Site icon vidhaatha

క్షేత్ర స్దాయిలో 1294 మందికి భూసర్వేపై శిక్షణ

విధాత‌: రాష్ట్రము లో రీసర్వే ఎంతో వేగం పుంజుకుంది. రీసర్వే లో రెవిన్యూ శాఖ పాత్ర ఎంతో కీలకమని సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. రీసర్వే లో మొబైల్ మేజిస్ట్రేట్ టీమ్స్ పాత్ర ని దృష్టిలో ఉంచుకుని వారికి సంప్రదాయ సర్వే తో పాటు గా అదునాతన సర్వే లో కూడా ఉత్తమ శిక్షణ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని సిఎం నిర్ణయించారు. భూమి రీసర్వే కార్యక్రమానికి సంబంధించి క్షేత్ర స్దాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చే క్రమంలో సహాయ విభాగ అధికారులు, గ్రామ రెవిన్యూ అధికారులు, రెవిన్యూ సహాయకులకు 15రోజుల ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు సర్వే, సెటిల్ మెంట్, భూమి రికార్డుల కమీషనర్ సిద్దార్ధ జైన్ తెలిపారు. మొత్తం 1294 మందికి ఆగస్టు 26వ తేదీ నుండి పదిహేను రోజుల కాల వ్యవధితో సర్వే శిక్షణ నిర్వహిస్తామని వివరించారు. సామర్లకోట లోని ఆంధ్రప్రదేశ్ సర్వే ట్రైనింగ్ అకాడమీ నేతృత్వంలో జిల్లా కేంద్రాలలో ఈ శిక్షణా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే వివిధ శాఖల నుండి శిక్షణ పొందేందుకు అర్హులైన అభ్యర్థుల జాబితాను తీసుకున్నామని, తాజా శిక్షణలో 991 మంది సహాయ విభాగ అధికారులు, గ్రామ రెవిన్యూ అధికారులు, రెవిన్యూ సహాయకులకు శిక్షణ అందించనుండగా, గతంలో శిక్షణ పొందినప్పటికీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేని 303 మందికి కూడా సప్లిమెంటరీ పరీక్ష నిర్వహిస్తున్నామని కమీషనర్ పేర్కొన్నారు.

రెగ్యులర్ , సప్లిమెంటరీ అభ్యర్థులు మొత్తం 1294 మందికి అమలులో ఉన్న నిబంధనల ప్రకారం జిల్లాల్లో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ద్వారా సంప్రదాయ సర్వేలో 15 రోజులు, పంట నమూనాలో ఒక వారం పాటు సర్వే శిక్షణ ఇవ్వనున్నామని సిద్దార్ధ జైన్ వివరించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న భూమి పునర్వ్యవస్థీకరణ కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని సాంప్రదాయిక సర్వేతో పాటు సిలబస్ లో నూతన విషయాలను కూడా ప్రవేశపెట్టామని ఇటిఎస్, డిజిపిఎస్, నెట్‌వర్క్, ఎస్ఓపి, గ్రౌండ్ ట్రూతింగ్, ఫీచర్ ఎక్స్‌ట్రాక్షన్, గ్రౌండ్ ధ్రువీకరణ వంటి అధునాతన అంశాలను సిలబస్ లో చేర్చామని స్పష్టం చేసారు. ఆగస్టు 26 నుండి ప్రారంభమయ్యే శిక్షణలు అక్టోబర్ 26 నాటికి 60 రోజుల నిర్దేశిత వ్యవధిలో పూర్తవుతాయన్నారు.

కరోనా వల్ల అందిరికీ సామర్లకోట కేంద్రంలో శిక్షణ ఇచ్చే అవకాశం లేనందున జిల్లా స్ధాయిలో ప్రతి బ్యాచ్‌కు 60 మందిని పరిమితం చేస్తూ కార్యక్రమం చేపడతామన్నారు. జిల్లా కలెక్టర్లు నిర్దేశించిన సీనియారిటీ ప్రకారం బ్యాచ్ ల వారీగా శిక్షణ ఉంటుందని, రాష్ట్ర స్దాయి శిక్షణా కేంద్రం ద్వారా శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు శిక్షణ కార్యక్రమానికి అధ్యాపకులుగా వ్యవహరిస్తారని తెలిపారు. శిక్షణ ముగింపులో ప్రతి బ్యాచ్‌కు సర్వే నిర్వహణ పరీక్ష మాదిరిగానే థియరీ, ప్లాటింగ్‌పై తుది పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామన్నారు. థియరీ, ప్లాటింగ్, ప్రాక్టికల్ పరీక్షలను పర్యవేక్షించడానికి సంబంధిత జాయింట్ కలెక్టర్లు ద్వారా రెవెన్యూయేతర విభాగం నుండి బాహ్య పరిశీలకులను నియమిస్తామని, సంబంధిత అసిస్టెంట్ డైరెక్టర్లు ప్రాక్టికల్ పార్ట్ కోసం చీఫ్ ఎగ్జామినర్‌గా వ్యవహరిస్తారని సర్వే, సెటిల్ మెంట్, భూమి రికార్డుల కమీషనర్ సిద్దార్ధ జైన్ వివరించారు. సర్వే కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకతతో వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపధ్యంలో ఈ శిక్షణ ప్రాధన్యత సంతరించుకుందన్నారు.

Exit mobile version