Telangana Assembly Elections | తెలంగాణ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. నవంబర్ 30న పోలింగ్ నిర్వహించి, డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇప్పటికే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. 119 స్థానాలకు గానూ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో ఏడుగురు మహిళలకు స్థానం లభించింది. 2018లో నలుగురు మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇవ్వగా వారిలో ముగ్గురు విజయం సాధించారు. ఈసారి అదనంగా ముగ్గురు మహిళలకు జాబితాలో స్థానం కల్పించారు.
టాప్ ప్లేస్‌లో పద్మా దేవేందర్ రెడ్డి..
ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన.. మహిళా అభ్యర్థులను పరిశీలిస్తే, టాప్ ప్లేస్‌లో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో సబితా ఇంద్రారెడ్డి, గొంగిడి సునీత ఉన్నారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 141 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. 39 మంది మహిళలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. అయితే 122 మంది మహిళలు డిపాజిట్లు దక్కించుకున్నారు.
మెదక్ నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి 97,670 ఓట్లతో భారీ విజయం సాధించారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబితా ఇంద్రారెడ్డి 95,481 ఓట్లతో గెలుపొందారు. ఆలేరు నుంచి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి 94,870 ఓట్లతో విజయం సాధించారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి, గెలిచిన అనంతరం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
అత్యధికంగా ముషీరాబాద్ నుంచి పోటీ
పినపాక నియోజకవర్గం నుంచి పాల్వంచ దుర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 5277 ఓట్లు పొందారు. ఇక ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా ఆరుగురు, సికింద్రాబాద్ నుంచి ఐదుగురు మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. 1,58,43,339 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఏడుగురు ఎవరెవరంటే..?
2018 ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి ఓటమిపాలైన కోవా లక్ష్మీతోపాటు మెదక్, ఆలేరు, ఇల్లందు, మహేశ్వరం సిట్టింగ్ ఎమ్మెల్యేలైన పద్మా దేవేందర్ రెడ్డి, గొంగడి సునితా మహేందర్‌రెడ్డి, హరిప్రియా నాయక్, సబితా రెడ్డిలకు ఈసారి కూడా టికెట్లు కేటాయించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు ఈసారి టికెట్ నిరాకరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం నుంచి 2018 ఎన్నికల్లో గెలుపొందిన సాయన్న మరణించడంతో ఆయన కూతురు లాస్య నందితను పోటీకి నిలపాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.