అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఏసీబీ కోర్టులో భారీ ఊరట దక్కింది. వైసీపీ అధికారంలో ఉండగా ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందంటూ ..అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుపైన సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసును విచారించిన విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుపై కేసును కొట్టివేసింది. ఈ కేసులో ఆయనతోపాటు మిగిలిన నిందితులకు క్లీన్‌చిట్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో చంద్రబాబుపై అసైన్డ్ భూముల్లో అక్రమాలు, ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్ కేసులు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, లిక్కర్ అక్రమాలపై కేసులు నమోదయ్యాయి. వీటిలో ఇప్పటికే రెండు కేసులు కొట్టివేసిన కోర్టు..తాజాగా ఫైబర్ నెట్ కేసును కూడా కొట్టివేయడం గమనార్హం. రాజకీయ కక్ష సాధింపులలో భాగంగానే వైసీపీ ప్రభుత్వంపై గతంలో చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేసిందని టీడీపీ మండిపడింది. కోర్టు తీర్పులతో ఒక్కో కేసు వీగిపోతూ ప్రజలకు చంద్రబాబు నిజాయితీ ఏమిటో తెలుస్తుందని పేర్కొంది.
నిరూపితం కాని అభియోగాలు
2014-19 నడుమ ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో నిబంధనలను ఉల్లంఘించి వివిధ సాఫ్ట్‌వేర్ కంపెనీలకు టెండర్లను కట్టబెట్టారని, దానివల్ల కార్పొరేషన్‌కు రూ.114 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని అప్పటి ఎండీ మధుసూదన్‌రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో నాటి ఫైబర్‌నెట్ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి హరికృష్ణ, ఎండీ కె.సాంబశివరావు, టెర్రాసాఫ్ట్ డైరెక్టర్ తుమ్మల గోపాలకృష్ణ, చంద్రబాబు (ఏ-25), ముంబై, ఢిల్లీకి చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వాటి ఉన్నతాధికారులను నిందితుల జాబితాలో చేర్చారు. మొత్త్తం 99 మందిని సాక్షులుగా పేర్కొన్నారు.
కేసులో దర్యాప్తు పూర్తయినట్లు కొద్దిరోజుల క్రితం సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకు నివేదిక ఇచ్చారు. అయితే ఖజానాకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని.. కేసును ఉపసంహరించుకుంటున్నట్లు అప్పటి ఎండీ మధుసూదన్‌రెడ్డి గత నెల 24న కోర్టులో అఫిడవిట్ దాఖలుచేశారు. ఇందుకు అభ్యంతరం లేదని ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మ కూడా అఫిడవిట్ ఇచ్చారు. కోర్టు తీర్పు వెలువడుతుందనే సమయానికి ఆ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైసీపీ నేత గౌతంరెడ్డి జోక్యం చేసుకుని తన వాదనలను వినాలని ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి విచారణార్హత లేదంటూ న్యాయాధికారి పి.భాస్కరరావు పిటిషన్‌ను కొట్టివేశారు. ఆ క్రమంలోనే ఫైబర్ నెట్ కేసును కూడా కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు.
ఇవి కూడా చదవండి :
Nidhhi Agerwal | అందాలతో ఆగం చేస్తున్న నిధి అగర్వాల్
Lionel Messi : కోల్ కతాలో ఫుట్‌బాల్ లెజండ్ మెస్సీకి బ్రహ్మరథం
