స్మృతి రాణించిన ఆర్సీబీకి త‌ప్ప‌ని ఓట‌మి..ఆర్సీబీ ప్లేయ‌ర్ ఫీల్డింగ్‌కి అంద‌రు ఫిదా

  • Publish Date - March 1, 2024 / 01:35 AM IST

ప్ర‌స్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్ హోరా హోరీగా న‌డుస్తుంది. ఉమెన్స్ మ్యాచ్‌ల‌కి కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. క్రికెట‌ర్స్ అద్భుతంగా ఆడుతూ ప్రేక్ష‌కులు ఉర్రూత‌లూగిపోయేలా చేస్తున్నారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), ఢిల్లీ క్యాపిటల్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌గా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యం సాధించింది. వ‌రుస‌గా రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆర్సీబీ మూడో మ్యాచ్ కూడా గెలిచి హ్యాట్రిక్ కొడుతుంద‌ని అంద‌రు అనుకోగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు స‌మిష్టిగా రాణించి ఆర్సీబీకి పెద్ద షాకే ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు చేసింది.

షెఫాలీ వర్మ(31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. అలిస్ క్యాప్సీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) అద్భుత‌మైన‌ ఇన్నింగ్స్ ఆడింది. చివర్లో మరిజన్నే కాప్(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 32), జెస్ జొనాస్సెన్(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్)మెరుపులు మెరిపించ‌డంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు మంచి టార్గెట్ సెట్ చేసిన‌ట్టు కనిపించింది .ఇక భారీ లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 169 పరుగులు చేసి 25 ప‌రుగుల తేడాతో ఓటమిపాలైంది. స్మృతి మంధాన(43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగినా.. మిగతా బ్యాటర్లు ఎవ‌రు పెద్ద‌గా రాణించ‌క‌పోవ‌డంతో ఆర్సీబీకి ఓట‌మ త‌ప్ప‌లేదు.

ఢిల్లీ బౌలర్లలో మరిజన్నే కేప్, తెలుగు తేజం అరుంధతి రెడ్డి రెండేసి వికెట్లు తీయగా.. జెస్ జోనాస్సెన్ మూడు వికెట్లు తీసి ఆర్సీబీకి హ్యాట్రిక్ విజ‌యం ద‌క్క‌కుండా చేశారు. ఈ మ్యాచ్‌కు ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ ఎల్లిస్ పెర్రీ దూరంగా ఉండ‌డం టీంకి పెద్ద‌గా లోటుగా క‌నిపించింది. అయితే ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ ప్లేయర్ జార్జియా వేర్‌హామ్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.నడిన్ డి క్లర్క్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో మూడో బంతిని షెఫాలీ వర్మ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్‌కు ప్రయత్నించగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న వేర్‌హామ్ అమాంతం గాల్లోకి ఎగిరి ఎడమ చేతితో బంతిని లోపలికి నెట్టేసి కేవ‌లం రెండు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చింది. వేర్‌హామ్ ఫీల్డింగ్ విన్యాసానికి అంద‌రు ఫిదా కావ‌డ‌మే కాక ఆమెపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

Latest News