అమరావతి : కేవలం ఒక్క రూపాయికే అరకేజీ చికెన్..దివంగత సీఎం ఎన్టీఆర్ పథకం రూ.2కే కిలో బియ్యం తరహాలో రెండు రూపాయలకే కిలో చికెన్ అంటే ఎవరు ఆగుతారు. అందుకే అలాంటి ఆఫర్ పెట్టిన చికెన్ దుకాణం వద్దకు చికెన్ ప్రియులు పరుగు తీశారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర చికెన్ సెంటర్ యజమాని శ్రీనివాసరావు తన వ్యాపారాన్ని పెంచుకునే క్రమంతో వినూత్న ఎత్తుగడ వేశారు. 1 రూపాయి నోటు తెచ్చినవారికి అరకేజీ చికెన్ అందిస్తున్నట్టుగా బంపర్ ఆఫర్ అంటూ ప్రచారం చేశారు. దీంతో చికెన్ కొనుగోలు చేసేందుకు రూపాయి నోట్లతో పెద్దఎత్తున స్థానికులు ఎగబడ్డారు. కొందరు 5-10 వరకు 1రూపాయి నోట్లు తెచ్చి చికెన్ తీసుకెళ్లారు. ఒక్క రోజులోనే దాదాపు వందకు పైగా పాత ఒక రూపాయి నోట్లు శ్రీనివాసరావుకు అందాయి.
ఇంతకు తనకు వచ్చిన 1రూపాయి నోట్లను ఏం చేస్తావన్న ప్రశ్నకు శ్రీనివాసరావు ఆసక్తికర సమాధానమిచ్చారు. 1రూపాయి పాత నోట్లతో తాను ఆర్ట్ ఫీసులు తయారు చేసే వ్యాపారం చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
