Site icon vidhaatha

పాడి రైతుగా మారిన సివిల్ ఇంజినీర్.. 30 బ‌ర్రెల‌తో నెల‌కు రూ. 2.52 ల‌క్ష‌ల ఆదాయం

ఇటీవ‌లి కాలంలో చాలా మంది ఇంజినీర్లు త‌మ అత్యున్న‌త‌మైన ఉద్యోగాల‌ను వ‌దులుకొని వ్య‌వ‌సాయం బాట ప‌ట్టారు.. ప‌డుతూనే ఉన్నారు. అమెరికా లాంటి అగ్ర‌దేశాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా సెటిలైన్ వారు కూడా స్వ‌దేశానికి వ‌చ్చి అన్న‌దాత‌లుగా మారి లాభాలు గ‌డిస్తున్నారు. ఇలా ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఓ సివిల్ ఇంజినీర్ కూడా త‌న ఉద్యోగాన్ని వ‌దిలేసి పాడి రైతుగా మారాడు. నెల‌కు ల‌క్ష‌ల్లో సంపాదించి.. అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. మ‌రి ఆ సివిల్ ఇంజినీర్ గురించి తెలుసుకోవాలంటే.. మంచిర్యాల జిల్లాకు వెళ్లాల్సిందే.

మంచిర్యాల జిల్లా జ‌న్నారం మండ‌లం మొర్రిగూడ గ్రామానికి చెందిన జాడి సురేంద‌ర్(౩౩) బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చ‌దివాడు. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ జేఎన్టీయూలో ఎంటెక్ స్ట్ర‌క్చ‌ర‌ల్ ఇంజినీరింగ్ ప‌ట్టా పుచ్చుకున్నాడు. ఓ ప్ర‌ముఖ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీలో అత‌నికి ఉద్యోగం వ‌చ్చింది. నెల‌కు రూ. 80 వేల జీతం. కానీ అత‌నికి ఆ ఉద్యోగం చేయ‌డం ఇష్టం లేదు. పాడి రైతుగా మారాల‌ని, ఆ ప‌రిశ్ర‌మ‌లో ఒక‌స్థాయికి ఎద‌గాల‌నే ఆలోచ‌న త‌న‌లో వ‌చ్చింది. ఇక ఒక్క క్ష‌ణం కూడా ఆలోచిచంకుండా త‌న ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

ఇది సాధ్య‌మ‌య్యే ప‌నేనా..?

త‌న సొంతూరు మొర్రిగూడ‌కు సురేంద‌ర్ వెళ్లిపోయాడు. పాడి ప‌రిశ్ర‌మ పెట్టాల‌నుకుంటున్న‌ట్టు ఇంట్లో పేరెంట్స్‌కు చెప్పాడు. ప్ర‌స్తుతం నిత్యావ‌స‌రాల్లో పాలు అనేది చాలా వ‌ర‌కు ఇంపార్టెంట్. మ‌హిళ‌లు, చిన్నారులు ఆరోగ్యంగా ఉండేందుకు క‌ల్తీ లేని పాలు అందించాల‌నేది త‌న ల‌క్ష్య‌మ‌ని సురేంద‌ర్ చెప్పాడు. సురేంద‌ర్ ఆలోచ‌న‌ను త‌ల్లిదండ్రులు స్వీక‌రించిన‌ప్ప‌టికీ, గ్రామ‌స్తులు మాత్రం హేళ‌న చేశారు. ఇది సాధ్య‌మ‌య్యే ప‌నేనా..? అని చుల‌క‌న చేశారు.

30 బ‌ర్రెల‌తో నెల‌కు రూ. 2.52 ల‌క్ష‌ల సంపాద‌న‌

ఇక మొత్తానికి సురేంద‌ర్ పాడి ప‌రిశ్ర‌మ ప్రారంభించాడు. త‌న‌కున్న మూడు ఎక‌రాల పొలంలో 2021లో పాడి ప‌రిశ్ర‌మ‌ను స్థాపించాడు. మొత్తం 30 బ‌ర్రెల‌ను పెంచుతున్నాడు. ప్ర‌తి రోజు ఆ బ‌ర్రెల నుంచి 120 లీట‌ర్ల దాకా పాల‌ను సేక‌రిస్తున్నాడు. ఆ పాల‌ను స్థానికుల‌కు, హోట‌ళ్ల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్నాడు. లీట‌ర్ పాల‌ను రూ. 70కి విక్ర‌యించి, నెల‌కు రూ. 2.52 ల‌క్ష‌ల‌ను సంపాదిస్తున్నాడు సురేంద‌ర్.

అన్నీ ఖ‌ర్చులు పోగా.. రూ. ల‌క్ష లాభం..

ఈ సంద‌ర్భంగా సురేంద‌ర్ మాట్లాడుతూ.. ఇదంతా త‌న‌కు జంతువుల‌పై ఉన్న ప్రేమ‌తో సాధ్య‌మైంద‌న్నారు. క‌ల్తీ లేని పాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తుండడంతో త‌న‌కెంతో సంతోషంగా ఉంద‌న్నారు. నెల‌కు రూ. 2.52 ల‌క్ష‌లు సంపాదిస్తున్నాన‌ని తెలిపాడు. పశుగ్రాసం, గేదెల పోషణ, కూలీలకు, ఇతర ఖర్చుల కోసం రూ.1.52 లక్షలు వెచ్చిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తాను సులువుగా రూ. లక్ష లాభాన్ని పొందుతున్న‌ట్లు తెలిపాడు. కూలీలను బీహార్ నుంచి తీసుకొచ్చిన‌ట్లు పేర్కొన్నాడు. ప్ర‌యివేటు ఉద్యోగంతో పోలిస్తే.. పాడి రైతుగా త‌న జీవితం ఎంతో సంతృప్తిగా ఉంద‌న్నారు సురేంద‌ర్. తొలి ప్రయత్నంలోనే పాడి పరిశ్ర‌మ‌లో విజ‌యం సాధించడంతో ఉత్సాహంగా ఉన్న సురేందర్, ఈ ఏడాది నుంచి దేశీయ జాతి కోళ్ల‌కు సంబంధించిన గుడ్ల‌ను ఉత్ప‌త్తి చేస్తున్నాడు. దీంతో పాటు గొర్రెల‌ను కూడా పెంచుతున్నాడు. 

Exit mobile version