విధాత : పెర్త్ వేదికగా యాషెస్ సిరీస్ తొలి టెస్టులో మొదటి రోజున ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు ఇంగ్లాండ్ జట్టు 32.5ఓవర్లకే 172పరుగులకు కుప్పకూలింది. మిచెల్ స్టార్క్ 7వికెట్లతో ఇంగ్లాండ్ వెన్ను విరిచాడు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ తీసుకుంది.ఆట ప్రారంభం నుంచి వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (52 పరుగులు, 61బంతుల్లో 5ఫోర్లు, 1సిక్స్)తో రాణించాడు. పోప్(46), జేమీ స్మిత్ (38), డకెట్(21) పరుగులు సాధించారు. జాక్ క్రాలే(0), జోరూట్(0), కెప్టెన్ బెన్ స్టోక్స్(6), అట్కిన్సన్(1), కార్స్(6), మార్క్ ఉడ్(0) పరుగులకు అవుటయ్యారు. ఆర్చర్(0) నాటౌట్ గా ఉన్నారు, ఆసీస్ బౌలర్లలో స్కార్క్ 12.5ఓవర్లు వేసి 58పరుగలుకు 7వికెట్లు కూల్చాడు. డగెట్ 2, గ్రీన్ 1 వికెట్ తీశారు.
ఆదిలోనే అసీస్ కు ఎదురుదెబ్బ
ఇంగ్లాండ్ ను తొలి ఇన్నింగ్స్ లో స్వల్ప స్కోరుకు అలౌట్ చేసిన ఆనందం అసీస్ కు ఎంతో సేపు నిలవలేదు. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ వెదర్లాడ్(0), లబుషైన్(9), కెప్టెన్ స్టీవెన్ స్మిత్(17), ఉస్మాన్ ఖవాజా(2) పరుగులకే అవుటైపోవడం ఆ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చింది. 19ఓవర్లలో 38పరుగులకే 4వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా పరుగుల కోసం తంటాలు పడింది. ఆ తర్వాతా ట్రావిస్ హెడ్ (21), కామెరూన్ గ్రీన్ (24), మిచెల్ స్టార్క్ (12), అలెక్స్ క్యారీ (26), స్కాట్ బోల్యాండ్ (0) వరుసగా పెవిలియన్ చేరారు. ఆస్ట్రేలియా జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 123 పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజులో నాథన్ లయన్ (3*), బ్రెండన్ డొగ్గెట్ (0*) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ చెరో 2వికెట్లు, సాధించి ఆసీస్ ను దెబ్బకొట్టారు.
