రేవంత్‌ ప్రమాణానికి కేసీఆర్‌ వస్తారా?

సీఎంగా రేవంత్‌రెడ్డి తన ప్రమాణం కార్యక్రమానికి పొరుగు రాష్ట్ర సీఎం జగన్‌, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సైతం ఆహ్వానించారు.

  • Publish Date - December 6, 2023 / 02:03 PM IST

విధాత : సీఎంగా తన పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇప్పటికే ఏఐసీసీ పెద్దలను ఆహ్వానించిన రేవంత్‌ రెడ్డి ఇటు మాజీ ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కూడా ఆహ్వానించారు. చంద్రబాబు, జగన్‌ హాజరయ్యే అవకాశాలను పక్కనపెడితే.. కేసీఆర్‌ మాత్రం హజరయ్యే పరిస్థితి ఉండబోదున్న చర్చ నడుస్తున్నది.

 

ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి కేసీఆర్‌ కనీసం శుభాకాంక్షలు చెప్పలేదు. తమను ఓడించినా.. గెలిపించే క్రమంలో ఓటేసిన ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలిజేయలేదు. ఆఖరుకు గవర్నర్‌ను స్వయంగా కలిసి రాజీనామా పత్రాన్ని అందించకుండా.. దూతతో పంపించి.. తాను మాత్రం ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్‌.. తనను అధికారం నుంచి తప్పించిన రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావడం అనుమానమేనని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.


 ఎన్నికల అనంతరం ఓడిపోయిన నేతలు గౌరవంగా తమ ఓటమిని ఒప్పకొంటారు. రాబోయే కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెబుతారు. అయితే.. కేటీఆర్‌, హరీశ్‌రావు వంటివారు ఓటమిపై స్పందిస్తూ, కాంగ్రెస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కానీ.. కేసీఆర్‌ మాత్రం ఈ విషయంలో స్పందించలేదు. ఇదిలా ఉంటే.. బుధవారం ఫాంహౌస్‌కు పెద్ద సంఖ్యలో ఆయన స్వగ్రామం చింతమడక నుంచి ప్రజలు  చేరుకున్నారు. అయితే.. వచ్చినవారంతా సీఎం కేసీఆర్‌.. సీఎం కేసీఆర్‌.. అంటూ నినాదాలు ఇవ్వడం విశేషం. 

Latest News