Afghan – Pak War | అఫ్గాన్‌ – పాక్‌ సరిహద్దులో ఆగని రక్తపాతం

అఫ్గాన్‌ తాలిబాన్‌, పాక్‌ సైన్యాల మధ్య ఘోర కాల్పులు చెలరేగి వందలమంది ప్రాణాలు కోల్పోయారు. తాలిబాన్‌ బలగాలు పాక్‌ ట్యాంకులు స్వాధీనం చేసుకున్నట్లు వీడియోలు వైరల్‌ అయ్యాయి. కాల్పుల విరమణ తర్వాత కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

Dozens Killed As Afghan Taliban, Pakistan Exchange Deadliest Gunfire In Years

Dozens Killed As Afghan Taliban, Pakistan Exchange Deadliest Gunfire In Years

అఫ్గాన్‌ తాలిబాన్‌ బలగాలు, పాకిస్తాన్‌ సైన్యం మధ్య సరిహద్దులో జరిగిన తాజా రక్తపాతం దక్షిణాసియా వాతావరణాన్ని మరింత అస్థిరపరుస్తోంది. గత కొన్నేళ్లలో చూడని స్థాయిలో ఇరువైపులా తీవ్రమైన కాల్పులు జరిగి, సైనికులు, పౌరులు సహా డజన్ల కొద్దీ ప్రాణాలు కోల్పోయారు. కాంధహార్‌ ప్రావిన్స్‌లోని స్పిన్‌ బోల్దక్‌, పాక్‌లోని చమన్‌ జిల్లాల మధ్య గల సరిహద్దు యుద్ధరంగంలా మారి, సైనిక బలగాల కాల్పులతో మార్మోగిపోయింది . అఫ్గాన్‌ వర్గాల ప్రకారం, పాకిస్తాన్‌ వైమానిక దాడుల్లో 12 మంది పౌరులు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా తాలిబాన్‌ బలగాలు పాక్‌ సైన్యపు అవుట్‌పోస్ట్‌లను ఆక్రమించి, కొన్ని సైనిక ట్యాంకులను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించాయి. “మా బలగాలపై పాక్‌ సైన్యం లైట్‌ మరియు హెవీ వెపన్లతో దాడి చేసింది. ప్రతిదాడిలో పాక్‌ సైనికులు కూడా పెద్ద ఎత్తున హతమయ్యారు,” అని తాలిబాన్‌ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ ప్రకటించారు. అఫ్గాన్‌ ప్రభుత్వం 58 మంది పాక్‌ సైనికులను హతమార్చామని ప్రకటించగా, పాక్‌ మాత్రం 200 మందికి పైగా అఫ్గాన్‌ సైనికులను చంపామని తెలిపింది.


పాకిస్తాన్‌ మాత్రం ఈ ఆరోపణలను తిరస్కరించింది. ఆ ట్యాంకులు తమ సైన్యానికి చెందినవి కావని, అవి అఫ్గాన్‌ వద్ద ఉన్న పాత సోవియట్‌ ట్యాంకులు కావచ్చని రక్షణశాఖ మంత్రి ఖవాజా అసిఫ్‌ వివరణ ఇచ్చారు. అయితే, తాలిబాన్‌ విడుదల చేసిన వీడియోల్లో అఫ్గాన్‌ యోధులు పాక్‌ ట్యాంకులతో వీధుల్లో సంబరాలు చేసుకోవడం, కొంతమంది పాక్‌ సైనికుల మృతదేహాలను ప్రదర్శించడం వంటి దృశ్యాలు ప్రాంతీయ స్థాయిలో తీవ్ర చర్చలకు దారితీశాయి.

