ముంబై : మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మధ్య వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. శివసేనకు చెందిన విజయ్ శివతారేను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే మహయుతి పొత్తు నుంచి తప్పుకుంటామని ఎన్సీపీ హెచ్చరిస్తోంది. ఎందుకంటే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను లక్ష్యంగా చేసుకుని శివసేనకు చెందిన విజయ్ శివతారే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ నుంచి విజయ్ శివతారే సస్పెండ్ చేయాలని ఎన్సీపీ అధికారి ప్రతినిధి ఉమేశ్ పాటిల్ డిమాండ్ చేశారు. గత వారం బెదిరింపులకు పాల్పడ్డ విజయ్ శివతారే.. మళ్లీ ఇప్పుడు అసభ్యకరమైన పదజాలంతో అజిత్ పవార్‌ను దూషించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శివతారేను శివసేన నుంచి తప్పిస్తేనే తమకు మనశ్శాంతి ఉంటుందని, లేని పక్షంలో మహాయుతి నుంచి వైదొలగుతామని ఉమేశ్ పాటిల్ తేల్చిచెప్పారు.
తమ నాయకుడు అజిత్ పవార్‌ను అనుచిత, అభ్యంతర వ్యాఖ్యలతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇది ఏ మాత్రం సహించదగ్గ విషయం కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్సీపీ, శివసేన కార్యకర్తలకు మంచిది కాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల చివరకు మహయుతి గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు పాటిల్. ఈ వ్యాఖ్యలను ఆపేలా చర్యలు తీసుకోవాలి లేదంటే శివతారేను శివసేన నుంచి తొలగించాలని ఉమేశ్ పాటిల్ పేర్కొన్నారు.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి పోటీ చేస్తానని శివతారే ఇటీవలే మీడియాతో చెప్పారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి సునేత్ర పవార్(అజిత్ పవార్ భార్య) బరిలో దిగుతున్నట్లు పేర్కొన్నారు. అయితే తనను బారామతి నుంచి పోటీ చేయాలని తన మద్దతుదారులు కోరుతున్నారు. రాజకీయాలు శుభ్రం కావాలంటే తాను ముందుండాలన్నారు. తనకు ఓటర్ల నుంచి విశేష స్పందన లభిస్తోందని శివతారే చెప్పారు. తనతో వేదిక పంచుకోవడానికి తాను ఏ పెద్ద నాయకుడిని అనుమతించను. సామాన్యులు మాత్రమే తన వెంట ఉంటారని చెప్పారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తానని శివతారే చెప్పారు.