Site icon vidhaatha

CM Chandrababu | వైసీపీ పాలనలో ఏపీ బ్రాండ్ నాశనం.. పేదరిక నిర్మూలన ఎన్డీఏ లక్ష్యం: సీఎం చంద్రబాబు

 

విధాత, అమరావతి : ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీసేలా సాగిన వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని, ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉండకూడదో ఐదేళ్ల పాలన నిదర్శనమని అన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు మాట్లాడారు. ఎన్డీఏ కూటమి పాలనా లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాలని, నిబంధనల కోణంలో కాకుండా మానవత కోణంలో ప్రజలకు సేవలందించాలని ప్రభుత్వ అధికారులకు సూచించారు. ప్రజలను, ప్రజాప్రతినిధులను, అధికారులను గౌరవించేలా వ్యవస్థలు పనిచేయాలని చెప్పారు. మనం తీసుకునే నిర్ణయాలే వ్యవస్థలో మార్పులకు కారణమవుతాయన్నారు. ప్రతి మూడు నెలలకొకసారి కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. ఈ కలెక్టర్ల సదస్సు చరిత్రను తిరగరాయబోతున్నదని చెప్పారు. గత సీఎం కలెక్టర్ల సదస్సు పెట్టి ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసం మొదలుపెట్టారని గుర్తు చేశారు. పనిచేసే అధికారులను పక్కన పెట్టారని, బ్లాక్ మెయిల్ చేశారని విమర్శించారు. బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత ఐదేళ్ల పాలన సాగిందన్నారు. ఒకప్పుడు ఆంధ్రా అధికారులంటే ఢిల్లీలో ఒక గౌరవం ఉండేదని, వైసీపీ పాలనలో చులకన భావం కలిగే పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. ఐఏఎస్‌ల వ్యవస్థను దిగజార్చారన్నారు. మంచి నిర్ణయాలతో కలెక్టర్లు రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

 

ఇకపై ఆకస్మిక తనిఖీలు

ఇక మీదట ఆకస్మిక తనిఖీలుంటాయని, విధి నిర్వాహణలో, పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. మళ్లీ 1995నాటి చంద్రబాబును చూస్తారన్నారు. ఆనాడు తాను సీఎంగా ఉన్నప్పుడు ఐఏఎస్ లను డ్రెయిన్‌లలోకి దింపానని గుర్తు చేశారు. ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047ను అక్టోబర్‌ 2వ తేదీన విడుదల చేస్తామని తెలిపారు. 2047 కోసం జిల్లాలకూ విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోవాలని సూచనలు చేశారు. ఇక, సూపర్-6కు కట్టుబడి ఉన్నామని, ఈ నెల 15వ తేదీన అన్న క్యాంటీన్ల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే దాన్ని వెంటనే ఖండించాలని అధికారులకు సూచించారు. మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని, మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే మనం నంబర్ వన్ గా ఉంటామని చెప్పారు.

 

కక్ష సాధింపులు ఉండొద్దు

రాజకీయ కక్ష సాధింపు ఉండదు కానీ.. తప్పు చేస్తే సొంత పార్టీవారినైనా వదిలిపెట్టేదే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 36 రాజకీయ హత్యలు చేశారని అసత్య ప్రచారం చేశారని, వివరాలు ఇవ్వమంటే ఇవ్వలేదు అని మండిపడ్డారు. పని చేసే బాధ్యత అధికారులది.. పని చేయించే బాధ్యత తమదన్నారు. దీన్ని అధికారులందరూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. నియంతలు మళ్లీ అధికారంలోకి రాలేదని, మేం తప్పు చేస్తే మళ్లీ అధికారంలోకి రాలేమని, అసెంబ్లీకీ రాలేమని, గత ప్రభుత్వంలో చాలా మంది మంత్రులు అసెంబ్లీకి కూడా రాలేకపోయారని గుర్తు చేశారు. పరదాలు కట్టడం.. రోడ్లు బ్లాక్ చేయడం వంటివి చేయొద్దన్నారు. టెక్నాలజీని వినియోగించుకోవాలని, అవసరమైతే ప్రభుత్వ యంత్రాంగాన్ని అనుసంధానం చేస్తూ యాప్ క్రియేట్ చేస్తామని చంద్రబాబు చెప్పారు.

