనుమానాలు

విధాత: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఈ-ఆఫీస్ అప్ గ్రేడ్ వ్యవహారం నిలిపేయాలని కోరుతూ టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబు నాయుడు గురువారం గవర్నర్‌కు లేఖ రాశారు. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు అప్ గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేతపై అనుమానాలున్నాయని, మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ ఆఫీస్ అప్ గ్రేడియేషన్ అవసరం లేదని లేఖలో చంద్రబాబు పేర్కోన్నారు.

ఈ ఆఫీస్ మూసివేత, అప్ గ్రేడ్ ప్రక్రియను కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టేదాకా నిలిపివేయాలని సీఎస్‌ను ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. పారదర్శకత పాటించని వైసీపీ ప్రభుత్వంలో ఈ ఆఫీస్ వ్యవహారంలో అక్రమాలు జరిగే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం షెడ్యూల్ చేసిన ఈ ఆఫీస్ వెర్షన్ అప్ గ్రేడ్ వల్ల సీఎంవో, చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ విభాగాల సేవలకు సంబంధించి ఈ ఆఫీస్ ఈ నెల 17 నుండి 25 వరకు అందుబాటులో ఉండదని, అత్యవసరంగా ఇప్పుడు చేపట్టిన అప్‌గ్రేడ్‌పై అధికారులలో, రాజకీయ పార్టీలలో అనుమానాలు ఉన్నాయన్నారు.

గత 5 ఏళ్లలో ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించిన జీవోలను కూడా ప్రభుత్వం వెబ్ సైట్ లో పెట్టడకుండా రహస్యంగా ఉంచుతోందని, అడ్డగోలుగా విడుదల చేసిన జీవోలను, ప్రభుత్వ పారదర్శకతను ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం దాడి చేసిందన్నారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ఈ సమయంలో ఈ ఆఫీస్ వెర్షన్ మార్పు కోసం నిర్ణయం తీసుకోవడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు కీలకమైన రికార్డులు మాయమైనట్లు తెలిసిందని, కొద్దిరోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా పలు రికార్డులను సీఐడీ కూడా అనుమతి లేకుండా కాల్చేసిందని లేఖలో ఆరోపించారు.

ప్రభుత్వ రికార్డుల మాయం, కాల్చివేతపై సీఈవోకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అన్ని ఫైల్స్‌, నోట్ ఫైల్స్‌, రికార్డుల మాయం కాకుండా భద్రపరచాలని, అన్ని హెచ్‌వోడీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికే సీసీ కెమెరాలు ఉన్న చోట పరిశీలన జరపాలని, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉన్న ఫిజికల్ డాక్యుమెంట్లు, డిజిటల్ డాక్యుమెంట్లు భద్రపరిచేలా చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్‌ను చంద్రబాబు తన లేఖ ద్వారా కోరారు.

Latest News