ఎముక‌లు కొరికే చ‌లిలో అద్భుత విజ‌యం సాధించిన భార‌త్..ఆఫ్ఘాన్‌పై సూప‌ర్ విక్ట‌రీ

  • Publish Date - January 12, 2024 / 01:57 AM IST

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్‌ తొలి టీ20 మ్యాచ్ జ‌నవరి 11న జ‌రిగింది. మొహ‌లీ వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. టీమిండియా సమష్టిగా రాణించడంతో 6 వికెట్ల తేడాతో అఫ్గాన్‌ను ఓడించింది. శివమ్ దూబే(40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో పాటు ఒక వికెట్ తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘ‌న్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహమ్మద్ నబీ(27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), అజ్మతుల్లా ఒమర్జాయ్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29), ఇబ్రహీమ్ జడ్రాన్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25) మాత్ర‌మే రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ రెండేసి వికెట్లు తీయగా.. శివమ్ దూబే ఓ వికెట్ పడగొట్టాడు.

ఇక 159 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజ‌యం సాధించింది . శివమ్ దూబేకు తోడుగా జితేశ్ శర్మ(20 బంతుల్లో 5 ఫోర్లతో 31), తిలక్ వర్మ(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 26) రాణించ‌డంతో భార‌త్ విజ‌యం సులువు అయింది. చాలా నెల‌ల త‌ర్వాత టీ20 ఆడిన రోహిత్ శ‌ర్మ ఈ మ్యాచ్‌లో డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. గిల్‌తో సమన్వయ లోపం వ‌ల‌న ర‌నౌట్ రూపంలో వికెట్ కోల్పోవ‌ల‌సి వ‌చ్చింది. ఇక ఇదిలా ఉంటే గురువారం జ‌రిగిన మ్యాచ్‌లో ఎముకల కొరికే చలి వ‌ల‌న ఆటగాళ్లు చాలా ఇబ్బంది ప‌డ్డారు. ఈ మ్యాచ్‌లో చ‌లి ఆటగాళ్లకు సవాల్‌గా మారింది. ఫీల్డింగ్, బౌలింగ్ చేసేందుకు ఆటగాళ్లు తెగ ఇబ్బంది పడ్డారు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే చలిని తట్టుకోలేక వేడి నీళ్లు తెప్పించుకొని ఉప‌శ‌మ‌నం పొందే ప్ర‌య‌త్నం చేశాడు. తీవ్ర చలిలో బంతిని ఆపేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. మైదానాన్ని పూర్తిగా పొగ మంచు కప్పేసింది. ఈ మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకులు స్వెటర్స్, దుప్పట్లతో ఆటను వీక్షించ‌గా, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ఆటగాళ్లు సైతం స్వెటర్స్, కుళ్లలతో కనిపించడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఆటగాళ్లు చలికి ఇబ్బంది పడుతున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. చలి కారణంగా బౌలర్లకు బంతిపై పట్టు చిక్కకున్నా.. భారత బౌలర్లు అద్భుతంగానే బౌలింగ్ చేసి మంచి విజ‌యం సాధించ‌డం కొస‌మెరుపు.

Latest News