‘ప్యాంట్‌’ వివాదం – పాక్‌ సైన్యానికి అవమానం

ఘర్షణలు తాత్కాలికంగా ఆగినా, పాకిస్తాన్‌ సైన్యానికి ఈ సారి తీవ్ర అవమానం మిగిలింది.
తాలిబాన్‌ యోధులు పాక్‌ సైనికులు పారిపోయిన తర్వాత వారు వదిలి వెళ్లిన బట్టలు, ఆయుధాలను ప్రదర్శించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. బీబీసీ జర్నలిస్టు దావూద్‌ జున్బిష్‌ ఈ చిత్రాలను షేర్‌ చేస్తూ — “పాక్‌ సైనికులు వదిలేసిన ఖాళీ ట్రౌజర్లు, రైఫిల్స్‌ ఇప్పుడు తాలిబాన్‌ బలగాల వద్ద ఉన్నాయి,” అని వ్యాఖ్యానించారు. అఫ్గాన్‌ ప్రజలు కూడా వీధుల్లోకి వచ్చి “మా సైన్యం దేశాన్ని కాపాడింది” అంటూ నినాదాలు చేశారు.

ఈ ఘర్షణలు కొనసాగుతున్న వేళ, ఇరుదేశాలు చివరికి 48 గంటల కాల్పుల విరమణకు అంగీకరించాయి. పాక్‌ విదేశాంగ శాఖ “శాంతియుత పరిష్కారం కోసం ఈ విరమణ అవసరం” అని పేర్కొనగా, తాలిబాన్‌ మాత్రం “విరమణను కోరింది పాకిస్తానే” అని ప్రతిస్పందించింది. సౌదీ అరేబియా, ఇరాన్‌, ఖతర్‌ వంటి దేశాలు కూడా ఇరుదేశాలకు చర్చలు జరపాల్సిందిగా పిలుపునిచ్చాయి.

అయితే, ఈ సరిహద్దు ఉద్రిక్తతలు కేవలం సైనిక ఘర్షణలు మాత్రమే కావు — వాటి వెనుక రాజకీయ వ్యూహం కూడా ఉంది. ఇటీవల కాబూల్‌లో జరిగిన వైమానిక దాడిలో టిటిపి (తహ్రీక్‌-ఇ-తాలిబాన్‌ పాకిస్తాన్‌) చీఫ్‌ నూర్‌వాలి మెహ్సూద్‌ లక్ష్యంగా ఉన్నారు. ఆయన జీవించి ఉన్నారో లేదో ఇంకా స్పష్టత లేదు. పాక్‌ సైన్యం ఈ దాడిని అంగీకరించకపోయినా, తాలిబాన్‌ ప్రభుత్వం దీనిని “పాక్‌ ఆక్రమణ చర్య”గా ఖండించింది. మెహ్సూద్‌ 2018లో టిటిపి నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ సంస్థ మళ్లీ బలపడింది. పాక్‌ భూభాగంలో దాడులు పెరగడంతో ఇస్లామాబాద్‌ అఫ్గాన్‌ ప్రభుత్వంపై పరోక్షంగా ఒత్తిడి తెస్తోంది. టిటిపి యోధులు అఫ్గాన్‌ భూభాగాన్ని ఆశ్రయంగా ఉపయోగిస్తున్నారని పాక్‌ ఆరోపిస్తోంది. తాలిబాన్‌ మాత్రం దీనిని ఖండిస్తోంది.

భారతదేశం కోణంలో ఈ పరిణామం అత్యంత ప్రాముఖ్యమైనది. నూతన భద్రతా సమీకరణల్లో కాబూల్‌, ఇస్లామాబాద్‌ మధ్య ఉన్న దూరం మరింత విస్తరిస్తే, ప్రాంతీయ సమతుల్యత భారత ప్రయోజనాలకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అదే సమయంలో, పాక్‌లో అంతర్గత అస్థిరత పెరగడం దక్షిణాసియా శాంతిపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం కూడా ఉంది. తాలిబాన్‌ శక్తి అఫ్గాన్‌ సరిహద్దులు దాటి ప్రభావం చూపే స్థాయికి చేరుకుంటే, ఇది పాక్‌కే కాకుండా భారత ఉత్తర సరిహద్దులకు కూడా సవాలుగా మారవచ్చు.

ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతున్నా, అది తాత్కాలికమేనని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సరిహద్దు వద్ద సైనిక కదలికలు, డ్రోన్‌ పర్యవేక్షణలు కొనసాగుతున్నాయి. ఇరుదేశాల మధ్య నమ్మకం పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో ఏ చిన్న సంఘటన జరిగినా మళ్లీ యుద్ధ స్థాయి ఉద్రిక్తతలు తిరిగి చెలరేగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

భారత దృష్టికోణం: నిశితంగా రిశీలిస్తున్న న్యూఢిల్లీ

ఈ సరిహద్దు రగడను భారతదేశం అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా తాలిబాన్‌ పాలన కింద అఫ్గానిస్తాన్‌ తిరిగి తీవ్రవాద శక్తుల స్థావరంగా మారుతుందనే ఆందోళన న్యూఢిల్లీకి ఉంది. ఇస్లామాబాద్‌–కాబూల్‌ మధ్య పెరుగుతున్న వైరం భారత్‌కు వ్యూహాత్మకంగా రెండు విధాలుగా లాభదాయకంగా ఉండొచ్చు — ఒకవైపు పాక్‌ సైన్యం అంతర్గతంగా బలహీనపడే అవకాశం ఉంది, మరోవైపు అఫ్గాన్‌ పాలకులు భారత సహకారాన్ని అవసరమైన మితృత్వంగా భావించే పరిస్థితి రావచ్చు. ఇప్పటికే తాలిబాన్‌ విదేశాంగ మంత్రి అమిర్‌ ఖాన్‌ ముత్తాఖీ ఇటీవల భారత్‌ పర్యటన చేసిన సందర్భంలో ఈ తాజా ఘర్షణలు కొత్త భౌగోళిక సమీకరణాలకు దారితీయవచ్చు.

అయితే, ఈ పరిణామాన్ని భారత్‌ కేవలం వ్యూహాత్మక లాభం కోణంలో కాకుండా భద్రతా దృష్ట్యా కూడా గమనిస్తోంది. టిటిపి, ఐసిస్‌-ఖొరసాన్‌ వంటి సంస్థలు సరిహద్దుల ఆవలి నుంచి కార్యకలాపాలు విస్తరిస్తే, అది దక్షిణాసియా స్థిరత్వానికి తీవ్రమైన ప్రమాదం. అందుకే భారత నిఘా సంస్థలు, రక్షణ వ్యవస్థలు అఫ్గాన్‌ పరిణామాలను నిరంతరం సమీక్షిస్తున్నాయి. పాక్‌–అఫ్గాన్‌ వైరం తాత్కాలికంగా భారత్‌కు వ్యూహాత్మక సడలింపును ఇస్తున్నా, దీర్ఘకాలంలో కొత్త ఉగ్రవాద ముప్పులు తలెత్తకుండా సమతుల్య విధానం అవలంబించడం అవసరమని న్యూఢిల్లీకి తెలుసు.

ఈ సరిహద్దు ఉద్రిక్తత పాక్‌ వైఫల్యానికి సంకేతమా, లేక దక్షిణాసియా నూతన శక్తి సమీకరణాల ఆరంభమా అన్నది రాబోయే వారాల్లో తేలనుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది — కాబూల్‌ మరియు ఇస్లామాబాద్‌ మధ్య దూరం పెరిగే కొద్దీ, భారత దౌత్యం మరింత క్రమబద్ధంగా, తెలివిగా తన ప్రణాళికను ముందుకు తీసుకెళ్తోంది.

Afghan Taliban and Pakistani forces clashed fiercely along the Chaman–Spin Boldak border, leaving dozens dead in the deadliest exchange in years. Taliban claimed to have captured Pakistani tanks, while Pakistan accused Kabul of sheltering TTP militants. Amid viral humiliation videos and rising tensions, both sides agreed to a fragile 48-hour ceasefire.