Apples |ఆపిల్ పండు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఈ పండ్లలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే ఒక ఆపిల్ పండు తింటే శరీరానికి ఎంతో శక్తినిస్తుంది. ఆపిల్ తింటే డాక్టర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కాబట్టి అన్ని వయసుల వారు ప్రతి రోజు ఒక ఆపిల్ తినడం తప్పనిసరి చేసుకోవాలి. అయితే ఆపిల్ పండ్లను ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పగటి పూట తింటేనే మంచిదని, రాత్రి సమయాల్లో తినడం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అని పేర్కొంటున్నారు.
ముఖ్యంగా అజీర్ణం, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారు రాత్రి పూట ఆపిల్ పండు తినకూడదు. రాత్రి పూట తినడం వల్ల అవి సరిగా జీర్ణం కావు. జీర్ణ సమస్యలకు ఆటంకం కలిగి.. అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి రాత్రి పూట కాకుండా ఎప్పుడైనా ఆపిల్ తినొచ్చు. రాత్రిపూట తింటే మలబద్ధకాన్ని, గ్యాస్టిక్ సమస్యలను పెంచే ఆపిల్… ఉదయం పూట తింటే మాత్రం ఆ సమస్యలను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి పూట జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది కాబట్టే.. ఆ సమయంలో తినకపోవడం మంచిది.
ఆపిల్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి.. జీర్ణ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. బరువు తగ్గాలనుకునే వారు కూడా రోజూ ఆపిల్ తినడం అలవాటు చేసుకోవాలి. ఈ పండ్లు తింటే పొట్ట నిండిన భావన త్వరగా కలుగుతుంది. కాబట్టి ఇతర ఆహారాలను తినడం తగ్గిస్తారు. అలా ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు.
రక్త హీనత సమస్యతో బాధపడుతున్నవారు కూడా యాపిల్ పండ్లను తినడం అలవాటు చేసుకుంటే మంచిది. ఈ పండ్లను తినడం వల్ల రక్తం అధికంగా ఉత్పత్తి అవుతుంది. రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. కాబట్టి మహిళలు, పిల్లలు కచ్చితంగా రోజుకో ఆపిల్ పండు తినడం మంచిది.
ఆపిల్ పండ్లు గుండెపోటును నివారిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను ఆపిల్స్ అదుపులో ఉంచుతాయి. దీంతో గుండె పోటు వచ్చే అవకాశం తక్కువ. శరీరం నీరసంగా ఉన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఆపిల్స్ తింటే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. చర్మం కూడా మెరిసిపోతోంది.