Site icon vidhaatha

YS Jagan Mohan Reddy | ఏపీ పోలీసులకు మాజీ సీఎం జగన్‌ వార్నింగ్.. మీకు సినిమా ఉంటది..

YS Jagan Mohan Reddy | రాష్ట్రంలో నాలుగేళ్ల తర్వాత మళ్లీ తమ ప్రభుత్వం వస్తుందని.. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. చంద్రబాబు ఒత్తళ్లకు తలొగ్గి వైసీపీ శ్రేణులపై అణిచివేతకు పాల్పడిన పోలీసు అధికారులకు అప్పుడు సినిమా చూపిస్తామని హెచ్చరించారు. బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో జగన్‌ పర్యటించారు. పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరావు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం ఏదీ లేదు. కేవలం రెడ్‌బుక్‌ రాజ్యాంగం​ మాత్రమే నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన పరిస్థితులకు నాగమల్లేశ్వరావు, కోర్లకుంట వెంకటేశ్వరరావు కుటుంబాలకు జరిగిన అన్యాయమే నిదర్శనమన్నారు. తన పర్యటనకు పెట్టిన ఆంక్షలు కూడా చంద్రబాబు అప్రజాస్వామిక పాలనను చాటుతున్నాయన్నారు. పోలీసులు చంద్రబాబు పాపంలో భాగం కావొద్దని హితవు పలికారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని చెప్పారు. అందరూ మోసపోయారని.. వెన్నుపోటుకు గురయ్యారని.. ప్రతి ఒక్కరూ బాధ పడుతున్నారన్నారు. ఇది ఎల్లకాలం సాగబోదని.. ప్రజలు, దేవుడు తప్పకుండా మొట్టికాయలు వేస్తారని జగన్ వ్యాఖ్యానించారు. ఎన్నికలలో తమకు అనుకూలమైన పోలీసులను నియమించుకుని కూటమిని గెలిపించుకునేందుకు అన్యాయాలు చేశారని ఆరోపించారు.

కమ్మవాళ్లు వైసీపీలో ఉండొద్దా?

ఏపీలో కొందరు పోలీసులు కుల ఉన్మాదంతో పనిచేస్తున్నారని జగన్‌ మండిపడ్డారు. కమ్మవాళ్లు చంద్రబాబుకి ఊడిగం చేయడానికే పుట్టారా? అని ప్రశ్నించారు. ఇక్కడి డీఎస్పీ హనుమంతరావు కుల ఉన్మాదిగా మారి.. కమ్మ పుట్టుక ఎందుకు పుట్టావంటూ లక్ష్మీనారాయణ అనే కార్యకర్తను ఆయన అవమానించారని.. అది భరించలేక సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడని జగన్ ఆరోపించారు. వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు నాగమల్లేశ్వరరావు, గుత్తా లక్ష్మీనారాయణల ఘటనల నేపథ్యంలో నేను చంద్రబాబును ఒకటే అడుగుతున్నానని.. మా పార్టీలో కమ్మ వాళ్లు ఉండొద్దా? మీ పార్టీ కేవలం వారికేనా? అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

Exit mobile version