Kolikapudi Srinivasa Rao Vs Kesineni Chinni | టికెటో కోసం రూ.5కోట్లు అడిగాడు: కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన వ్యాఖ్యలు

గత ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ కోసం ఎంపీ కేశినేని చిన్ని రూ. 5 కోట్లు అడిగారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణ చేశారు. ట్రాన్స్‌ఫర్ చేసినట్లు మూడు విడతల్లో రూ. 60 లక్షల ఆధారాలను బయటపెట్టారు. దీనిపై చిన్ని కౌంటర్ ఇవ్వగా ఈ వివాదాన్ని టీడీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది.

Controversy Between MLA Kolikapudi Srinivasa Rao And MP Kesineni Chinni

అమరావతి : గత ఎన్నికల్లో తనకు టీడీపీ తిరువూరు టికెట్ ఇవ్వడానికి టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) రూ.5 కోట్లు అడిగాడని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు సంచలన ఆరోపణలు చేశారు. రూ.5 కోట్లు తీసుకుని తనకు తిరువూరు టికెట్‌ ఇచ్చారన్న కొలికపూడి.. సంచలన ఆధారాలను బయటపెట్టారు. తన ఖాతా నుంచి గతేడాది 2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, 8న రూ.20 లక్షలు, ఫిబ్రవరి 14న రూ.20 లక్షలు మూడు దఫాల్లో ట్రాన్స్ ఫర్ చేశానన్నారు. పోరంకిలో శివనాథ్‌ పీఏ మోహన్ కు రూ.50 లక్షలు ఇచ్చానన్నారు. గొల్లపూడిలో తన మిత్రులు రూ.3.5 కోట్లు ఇచ్చారన్నారు. అందుకు సంబంధించిన విషయాల గురించి రేపు మాట్లాడుకుందామన్నారు. ‘నిజం గెలవాలి.. నిజమే గెలవాలవాలి’.. అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

తిరువూరులో దొంగే దొంగ అని అరుస్తున్నాడు: కేశినేని కౌంటర్

మరోవైపు.. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్‌ ఇచ్చారు. తిరువూరులో దొంగే దొంగ అని అరుస్తున్నాడు. నాపై విమర్శలు చేసిన వాళ్లు సాక్ష్యాలు ఇవ్వాలి. నేను డబ్బులు సంపాదించుకోవాలంటే తిరువూరు వరకూ రావాల్సిన అవసరం లేదు. తిరువూరు ఎమ్మెల్యే వ్యవహారశైలి ఇప్పటికే పార్టీ హైకమాండ్ దృష్టికి వెళ్లిందని చిన్ని తెలిపారు. నేను ఎప్పుడు నా జేబులో డబ్బలే ఖర్చు పెడుతానని, అవినీతి చేయాల్సిన అవసరం నాకు లేదన్నారు. ఎంపీ లేకుంటే నేను లేనని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు నాపై ఎందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో ఆయనే సమాధానం చెప్పాలన్నారు.

మరోవైపు కేశినేని చిన్ని, కొలికపూడి శ్రీనివాస్ ల వివాదాన్ని టీడీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. రేపు విజయవాడ పార్టీ అఫీస్ కు రావాలని పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆదేశించారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కొలికపూడి ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.