ఢాకా : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఏడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో 44 మంది సజీవదహనం అయ్యారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడినట్లు బంగ్లాదేశ్ హెల్త్ మినిస్టర్ సమంతా లాల్ సేన్ మీడియాకు వెల్లడించారు. క్షతగాత్రులను ఢాకా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఢాకాలోని బెయిలే రోడ్డులో ఉన్న ఏడు అంతస్తుల భవనంలో పాపులర్ బిర్యానీ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్‌లో గ్యాస్ సిలిండర్లు పేలి మంటలు చెలరేగాయి. దీంతో పై అంతస్తులకు మంటలు వ్యాపించాయి. పై అంతస్తుల్లో ఉన్న వారు మంటలను గమనించి కిందకు దిగారు. ఈ క్రమంలో చాలా మంది గాయపడ్డారు.
అగ్నిమాపక సిబ్బంది 75 మందిని ప్రాణాలతో కాపాడారు. రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఏడు అంతస్తుల భవనంలో రెస్టారెంట్లతో పాటు బట్టలు, మొబైల్ దుకాణాలు కూడా ఉన్నాయన్నారు.
ఈ సందర్భంగా ఓ వ్యక్తి మాట్లాడుతూ.. మంటలు చెలరేగిన సమయంలో మేం ఆరో అంతస్తులో ఉన్నాం. మెట్ల మార్గంలో పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. ప్రాణాలతో బయటపడాలని భావించి, వాటర్ పైపుల ద్వారా కిందకు దిగాం. కొందరు కిందకు దూకినట్లు తెలిపాడు.
బంగ్లాదేశ్‌లో అపార్ట్‌మెంట్లు, ఫ్యాక్టరీ కాంప్లెక్సుల్లో అగ్నిప్రమాదాలు తరుచుగా జరుగుతుంటాయి. సేఫ్టీ రూల్స్ పాటించకపోవడమే ఈ ప్రమాదాలకు కారణం. 2021, జులైలో ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి 52 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో చిన్నారులు కూడా ఉన్నారు. 2019, ఫిబ్రవరిలో ఢాకాలోని అపార్ట్‌మెంట్ బ్లాకుల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 70 మంది మృతి చెందారు.