ఫుల్ ఫామ్‌లో ఉన్న దూబే.. రెండో టీ 20లోను రాణించి భార‌త్‌ని గెలిపించిన ఆల్‌రౌండ‌ర్

  • Publish Date - January 15, 2024 / 01:35 AM IST

2024లో టీమిండియా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. టీమ్ ఏదైన స‌రే ప్ర‌త్య‌ర్థిని వ‌ణికిస్తూ మంచి విజ‌యాల‌ని సొంతం చేసుకుంటుంది. ప్ర‌స్తుతం ఆఫ్ఘ‌నిస్తాన్‌తో భార‌త్ మూడు టీ20ల సిరీస్ ఆడుతుంది. తొలి టీ20లో ఘ‌న విజ‌యం సాధించిన భార‌త్ రెండో టీ20లోను ల‌క్ష్యాన్ని చేధించి మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. శివమ్ దూబే(32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63 నాటౌట్), యశస్వి జైస్వాల్(35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68) విధ్వంసకర హాఫ్ సెంచరీలు సాధించ‌డంతో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఆఫ్ఘనిస్థాన్ జట్టు 20 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేయ‌గా, భార‌త్ మాత్రం 26 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టులో ఇబ్రహీమ్ జడ్రాన్(35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/32) , రవి బిష్ణోయ్(2/39), అక్షర్ పటేల్(2/17) రెండేసి వికెట్లతో ఆఫ్ఘ‌న్‌ని క‌ట్ట‌డి చేశారు. ఇక శివమ్ దూబేకు ఓ వికెట్ దక్కింది. ఇక భార‌త బ్యాటింగ్ విష‌యానికి వ‌స్తే రెండ టీ20లోను రోహిత్ శ‌ర్మ గోల్డెన్ డ‌క్‌గా వెనుదిరిగాడు. ఫజలక్ ఫరుఖీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫరూఖీ అక్రాస్‌ ది లైన్ వేయగా.. రోహిత్ శర్మ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ లోగా వెళ్లిన బంతి ఆఫ్ స్టంప్‌ను ఎగరగొట్టింది. దాంతో రోహిత్ శర్మ నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

రెండు మ్యాచ్‌లు డ‌కౌట్ కావడంతో రోహిత్‌పై తెగ ట్రోలింగ్ న‌డుస్తుంది. టీ20 ఫార్మాట్‌లో ఆడటం రోహిత్ వల్ల కాదని, వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ తప్పుకుంటే శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి కుర్రాళ్లకు అవకాశం దక్కుతుందని అంటున్నారు. రోహిత్ శ‌ర్మ హిట్ మ్యాన్ కాదు డ‌క్ మ్యాన్ అని అంటున్నారు. ఇక చాలా రోజుల త‌ర్వాత విరాట్ కోహ్లీ కూడా టీ 20 మ్యాచ్ ఆడ‌గా, ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(16 బంతుల్లో 5 ఫోర్లతో 29) ప‌రుగులు చేశాడు.

Latest News