Site icon vidhaatha

AP Rains | బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!

AP Rains : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మధ్య బంగాళాఖాతంలో రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

అలాగే రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (భారీ నుంచి అతి భారీ వర్షాలు), నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ (భారీ వర్షాలు) కూడా జారీ చేసింది. ఆగస్టు 31న ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. భారీ వర్షాలు సెప్టెంబర్ 2 వరకు కొనసాగవచ్చని పేర్కొంది. ఈ క్రమంలోనే తదుపరి సూచనల వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు.

మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది వాయవ్య బంగాళాఖాతంలో రేపటికి మరింతగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్పింది. ఈ క్రమంలోనే శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించింది.

కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Exit mobile version