విధాత ప్రత్యేకం: ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటివరకు అక్కడ ద్విముఖపోరు జరుగుతుంది అనుకున్నారు. కానీ 2023 డిసెంబర్ 15న జనవరిలో కాంగ్రెస్‌లోకి షర్మిల? 2024 జనవరి 13న’కీలక మార్పుల దిశగా ఏపీ రాజకీయాలు!’ అనే కథనాలతో ‘విధాత’ అందరికంటే ముందుగానే ఏపీలో త్రిముఖ పోరు తప్పదని తేల్చి చెప్పింది. ఎలాంటి హడావుడి లేకుండా కాంగ్రెస్ అధిష్ఠానం కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం నుంచి ఏపీ రాజకీయాలపై దృష్టి సారించింది. 2004, 2009లో యూపీఏ అధికారంలోకి రావడంలో ఏపీది కీలక పాత్ర అన్న విషయం విదితమే. విభజన తర్వాత ఏపీలో తుడిచిపెట్టుకుపోయిన పార్టీని పునర్నిర్మించాలని, అక్కడ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని భావించింది. దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించింది. కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ కుటుంబానికి ఏపీ ప్రజలతో ఉన్న అనుబంధం విడదీయలేనిది అన్నది కాంగ్రెస్ పెద్దల అభిప్రాయం. అందకే పార్టీలోకి షర్మిలను ఆహ్వానించి ఇప్పుడు ఆమెకే పార్టీ ఏపీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించింది. జగనన్న వదిలిన బాణాన్ని నేను అని షర్మిల బాహాటంగానే ఆయన జైలులో ఉన్న సమయంలో వైసీపీ బలోపేతం కోసం కృషి చేశారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చే వరకు ఆమె తన అన్నకు అండగా ఉన్నారు.
అంతకు ముందు 2014లో వైసీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటు స్థానంతో పాటు ఖమ్మం జిల్లాలో మూడు సీట్లు సాధించింది. 2.52 శాతం ఓట్లు దక్కించుకున్నది. ఆ తర్వాత పరిణామాలతో ఏపీలో అధికారంలోకి రావాలంటే అక్కడి ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించుకుని 2018లో ఎన్నికలు దూరంగా ఆ పార్టీ ఉన్నది. వైసీపీ తెలంగాణలో జెండా ఎత్తేసిన తర్వాతే షర్మిల ఇక్కడ పార్టీ ప్రారంభించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరూ రెండు వేర్వేరు పార్టీల అధ్యక్షులుగా ఉన్నారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తామని ప్రకటించాయి. బీజేపీ కూడా జనసేన పొత్తు కోసం ఇప్పటికీ ద్వారాలు తెరిచే ఉంచింది. జనసేన అధినేతను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలను కొనసాగిస్తున్నది. వామపక్షాల్లో సీపీఐ.. టీడీపీ, జనసేన కూటమితోనే ఉన్నది. సీపీఎం మాత్రం తటస్థంగా ఉన్నది. ఇండియా కూటమిలో వామపక్షాలు భాగస్వాములు కాబట్టి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లే అవకాశాలున్నాయి. అలాగే మొన్నటిదాకా అక్కడ ప్రధాన పోరు టీడీపీ+జనసేన వర్సెస్ వైసీసీ మధ్యే ఉంటుందని, అక్కడ అధికార పార్టీకి ఓటమి తప్పదని కొన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. షర్మిల ఎంట్రీతో ఏపీ రాజకీయాలు ఇప్పటివరకు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క అన్నవిధంగా తయారయ్యాయనే చర్చ నడుస్తున్నది. వైసీపీపై పోరుకు ఆమె సిద్ధం కావడంతో త్రిముఖ పోరులో ఏ పార్టీకి మేలు జరుగుతుంది? ఏ పార్టీకి నష్టం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
పదేళ్ల కేంద్ర ప్రభుత్వం, విభజన తర్వాత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ, వైసీపీలు ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు అని ఏపీ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో, విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు సంబంధించిన అంశాలు ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కీలకం కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నది. నాటి యూపీఏ ప్రభుత్వం విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ ప్రభుత్వంతో పాటు వాటిని సాధించడంలో టీడీపీ, వైసీపీ విఫలమయ్యాయి అన్నది ఆ పార్టీ విమర్శ. కాబట్టి ఏపీ ఎన్నికల తీర్పు ఈసారి ఏకపక్షంగా ఏ పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశాలు లేవు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వివిధ సర్వే సంస్థ రెండు నెలలుగా అక్కడి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఏపీలో ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి అధికారపార్టీ కొంతమంది సిట్టింగులను మారుస్తున్నది. వాళ్లు కూడా వేరే పార్టీ నుంచి బరిలో ఉండనున్నారు. కనుక ఆయా నియోజకవర్గాల్లో ఓట్లు చీలుతాయి. ఫలితంగా టీడీపీ+జనసేస, వైసీసీలలో ఎవరికి లాభం జరుగుతుంది? ఎవరికి నష్టం జరుగుతుంది అనే చర్చ జరుగుతున్నది.