సంబరాలకు సిద్ధంగా ఉండండి మళ్లీ మనదే విజయం వైసీపీ శ్రేణులకు ..సజ్జల పిలుపు

మళ్లీ మనదే విజయమని, అందరూ 11గంటలకు సంబరాలకు సిద్ధంగా ఉండాలన వైసీపీ శ్రేణులకు వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు నిచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడిన సజ్జల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వైసీపీదే విజయమన్నది ఇప్పటికే తేలిపోయిందన్నారు

  • Publish Date - June 3, 2024 / 05:27 PM IST

విధాత : మళ్లీ మనదే విజయమని, అందరూ 11గంటలకు సంబరాలకు సిద్ధంగా ఉండాలన వైసీపీ శ్రేణులకు వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు నిచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడిన సజ్జల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వైసీపీదే విజయమన్నది ఇప్పటికే తేలిపోయిందన్నారు. తప్పుడు సర్వేలు చూసుకుని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని వారి సంబరాలు తాత్కాలికం మాత్రమేనని, అసలు సంబరాలు మంగళవారం 11గంటలకు మేం చేస్తామన్నారు. ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నప్పటినుంచి ఈసీ ద్వారా అధికారులపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఎవరెన్ని పాచికలు విసిరిన వైసీపీ ముందు అవి పారవన్నారు. చంద్రబాబుకు అసలు పిక్చర్ తెలుసు కనుక గుమ్మనంగా ఉన్నాడని, లోకేష్ అయితే అసలు అడ్రస్ లేడంటూ ఎద్దేవా చేశారు. జాతీయస్థాయిలో కొన్ని సర్వేలు బీజేపీ కోసమే ఎన్డీఏ వైపు అనుకూల ఫలితాలు ఇచ్చాయని, ఎన్డీఏకు 400 సీట్లు చూపించడం కోసం ఆ సర్వే సంస్థలు అలా సెట్ చేశాయన్నారు. వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూసి జనం నవ్వుకుంటున్నారని సెటైర్లు వేశారు.

ఆఖరి ఓటు లెక్క తేలేదాకా కౌంటింగ్ కేంద్రాల్లోనే ఉండాలి

వైసీపీకి పడిన ప్రతి ఓటును మన ఖాతాలో పడేదాకా కౌంటింగ్ ఏజెంట్లు లెక్కింపు కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయ్యి ఆఖరి ఓటు లెక్క తేలేదాకా అధికారులు డిక్లరేషన్ ఇచ్చేవరకు కౌంటింగ్ కేంద్రాల నుంచి కదలవద్దని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ వివాదంలో వైసీపీ పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసిన మాత్రాన ఈసీ చేసింది తప్పు కాకుండా పోదన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లో ఈసీ జూలైలో ఇచ్చిన గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా కౌంటింగ్‌కు ముందు తన రూల్‌ను సవరిస్తూ సంతకం ఉంటే చాలని చెప్పడం, అది కూడా టీడీపీ వెళ్లి కోరిన తర్వాతా ఈసీ తన రూల్‌ను మార్చుకోవడం మాకు అనుమానస్పదంగా ఉందన్నారు. దేశమంతా కాకుండా కేవలం ఏపీకి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈసీ తన నియమాలను మార్చుకోవడాన్ని మేం సుప్రీంకోర్టులో సవాల్ చేశామన్నారు. తాము ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమంటు మా పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసిందన్నారు. ఇందులో ఎన్నికల సంఘం, న్యాయస్థానాలు రెండు స్వతంత్ర సంస్థలు కావడంతో మా వాదన నెగ్గలేకపోయినా అందులో న్యాయముందన్నారు.

Latest News