వైసీపీ ప్రధాన కార్యదర్శి.. ప్రభుత్వ సలహాదారు సజ్జల
విధాత: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం వైసీపీ పార్టీదేనని, సంపూర్ణ మెజార్టీతో మేం అధికారంలోకి రాబోతున్నామని, జగన్ మరోసారి సీఎం కాబోతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పెరిగిన ఓటింగ్ సరళీ చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోలేమని, గతంలో ప్రభుత్వానికి అనుకూలంగా కూడా ఓటింగ్ పెరిగిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. చంద్రబాబు తను ఇచ్చిన హామీలను కూడా ప్రచారం చేసుకోకుండా, జగన్‌పైన, ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై పైన ప్రధానంగా విమర్శలు చేసి ఓట్లు పొందాలని ప్రయత్నించారన్నారు.
కుప్పంలోనూ వైసీపీ గెలవబోతుందని, జగన్ పాలనకు అనుకూలంగా ప్రజలు ఓట్లు వేశారని, బస్సుల్లో వచ్చి ఓట్లు వేసిన వాళ్లంతా జగన్ సంక్షేమ పథకాల లబ్ధిదారులేనని, మేము ఎవరిని భ్రమలో పెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. మామూలుగా అయితే చంద్రబాబు ఈపాటికే బయటికి వచ్చేవారని, తమ ఓటమి ఖాయమని చంద్రబాబుకు కూడా అర్థమైందని వ్యాఖ్యానించారు. ఈ-ఆఫీస్ మార్చొద్దని చంద్రబాబు లేఖలు రాస్తున్నారని, తానేదో అధికారంలోకి వస్తున్నానన్న ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారని సెటైర్లు వేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై చంద్రబాబు చేసిన తప్పుడు ప్రచారం ఫలితం జూన్ 4న తెలుస్తుందని, ఏపీ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదని నీతి అయోగ్ కూడా చెప్పింది అని గుర్తు చేశారు
ఈసీ పక్షపాత వైఖరితోనే ఘర్షణలు
ఈసీ వైఫల్యం..పక్షపాత ధోరణి వల్లే ఏపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని సజ్జల ధ్వజమెత్తారు.తాడిపత్రిలోని పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులే సీసీ టీవీ కెమెరాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. కూటమి ఏర్పాటు తరువాత చంద్రబాబుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు కనిపిస్తోందని, ప్రస్తుతం పాలన ఈసీ పరిధిలో ఉంది కాబట్టి టీడీపీ తన అనుకూల అధికారులను నియమించుకుందని, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని అధికారం రావాలనేది చంద్రబాబు నైజం అని దుయ్యబెట్టారు.
మేము స్ట్రయిట్‌గా ఉంటామని, అధికారులను మారిస్తే అంతా దారిలోకి వస్తుందన్నారు. కౌంటింగ్ అక్రమాలు జరుగుతాయని మేము అనుకోవడం లేదన్నారు. ఒకవేళ అలాంటివి జరిగినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మాది చాలా బలమైన పార్టీ అని, టెక్నికల్‌గా మేం మేము అధికారంలో ఉన్న ప్రాక్టికల్ గా మేము అధికారంలో లేనట్టే అన్నారు. ఈసీ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఎన్నికలలో హింసాత్మక ఘటనలు జరిగేవి కాదని, ఇకనైనా ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరుతున్నామని సజ్జల విజ్ఞప్తి చేశారు.