విధాత : గృహనిర్బంధంలో ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈనెల 14న మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పిన్నెల్లి సోదరులను పోలీసులు గృహనిర్బందం చేశారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. గురువారం రాత్రి నుంచి ఎమ్మెల్యే, అతని సోదరుడు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇంటి వద్ద పోలీసులు కాపలా ఉన్నప్పటికీ వారి కళ్లుగప్పి ఎలా వెళ్లారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రక్షణగా ఉన్న గన్‌మెన్లను కూడా వదిలేసి వెళ్లిపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లిన సమాచారాన్ని ఆయన గన్‌మెన్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి తెలియజేయడంతో ఈవిషయం వెలుగు చూసింది. కారంపూడి ఘటన నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతోనే.. పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు విశ్రాంతి కోసమే ఆయన హైదరాబాద్ వెళ్లారని వైసీపీ నేతలు చెబుతున్నారు. పోలీసులు వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.