మ‌రోసారి స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న ఇంగ్లండ్‌.. ఎంత స్కోరుకి ఆలౌట్ అయ్యారంటే..!

  • Publish Date - March 7, 2024 / 10:16 AM IST

ప్ర‌స్తుతం ఇండియా- ఇంగ్లండ్ మ‌ధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. తొలిమ్యాచ్‌లో ఇంగ్లండ్ మంచి విజ‌యం సాధించగా, త‌ర్వాత జ‌రిగిన మూడు మ్యాచ్‌ల‌లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించి టెస్ట్ సిరీస్ సొంతం చేసుకుంది. ఈ రోజు నుండి చివ‌రిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతుంది. ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే స్పిన్ మాయాజాలానికి ఇంగ్లండ్ జ‌ట్టు 57.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. కుల్‌దీప్ యాదవ్ (5/72), రవిచంద్రన్ అశ్విన్ (4/51) ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడానికి పోటీపడ్డారు. జాక్ క్రాలే (79; 108 బంతుల్లో) మినహా మిగిలిన ఇంగ్లిష్ బ్యాటర్లందరూ త‌క్కువ స్కోరుకే వెనుదిరిగారు.

ఇంగ్లండ్ జ‌ట్టు తొలి వికెట్‌కు బెన్ డకెట్ (27; 58 బంతుల్లో)తో కలిసి జాక్ క్రాలే 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్ప‌గా, వారిద్ద‌రు త‌మ జ‌ట్టుకు మంచి స్కోరు సాధించేలా క‌నిపించారు. క్రాలే కాస్త దూకుడుగా ఆడితే, డకెట్ సంయమనంతో పరుగులు చేయ‌డం మొద‌లు పెట్టాడు. ఇద్ద‌రు ఇన్నింగ్స్ సాఫీగా సాగేలా ఆడుతూ వ‌చ్చారు. అయితే గిల్ స్ట‌న్నింగ్ క్యాచ్‌తో డ‌కెట్ ఔట‌య్యాడు. ఇక‌ పోప్ (11; 24 బంతుల్లో)తో కలిసి క్రాలే ఇన్నింగ్స్ మెరుగుప‌రిచే ప్ర‌య‌త్నం చేశాడు. ఇంగ్లంగ్ స్కోరు ఓ ద‌శ‌లో వికెట్ న‌ష్టానికి వంద ప‌రుగులుగా ఉంది.

అయితే ఎప్పుడైతే కుల్దీప్ యాద‌వ్ రంగంలోకి దిగాడో మ్యాచ్ స్వ‌రూప‌మే మారిపోయింది. 100/2తో రెండో సెషన్‌ను ఆరంభించిన ఇంగ్లండ్‌ను కుల్‌దీప్, అశ్విన్ పెద్ద దెబ్బ తీసారు. మూడో సెషన్‌ ప్రారంభమైన కొద్దిసేపటికీ ఇంగ్లండ్ ఆలౌట్ కావ‌డం గ‌మ‌న‌ర్హం.ఇంగ్లండ్ బ్యాటర్లలో రూట్ (26; 56 బంతుల్లో), జానీ బెయిర్‌స్టో (29; 18 బంతుల్లో), బెన్ ఫోక్స్ (24; 42 బంతుల్లో) షోయబ్ బషీర్ (11*; 22 బంతుల్లో), టామ్ హర్ట్‌లీ ఆరు పరుగులు చేయ‌గా, బెన్ స్టోక్స్, జేమ్స్ అండర్సన్ డ‌కౌట్‌గా వెనుదిరిగారు. ఇక భార‌త్ త‌మ తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టగా య‌శ‌స్వి జైస్వాల్(25 ), రోహిత్ శ‌ర్మ(౨౨) ధాటిగా ఆడుతున్నారు. ప్ర‌స్తుతానికి టీమిండియా వికెట్ న‌ష్ట‌పోకుండా 47 ప‌రుగులు చేసింది.

Latest News