మైనర్ బాలికపై అత్యాచార యత్నం నిందితుడు నారాయణరావు ఆత్మహత్య
అమరావతి: కాకినాడ జిల్లా తుని(Tuni)లో మైనర్ బాలికపై అత్యాచార యత్నం(minor rape attempt)కు పాల్పడిన తాటిక నారాయణరావు(( Narayana Rao 62) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ సీఐ చెన్నకేశవరావు తెలిపిన వివరాల మేరకు నిన్న సాయంత్రం 5 గంటలకి కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు నారాయణ రావును పోలీస్ వాహనంలో తీసుకెళ్తుండగా కోమటి చెరువు వద్ద బహిర్భూమికి వెళ్లి వస్తానంటూ చెప్పడంతో పోలీసులు అనుమతించారు. అక్కడ చీకటిగా ఉండటం..వర్షం పడుతుండటంతో పోలీసులు చెట్టు కిందకు వెళ్ళారు. అదే సమయంలో చెరువు వైపు శబ్దం రావడంతో వెళ్లి చూడగా..నారాయణ రావు అక్కడ కనిపించలేదు. అతను చెరువులో దూకాడని నిర్థారించుకుని మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. .గురువారం ఉదయం నారాయణరావు మృతదేహం లభించింది.
నారాయణ రావు తన మనవరాలి వయసున్న బాలికను గురుకుల పాఠశాల నుంచి ఆమెకు తాతగా చెప్పుకుని బయటకు తీసుకెళ్లాడు. అలా మూడుసార్లు ఆ బాలికను తీసుకెళ్లి తొండంగి సమీపంలోని ఓ తోట వద్ద అఘాయిత్యానికి పాల్పడ్డాడని సీఐ తెలిపారు. తోట యజమాని చొరవతో విషయం వెలుగు చూడగా..దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచే సమయంలో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే నారాయణరావు మృతిపై అతని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే నారాయణ రావు మరణానికి కారణమని ఆరోపిస్తున్నారు.