ప్రత్యర్థుల కుట్రలో భాగమైన వారు వైఎస్ వారసులా?: సీఎం జగన్‌

దివంగత వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కుటుంబంపై కుట్రలు చేసిన శత్రువుల ఇళ్లకు పసుపు చీర కట్టుకొని వెళ్లి.. వారికి మోకరిల్లి.. వారి కుట్రలో భాగమై వారి స్క్రిప్టు చదువుతున్న వాళ్లు వైయస్సార్ వారసులు ఎట్లా అవుతారని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌. జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు

  • Publish Date - April 25, 2024 / 04:00 PM IST

పసుపు మూకల కుట్రలో భాగమైన చెల్లెమ్మలు
వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్‌ను ఓడించాలి
చిన్నాన్నవివేకా హత్య కేసులో అవినాశ్ పాత్ర లేదు
మంచి చేయడమే పులివెందుల కల్చర్‌
పులివెందుల నామినేషన్ సభలో ఏపీ సీఎం వైఎస్‌.జగన్‌

విధాత : దివంగత వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కుటుంబంపై కుట్రలు చేసిన శత్రువుల ఇళ్లకు పసుపు చీర కట్టుకొని వెళ్లి.. వారికి మోకరిల్లి.. వారి కుట్రలో భాగమై వారి స్క్రిప్టు చదువుతున్న వాళ్లు వైయస్సార్ వారసులు ఎట్లా అవుతారని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌. జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. పులివెందుల అసెంబ్లీ స్థానం వైసీపీ అభ్యర్థిగా జగన్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జగన్ మాట్లాడుతూ వైసీపీని, జగన్‌లను దెబ్బ తీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ, ఎల్లో మీడియా ప్రయత్నిస్తుండగా, ఆ కుట్రలో భాగంగా ఈ మధ్య కొత్తగా వైఎస్సార్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారన్నారు. అసలు ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఆయనను అభిమానించిన ప్రజలేనని స్పష్టం చేశారు.

మీ బిడ్డను ఎదుర్కొనలేక వీళ్లంతా ఏకం అయ్యారని, చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు నా ఇద్దరు చెల్లెమ్మలు వైఎస్ కుటుంబం వ్యతిరేక కుట్రలో భాగం అయ్యారన్నారు. వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు?.. నాన్నగారిపై కక్షతో, కుట్రపూర్వకంగా కేసులు పెట్టిందెవరో?. వైఎస్సార్ పేరును ఛార్జిషీట్లో చేర్చిందెవరో?. వైఎస్సార్ కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని, ఆయన విగ్రహాలు తొలగిస్తామని చెబుతున్నవాళ్లతో..పార్టీలతో చేతులు కలిపినవాళ్లా? వైఎస్సార్ వారసులా? అని నిలదీశారు. నాపై బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో మీ అందరికీ కనిపిస్తోందని, పసుపు మూకలతో మన చెల్లెమ్మలు నా వ్యతిరేక కుట్రలో భాగం కావడం దుర్మార్గమన్నారు. చిన్నాన్న వివేకాను అన్యాయంగా ఎన్నికల్లో ఓడించిన వాళ్లతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతు వైఎస్ వారసులమంటున్నారన్నారు. సొంత లాభంకోసం ఎవరు ఈ కుట్ర చేయిస్తున్నారో ప్రజలు గమనించాలని కోరారు.

కాంగ్రెస్‌కు ఓటేస్తే బాబుకు వేసినట్లే

వైఎస్‌ పేరు కనబడకుండా చేయాలని ప్రయత్నించి… రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా?. రాష్ట్ర ప్రత్యేక హోదాను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా?. నోటాకు వచ్చినన్ని ఓట్లు రాని కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా?. కాంగ్రెస్‌కు ఓటేస్తే బాబుకి ఓటేసినట్లు కాదా?. మన ఓట్లు చీలిస్తే చంద్రబాబుకు, బీజేపీకి లాభమా? కాదా? అని జగన్ ప్రశ్నించారు. నా చిన్నాన్న వివేకాను చంపింది ఎవరో దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసన్నారు. వివేకాను చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరు?. వివేకాకు రెండో భార్య ఉన్నది, సంతానం ఉన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

ఆనాడు ఎవరు ఫోన్ చేస్తే.. అవినాష్ అక్కడికి వెళ్లారని?. పలు ఇంటర్వ్యూల్లో అవినాష్ లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అన్నారు. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని, అది బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చానన్నారు. అవినాష్ రెడ్డి జీవితం నాశనం చేయాలని చూడటం దారుణమన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టాడంటున్న బంధువులకు తెలియజేస్తున్నానని, సీఎంగా దేవుడు మీ బిడ్డకు అధికారం ఇచ్చింది డబ్బులు సంపాదించుకోవడం కోసం కాదని, కుటుంబ సభ్యులను కోటీశ్వరులు చేసేందుకు కాదని, పేదలందరికీ మంచి చేసేందుకు మాత్రమేనని, మరింత మంచి చేసేందుకు మరోసారి ఆశీర్వదించాలని కోరారు.

పులివెందుల కల్చర్ అంటే మంచి చేయడమే

విపక్ష నేతలు పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారని, మంచి చేయడం, బెదిరింపులకు లొంగకపోవడం, మాట తప్పకపోవడమే పులివెందుల కల్చర్ అని జగన్ స్పష్టం చేశారు. టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాన్ని ఎదురించింది ఈ పులివెందుల బిడ్డేలేనన్నారు. నా పులివెందుల.. నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం.. ప్రతీ కష్టంలో నా వెంట నడిచిన పులివెందుల జనం కోసం ఏం చేసినా తక్కువేనన్నారు. పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్ స్టోరీ, ఈ అభివృద్ధికి కారణం వైఎస్సార్ అన్నారు.

వైఎస్సార్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వమని, పులివెందులలో ఏం ఉంది? అనే స్థాయి నుంచి పులివెందులలో ఏం లేదు? అనే స్థాయికి చేరుకున్నామని, అందుకే పులివెందుల ఒక విజయగాథ అని జగన్ చెప్పుకొచ్చారు. పరిపాలనలోనూ, పథకాల్లోనూ, సంక్షేమంలోనూ జగన్‌ను ఎవరూ కొట్టలేరని, ఏ రంగంలోనూ జగన్ కంటే మంచి చేశామని విపక్షాలు చెప్పుకోలేరని జగన్ ఎద్దేవా చేశారు. వైఎస్సార్, జగన్ పేర్లు చెరిపేయాలని చూసేవాళ్లు వన శత్రువులేనని, జగన్ బ్రాండ్, వైఎస్సార్ బ్రాండ్‌ను దెబ్బ కొట్టాలని చూస్తున్నవాళ్లకు గుణపాఠం చెప్పడానికి పులివెందుల సిద్ధమా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఎక్కడా లంచాలు, వివక్ష లేని పాలన అందించామని, పులివెందుల వాసుల చిరకాల కల మెడికల్ కాలేజీ త్వరలో ప్రారంభిస్తామన్నారు.

Latest News