Ramayana | బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ ‘రామాయణం’ సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్ బయటకు వస్తున్నది. ఈ చిత్రంలో రాముడి పాత్రకు బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌ను ఖరారు చేశారు. సీత పాత్రలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించనున్నది. సూపర్ స్టార్ యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. నిర్మాతలు సినిమాను ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొన్నది. సినిమా ప్రకటించినా ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందనే తెలియరాలేదు. ఇక ప్రేక్షకుల నిరీక్షతనకు త్వరలోనే తెరపడనున్నది. సమాచారం మేరకు దర్శకుడు నితీశ్ తివారీ చిత్రం షూటింగ్‌లో ఏప్రిల్‌లో మొదలుపెట్టనున్నట్లు తెలుస్తున్నది. ఏప్రిల్ 17న శ్రీరామనవమి రోజున షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్‌తో పాటు లారా దత్తా, సన్నీడియోల్, బాబీ డియోల్, అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్‌తో మరికొందరు ప్రముఖ నటులు రామాయణంలో భాగం కానున్నారు. ప్రస్తుతం ఇంకా సినిమాలో నటీనటులను ఎంపిక చేసే పనుల్లో ఉన్నారని.. ప్రస్తుతం కొందరు నటీనటులకు లుక్ టెస్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తన్నది. నటీనటులన ఎంపిక పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా ఫిలిం సిటీల్లో వేర్వేరు సెట్లలో షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. నితీశ్ తివారీ కూడా లండన్‌లో 60 రోజుల షూటింగ్ షెడ్యూల్‌ను ఉంచి సినిమాలోని కొన్ని భాగాలను చిత్రీకరిస్తాడనే టాక్ నడుస్తున్నది. రామాయణంలోని లంక భాగాన్ని లండన్‌లో చిత్రీకరిస్తారని, ఇందులో రణబీర్‌తో పాటు సూపర్ స్టార్ యశ్ సైతం పాల్గొంటారని టాక్. దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉన్నది.