అమెరికన్‌ సింఘంకు ఈడీ నోటీసు

న్యూస్‌ క్లిక్‌ కేసులో అమెరికన్‌ మిలియనీర్‌ నెవిల్లే రాయ్‌ సింఘంకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గురువారం తాజా నోటీసులు జారీ చేసింది.

  • Publish Date - November 16, 2023 / 08:41 AM IST

న్యూస్‌క్లిక్‌ కేసులో విచారణకు రావాలని ఆదేశం

న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో విచారణకు హాజరుకావాలని అమెరికాకు చెందిన మిలియన్‌ నెవిల్లే రాయ్‌ సింఘంకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గురువారం తాజా నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన చైనాలోని షాంఘైలో ఉంటున్నారు. భారతదేశంలో చైనా ప్రచారాన్ని చేస్తున్నారని ఆయనపై అభియోగం. విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. ఆయన స్టేట్‌మెంట్‌ రికార్డు చేసేందుకు ఢిల్లీ కోర్టు లెటర్స్‌ రొగేటరీ (ఎల్‌ఆర్‌) జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నది.


2021లో దర్యాప్తు మొదలు పెట్టిన తర్వాత గత ఏడాది సింఘంకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజా నోటీసు రెండోది. రెండు నెలల క్రితం న్యూస్‌క్లిక్‌పై ఎస్‌సీఆర్‌ఏ ఉల్లంఘన కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సింఘంను నిందితుడిగా చేర్చారు. భారత్‌లో చైనా ప్రచారం నిర్వహించేందుకు చైనా సంబంధాలు ఉన్నవారి నుంచి నిధులు అందుకుంటున్నదనే ఆరోపణల్లో న్యూస్‌క్లిక్‌పై ఉగ్రవాద నిరోధక చట్టం (ఉపా) కింద కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈడీ 2021 సెప్టెంబర్‌లో మొదటిసారి ఢిల్లీలోని న్యూస్‌క్లిక్‌ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఈ కేసులో న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ సహా 25 మంది స్టేట్‌మెంట్‌లను ఈడీ సేకరించింది.

Latest News