Site icon vidhaatha

భారీగా పోస్టల్‌బ్యాలెట్లు వైసీపీ నాయకులకు కొత్త తలనొప్పి ఉద్యోగులు, టీచర్లలో వ్యతిరేకత పోస్టల్‌ బ్యాలెట్లలో ప్రతిఫలిస్తుందనే ఆందోళన

అమరావతి: ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో భారీ ఓటింగ్‌ జరగడంపై ఇప్పటికే కలవరంలో ఉన్న వైసీపీకి కొత్తగా పెద్ద ఎత్తున పోలైన పోస్టల్‌ బ్యాలెట్లు ()కొత్త తలనొప్పులు సృష్టిస్తున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన తాజా గణాంకాల ప్రకారం.. 5,39,189 పోస్టల్‌ బ్యాలెట్లు పోల్‌ అయ్యాయి. ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులవే. జగన్‌ ప్రభుత్వంపై ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వీటిలో 99శాతం వైసీపీకి వ్యతిరేకంగానే పోల్‌ అయి ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓట్ల లెక్కింపులో ఇవి ఫలితాన్ని తారుమారు చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. గతంకంటే పోస్టల్‌ బ్యాలెట్లు ఈసారి అధికంగా నమోదయ్యాయని, ఒక రకంగా ఇది దేశంలోనే రికార్డు అని రాజకీయ నేతలు చెబుతున్నారు.

అత్యధికంగా శ్రీకాకుళంలో

అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 పోస్టల్‌ బ్యాలెట్లు నమోదైతే.. తర్వాతి స్థానంలో నంద్యాల జిల్లా 25,283 పోస్టల్ బ్యాలెట్లతో నిలిచింది. 24,918 పోస్టల్ బ్యాలెట్లతో కడప జిల్లా మూడో స్థానంలో ఉన్నది. అత్యల్పంగా నరసాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. ఇప్పటికే పోలైన పోస్టల్ బ్యాలెట్ల వివరాలు అందటంతో ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయాలన్న దానిపై అధికారులు చర్చిస్తున్నారు. ఒక్కో టేబుల్‍లో ఎన్ని పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించాలనే అంశంపై రిటర్నింగ్ అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం పంపిందని సమాచారం. ఈ మేరకు పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించేందుకు ఎన్ని టేబుల్స్‌ వేయాలనే అంశంపై నిర్ణయం జరిగినట్టు తెలుస్తున్నది. పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్, సంతకం లేని వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని టీడీపీ చేసిన విజ్ఞప్తికి రాష్ట్ర సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనా మౌఖికంగా అంగీకరించారని సమాచారం. దీనిపై లిఖిత పూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాలని టీడీపీ కోరింది. డిక్లరేషన్‍పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన సీల్ లేకపోయినా పరిగణలోకి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేసింది. రిటర్నింగ్ అధికారి ఫాసిమెయిల్, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం బాధ్యత ఎన్నికల కమిషన్‍దే అని విపక్ష నేతలు చెబుతున్నారు.

Exit mobile version