ఇదీ ఇజ్రాయెల్‌పై పోరులో హ‌మాస్ వ్యూహం!.. సీజ్ ఫైర్ టార్గెట్?

హ‌మాస్‌కు 40వేల‌కుపైగా ఫైట‌ర్స్ ఉన్న‌ట్టు స‌మాచారం. గాజా భూభాగం కింద 80 మీట‌ర్ల లోతున సొరంగాల గుండా వంద‌ల కిలోమీట‌ర్లు ప్ర‌యాణించ‌గ‌ల‌ర‌ని తెలుస్తున్న‌ది.

  • Publish Date - November 4, 2023 / 10:14 AM IST

  • 40వేల సాయుధులు.. అసంఖ్యాక సొరంగాలు
  • లెక్క‌కు మిక్కిలి అత్యాధునిక ఆయుధాలు
  • ట‌న్నుల‌కొద్దీ ఆహార ప‌దార్థాలు, కీల‌క ఔష‌ధాలు
  • సీజ్‌ఫైర్‌ దాకా ఇజ్రాయెల్‌ను నిలువ‌రించే శ‌క్తి!
  • దీర్ఘ‌కాలిక యుద్ధానికి ముందే సిద్ధ‌మైన హ‌మాస్‌
  • ప్ర‌జ‌ల ప్రాణాలు ప‌ణంగా యుద్ధ వ్యూహాలు!


న్యూఢిల్లీ : ఇజ్రాయెల్‌పై మెరుపుదాడుల అనంత‌రం తిరిగి ఆ దేశం పాల‌స్తీనాపై విరుచుకు ప‌డుతుంద‌ని హ‌మాస్ ముందే అంచ‌నా వేసిందా? యుద్ధం దీర్ఘ‌కాలం సాగినా త‌ట్టుకునేలా ముందే స‌క‌ల స‌దుపాయాలు సిద్ధం చేసుకుని కాలు దువ్విందా? ఈ ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానాలే వ‌స్తున్నాయి. ఇజ్రాయెల్ తానే కాల్పుల విర‌మ‌ణ‌కు అంగీక‌రించే వ‌ర‌కూ నిలువ‌రించేందుకు ముందే సిద్ధ‌మైంద‌ని హ‌మాస్ స‌న్నిహిత వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ వార్త‌లు వెలువ‌డుతున్నాయి. గాజాను ప‌రిపాలిస్తున్న హ‌మాస్‌.. పెద్ద సంఖ్య‌లో ఆయుధాలు, క్షిప‌ణుల‌తోపాటు.. ఆహారం, ఔష‌ధాలు సిద్ధం చేసుకునే యుద్ధంలోకి దిగింద‌నేది ఆ వార్త‌ల సారాంశం. గాజాలో అత్యంత లోతున భారీ సొరంగాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఒక‌దానితో ఒక‌టి అనుసంధాన‌మై, పూర్తి ర‌క్ష‌ణ‌, సౌక‌ర్యాల‌తో అవి ఉంటాయి. వాటిలో త‌మ‌ను తాము ర‌క్షించుకోవ‌డం ద్వారా అనేక నెల‌ల పాటు హ‌మాస్‌ సాయుధులు ఇజ్రాయెల్‌ను నిలువ‌రించ‌గ‌ల‌ర‌ని ఆ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ప‌ట్ట‌ణ గెరిల్లా యుద్ధంలో ఇజ్రాయెల్‌ను ముప్పుతిప్ప‌లు పెట్టేందుకు స‌న్నాహాలు చేస్తున్నాయ‌ని చెబుతున్నారు. పౌర మ‌ర‌ణాలు పెరిగే కొద్దీ ప్ర‌పంచ దేశాల ఒత్తిళ్ల‌కు ఇజ్రాయెల్ త‌లొగ్గి కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌టిస్తుంద‌ని హ‌మాస్ భావిస్తున్న‌ది. ఈ క్ర‌మంలోనే జ‌రిగే చ‌ర్చ‌ల్లో ఇజ్రాయెల్ జైళ్ల‌లో ఉన్న వేల‌మంది పాల‌స్తీనియ‌న్ల‌ను విడుద‌ల‌కు, త‌న వ‌ద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెలీల విడుద‌ల‌కు లింకు పెడుతుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. బందీల విడుద‌ల‌కు ఇటీవ‌ల ఖ‌తార్ సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్టు చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా పాల‌స్తీనా ఖైదీల విడుద‌ల‌కు, త‌మ వ‌ద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీల విడుద‌ల‌కు హ‌మాస్ ముడిపెట్టిన‌ట్టు తెలుస్తున్న‌ది. గాజాపై గ‌త ప‌దిహేడు సంత్స‌రాలుగా ఇజ్రాయెల్ దిగ్బంధానికి ముగింపు ప‌ల‌క‌డం అనేది హ‌మాస్ ల‌క్ష్యంగా క‌నిపిస్తున్న‌ది. దాంతోపాటు.. నానాటికీ ఇజ్రాయెల్ త‌న ఆక్ర‌మ‌ణ‌ను విస్త‌రించుకుంటూ పోవ‌డాన్ని కూడా నిరోధించ‌డం, జెరూస‌లేంలోని అత్యంత ప‌విత్ర‌మైన‌దిగా భావించే అల్ అఖ్సా మ‌సీదు వ‌ద్ద ఇజ్రాయెల్ భ‌ద్ర‌తా ద‌ళాల అతి చ‌ర్య‌ల‌ను అడ్డుకోవ‌డం ల‌క్ష్యంగా చెబుతున్నారు.


