Cyclone Montha : మొంథా తుపాన్ తో అల్లకల్లోలం

మోంథా తీవ్ర తుఫానుగా బలపడింది. ఈ రాత్రికి కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం కాకినాడకు 10వ ప్రమాద హెచ్చరిక జారీ. కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు, అలల ఉద్ధృతి, రోడ్లు ధ్వంసం. అధికారులు, నేవీ సహాయక చర్యల్లో ఉన్నారు.

Cyclone Montha

అమరావతి : పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా బలపడిన మొంథా ఏపీలో అల్లకల్లొలం సృష్టిస్తుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదిలిన తుపాన్ ప్రస్తుతానికి మచిలీపట్నంకి 160 కిమీ, కాకినాడకి 240 కిమీ, విశాఖపట్నంకి 320 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. ఈరోజు రాత్రికి కాకినాడ- మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం దాటే అవకాశం ఉంది. తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులుతో తుఫాన్ విరుచుక పడనుంది. దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. చెట్లు, విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి.

సముద్రంలో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. తీరంలో కూడా10మీటర్లు అలల ఉదృతి భయపెట్టేదిగా ఉంది. 40అడుగుల మేరకు సముద్రం తీరంలో ముందుకు చొచ్చుకు వచ్చింది. తుపాన్ తీరం దాటాక అలల ఉదృతి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తీర ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. పోర్టులను మూసివేశారు.

మొంథా తుపాన్ నేపథ్యంలో ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. తుపాను ప్రభావం చూపే కోస్తా జిల్లాల్లో విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 1800 425 0101లకు ప్రజలు సహాయం కోసం సమాచారం అందించవచ్చన్నారు.

కాకినాడకు పదో ప్రమాద హెచ్చరిక

మొంథా’ తుపాను తీవ్రత పెరుగుతుండటంతో ఏపీలోని పోర్టులకు హెచ్చరికల స్థాయిని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం పెంచింది. కాకినాడ పోర్టుకు పదో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. హుద్ హుద్ తుపాన్ సందర్భంగా 11వ నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. విశాఖపట్నం, గంగవరం పోర్టులకు ఆరు, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఐదో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. కాకినాడ తీరంలో సైక్లోన్ వాల్ 50 కిలోమీటర్లు ఉంటుంందని అధికారులు అంచనా వేశారు. కాకినాడ తీరానికి గ్రేట్ డేంజర్ సిగ్నల్ ను ఐఎండీ జారీ చేసింది. కోనసీమ జిల్లాలలో తుపాన్ తీవ్రత అధికంగా ఉంది. తుపాన్ సహయక చర్యల్లో ఇండియన్ నేవీ కూడా భాగస్వామ్యమైంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుపాన్ ఉదృతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి.