కర్నూలు,గోనెగండ్ల: బంధువుల వివాహానికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన మహిళను సన్నిహితుడే హత్య చేసి పెట్రోలు పోసి నిప్పంటించిన వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామీణ సీఐ మంజునాథ్ వివరాల మేరకు గోనెగండ్ల మండలం బైలుప్పలకు చెందిన హరిజన లక్ష్మికి వివాహమైన తొమ్మిదేళ్లకు భర్త చనిపోయారు. ముగ్గురు కుమార్తెలతో ప్రస్తుతం పుట్టినిల్లు బైలుప్పలలో నివాసముంటున్నారు. ఆస్పరి మండలం ములుగుందం సచివాలయంలో జేఎల్‌ఎంగా పనిచేస్తున్న దేవదాసుతో ఆమె సన్నిహితంగా ఉండేది. అయన అగ్రహారంలో నివాసముంటున్నారు.
ఇటీవల ఈమె ఇతరులతో చనువుగా ఉండడంతో ఆమెను నిలదీశాడు. నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పగ పెంచుకున్నాడు. జూన్ 7వ తేదీన ఆదోనిలో బంధువుల వివాహానికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన లక్ష్మి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆదోని, ఇతర ప్రాంతాల్లో గాలించి గోనెగండ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు ఆమె హత్యకు గురైనట్లు ఛేదించారు.
కాల్ డేటా కూపీ లాగితే..
లక్ష్మి అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె చరవాణి కాల్ డేటాను పరిశీలించారు. దేవదాసుతో సన్నిహితంగా ఉంటూ ఫోన్ చేసినట్లు గమనించి అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆమెను హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. జూన్ 7న వివాహానికి లక్ష్మి ఆదోనికి వెళ్లడం గమనించిన దేవదాస్ వెంట వెళ్లాడు. అనంతపురం జిల్లా గుంతకల్‌లోని చర్చికి వెళ్లి వస్తే గొడవలుండవని మాయమాటలు చెప్పారు. తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని వెళ్తూ మార్గ మధ్యంలో బహిర్భూమికి వెళ్తానంటూ కసాపురం సమీపంలోని జీఎన్‌ఎస్‌ఎస్ కాల్వ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె ఇతరులతో చనువుగా ఉండడంతో గొడవపడి గొంతు నులిమాడు. ఊపిరాడక ఆమె చనిపోవడంతో ఎవరైనా గుర్తుపడతారని అనుమానంతో శరీరంపై పెట్రోలు పోసి తగలబెట్టాడు. ఆమె వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలు తీసుకున్నాడు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న అతడిని శనివారం(జూలై 10) పోలీసులు అరెస్టు చేశారు. ఆభరణాలతోపాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఎస్సైలు సురేష్‌కుమార్, సునీల్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.