సామూహిక న‌ర‌మేధం ముప్పులో పాల‌స్తీనియ‌న్లు ఉన్నార‌ని, త‌క్ష‌ణ‌మే కాల్పుల విర‌మ‌ణ జ‌ర‌గాల‌ని ఐరాస అధికారులు గురువారం ఒక స‌మావేశంలో పిలుపునిచ్చారు. రెండు ప‌క్షాలూ ఢీ అంటేఢీ అంటున్న ప్ర‌స్తుత త‌రుణంలో సంక్షోభ నివార‌ణ‌కు కాల్పుల విర‌మ‌ణ ఒక్క‌టేన‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. హ‌మాస్‌ను నిర్మూలించాల‌న్న ల‌క్ష్యం అంత సుల‌భంగా సాధ్య‌మయ్యేది కాద‌ని జోర్డాన్ మాజీ విదేశాంగ మంత్రి, మాజీ ఉప ప్ర‌ధాని మ‌ర్వాన్ అల్ మౌషెర్ చెప్పారు. ఈ సంఘ‌ర్ష‌ణ‌కు సైనిక ప‌రిష్కారం లేద‌ని చెప్పారు. ‘మ‌నం చీక‌టి కాలంలో ఉన్నాం. ఈ యుద్ధ‌మేమీ స్వ‌ల్ప‌కాలంలో ముగిసిపోయేది కాదు’ అని ఆయ‌న అన్నారు.


అక్టోబ‌ర్ ఏడున ఇజ్రాయెల్‌పై హ‌మాస్ తీవ్ర‌వాదులు విరుచుకుప‌డటంతో రెండు దేశాల మ‌ధ్య యుద్దం మొద‌లైంది. ఆ దాడిలో 100 మంది ఇజ్రాయెలీలు చ‌నిపోయారు. దాదాపు 239 మందిని హ‌మాస్ తీవ్ర‌వాదులు అప‌హ‌రించారు. ప్ర‌తిగా గాజాపై ఇజ్రాయెల్ ప్ర‌తి రోజూ జ‌రుపుతున్న బాంబు దాడుల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ 9వేల‌కుపైగా పాల‌స్తీనియ‌న్లు చ‌నిపోయారు. దాదాపు 20 ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న గాజాలో ప‌రిస్థితిపై అంత‌ర్జాతీయంగా తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. వీరంతా బాంబు దాడుల‌కు బిక్కుబిక్కుమంటూ త‌ల‌దాచుకుంటున్నారు. క‌నీసం ఆహారం, మంచినీరు, విద్యుత్తు స‌దుపాయాలు కూడా లేకుండా పోయాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాలు కాల్పుల విర‌మ‌ణ‌కు పిలుపునిస్తున్నా.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజిమిన్ నెత‌న్యాహు మాత్రం హ‌మాస్‌ను నిర్మూలించే వ‌ర‌కూ యుద్ధం ఆగేది లేద‌ని తేల్చిచెబుతున్నారు. దీర్ఘ‌కాలిక‌, బాధాక‌ర‌మైన యుద్ధానికి తాము దిగామ‌ని, యుద్ధం చివ‌రిలో తాము హ‌మాస్‌ను ఓడిస్తామ‌ని త‌మ‌కు తెలుసున‌ని ఐరాస‌లో ఇజ్రాయెల్ మాజీ రాయ‌బారి డేని డాన‌న్ చెప్పారు.


ఇజ్రాయెల్‌పై దాడికి దిగే మందే హ‌మాస్ వ‌ద్ద దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక ఉండి ఉంటుంద‌ని పాల‌స్తీనా వ్య‌వ‌హారాల నిపుణుడు, హ‌మాస్‌ను బాగా అధ్య‌య‌నం చేసిన ఖ‌తార్ వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ అదీబ్ జైదే చెప్పారు. ఎంతో స‌న్న‌ద్ధ‌త లేక‌పోతే హ‌మాస్ ఇలా దాడులు చేసి ఉండేది కాద‌ని అన్నారు. హ‌మాస్‌కు 40వేల‌కుపైగా ఫైట‌ర్స్ ఉన్న‌ట్టు స‌మాచారం. గాజా భూభాగం కింద 80 మీట‌ర్ల లోతున ఉన్న‌ సొరంగాల గుండా వంద‌ల కిలోమీట‌ర్లు వారు ప్ర‌యాణించ‌గ‌ల‌ర‌ని తెలుస్తున్న‌ది. అనేక ఏళ్లుగా వీటిని హ‌మాస్ నిర్మిస్తూ వ‌చ్చింది. గురువారం నాడు గాజాలో ఒక సొరంగం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి, ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకుల‌ను ఎదుర్కొన్న హ‌మాస్ తీవ్ర‌వాదులు తిరిగి సొరంగంలోకి వెళ్లిపోయార‌ని ప్ర‌చారంలోకి వ‌చ్చిన వీడియోల‌ను బ‌ట్టి తెలుస్తున్న‌ది.

Latest News