 

పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యం

పేదరిక నిర్మూలనకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆధిక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రతి నెలా ఒకటో తేదీన పేదల సేవలో కార్యక్రమంలో అధికారులు పాల్గొని ప్రజలతో మమేం కావాలని దిశానిర్దేశం చేశారు. పేదరిక నిర్మూలనకు వినూత్న ఆలోచనలతో కలెక్టర్లు ముందుకు రావాలన్నారు. పార్టీ ఆఫీస్ కి వెళ్లేటపుడు పెద్ద ఎత్తున ప్రజల నుంచి పిర్యాదులు అందుతున్నాయని.. 5వేల ఫిర్యాదుల్లో సగం భూ సమస్యలే ఉన్నాయని చెప్పారు. జగన్ పాలనలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు, అవకతవకలు జరిగాయన్నారు. సర్వే రాళ్లు, పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో వేసుకోవాలన్న దుర్మార్గపు ఆలోచన గతంలో చూశామని వివరించారు. ఇసుక, మైనింగ్ వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగించాలని అధికారులకు సీఎం సూచించారు. ఉచిత ఇసుక విధానం అమల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.

 

ఇసుక తవ్వకం, రవాణాకే చార్జీలు

కేవలం ఇసుక తవ్వకం, రవాణాకే చార్జీలు వసూలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.  ‘రవాణా చార్జీలు పెరగకుండా అతి దగ్గరగా ఇసుక రీచ్ పెట్టాలి. ఎప్పటికప్పుడు రవాణా ధర ప్రజలకు తెలియాలి’ అని స్పష్టం చేశారు. అధికారులెవరైనా సరైన నిర్ణయం తీసుకోకపోతే వారిని అక్కణ్నుంచి తప్పిస్తానన్నారు. సచివాలయంలో ఇసుక బుకింగ్ చేస్తే రవాణా చార్జీలే చెల్లించేలా ఉండాలన్నారు. సహజ వనరుగా వచ్చిన ఇసుకను ఇష్టానుసారంగా గత పాలకులు దోపిడీ చేశారని, సుప్రీం కోర్టు చెప్పినా మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఇసుక విషయంలో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణ జరిపిస్తామని ప్రకటించారు. చెక్ డ్యామ్‌లకు మరమ్మతులు చేయాలని, ముందుగా అన్ని రిజర్వాయర్లు, చెరువులను పూర్తిగా నింపాలని ఆదేశించారు.

 

అధికారులకు చురకలు

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పలు శాఖల అధికారులకు చురకలు అంటించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఐఏఎస్ కాంతిలాల్ దండేకు క్లాస్ తీసుకున్నారు. దండే ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కొన్ని అంశాలు ప్రస్తావించ లేదని, ఏపీలో మొత్తం 12 వేల కిలోమీటర్ల మేర స్టేట్ హైవేస్ ఉంటే.. 1000 కిలో మీటర్ల పీపీపీ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు దండే పేర్కొనడంపై స్పందిస్తూ… 1000 కిలో మీటర్లు ఏ మూలకు సరిపోవన్నారు చంద్రబాబు. అధికారులకు ఇంకా మూస పద్ధతిలోనే వెళ్తున్నారని చంద్రబాబు చురకలేశారు. రైల్ ఓవర్ బ్రిడ్జిలపై కాంతి లాల్ దండే తన ప్రజెంటేషనులో ప్రస్తావించ లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

చీరాలలో చేనేత దినోత్సవం

చీరాలలో చేనేత దినోత్సవం చేపడుతున్నామన్నారని, చీరాల కాదు.. విజయవాడలో పెట్టామన్న చేనేత శాఖ ముఖ్య కార్యదర్శి సునీత చెప్పగా.. ఏమమ్మా.. చీరాల రావడానికి ఏమైనా ఇబ్బందా..? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఎలాంటి కార్యక్రమాన్నైనా రూరల్ ప్రాంతాల్లోనే పెట్టాలని స్పష్టం చేశారు. ఇక, అటవీ శాఖ అధికారుల తీరుపై చంద్రబాబు ఆసక్తికర కామెంట్లు చేశారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలోనే అటవీ శాఖ అధికారుల తీరును ప్రస్తావిస్తున్నానన్న చంద్రబాబు అటవీ శాఖ వద్ద భారీ ఎత్తున ఫైళ్లు పెండింగులో ఉన్నాయన్నారు. అటవీ సంపదను దోచుకెళ్తంటే చోద్యం చూస్తున్న అటవీ అధికారులు.. ఓ రోడ్ నిర్మించాలంటే మాత్రం అనుమతులివ్వడం లేదన్నారు. గత ప్రభుత్వం హయాంలో అటవీ సంపదను భారీ ఎత్తున దోచేశారని చంద్రబాబు అన్నారు. మరోవైపు. ఎజెండా భారీగా ఉందా.. అంటూ అధికారులను నవ్వుతూ ప్రశ్నించిన సీఎం చంద్రబాబు అన్నీ కూడా రెగ్యులర్ గా మీరు చేసే పనులేనని, అలవాటు తప్పడం వల్ల భారీగా ఉన్నట్టు అనిపిస్తోందంటూ సెటైర్లు వేశారు. త్వరలోనే పని చేయడం అలవాటు అవుతుందని చురకలేశారు.

Exit mobile version