AP | ఏపీ ఎన్నికల హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికార, ప్రతిపక్ష వైసీపీ టీడీపీ వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది.

  • Publish Date - May 15, 2024 / 05:40 PM IST

ఢిల్లీకి రావాలంటూ సీఎస్‌, డీజీపీలకు ఆదేశాలు
పోలీసుల తీరుపై ఆగ్రహం
సీఎస్‌, డీజీపీల అత్యవసర భేటీ

విధాత: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికార, ప్రతిపక్ష వైసీపీ టీడీపీ వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. పల్నాడు,చంద్రగిరి, తాడిపత్రి, తిరుపతి, రెంటచింతల, నర్సారావుపేటలో జరిగిన హింసాత్మక ఘటనలపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై సీఎస్, డీజీపీలను వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని, అందుకు ఢిల్లీకి రావాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహార్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీకి వెళ్లి ఈసీ ముందు వివరణ ఇవ్వనున్నారు. ఈ ఘటనలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా వారిద్ధరికి ఈసీ సమన్లు పంపింది. పోలింగ్ సందర్భంగా, అనంతరం జరిగిన ఎన్నికల హింసను ఎందుకు అరికట్టలేకపోయారో వివరణ కోరింది. సమస్యాత్మక ప్రాంతాలలో గొడవలపై ముందే సమాచారం ఉన్నప్పటికి ఎందుకు హింస చెలరేగుతుందని ఈసీ మండిపడింది.

పల్నాడులో స్వయంగా పర్యటించిన ఈసీ ప్రత్యేక అబ్జర్వర్లు రామ్మోహన్ మిశ్రా, దీపక్ మిశ్రాలు పోలీస్ వ్యవస్థ పని తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నివేదిక ఇచ్చినట్లుగా సమాచారం. మూడు రోజులైనా హింసాత్మక ఘటనలను నివారించలేకపోవడంపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కలెక్టర్లకు దిశానిర్దేశం చేయడంలో సీఎస్ విఫలమయ్యారని, డీజీపీ హరీశ్‌ కుమార్ గుప్తా రివ్యూలతో సరిపెడుతున్నారే తప్ప సరైన చర్యలు తీసుకోవడం లేదని ఈసీ విమర్శలు చేసింది.

సీఎస్‌, డీజీపీల భేటీ

సీఈసీ సమన్ల నేపథ్యంలో రేపు ఢిల్లీకి వెళ్లే విషయమై సీఎస్ జవహర్‌రెడ్డితో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా అత్యవసరంగా భేటీ అయ్యారు. ఇద్దరు అధికారులు గురువారం ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వనున్నారు.

Latest News