Kalvakuntla Kavitha | తన తండ్రి, మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావుపై తిరుగుబావుటా ఎగురవేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఇంటికే పరిమితం అయ్యారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో సన్నిహిత అనుచరులతో సమాలోచనలు జరిపారు. మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడలేదు. చెల్లెలు ఇంటికి మాజీ మంత్రి, అన్నయ్య కే తారక రామారావు వస్తారని ప్రచారం జరిగింది కాని అలాంటి రాక ఏమీ చోటు చేసుకోకపోవడం బీఆర్ఎస్ శ్రేణులను నిరాశకు గురిచేసింది.
మా బాపు కేసీఆర్ కు లేఖ రాసింది నిజం, రెండు వారాల క్రితమే రాశానన్న కవిత.. కేసీఆర్ దేవుడు అంటూనే ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కుండబద్దలు కొట్టినట్లుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో శుక్రవారం రాత్రి మీడియా ప్రతినిధులకు వివరించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు శనివారం ఆమె తన తండ్రిని ఎర్రవల్లి లోని ఫామ్‌హౌస్‌లో కలిసి మాట్లాడే అవకాశముందని మీడియాకు సమాచారం వచ్చింది. దీంతో వారందరూ ఆమె స్పందన కోసం ఎదురు చూశారు. అయితే ఆమె బంజారాహిల్స్ లోని తన నివాసం నుంచి బయటకు రాలేదు. తన భవిష్యత్తు కార్యాచరణపై మాట్లాడుతారని ఊహించిన మీడియా ప్రతినిధులు సాయంత్రం వరకు ఎదురు చూసి వెళ్లిపోయారు. ఇంటిలోనే ఉన్న ఆమె ముఖ్య అనుచరులతో సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారని తెలిసింది. భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలి? బాపును కలిసిన సందర్భంలో ఏం మాట్లాడాలనే దానిపై చర్చించారంటున్నారు. ఆయనను కలిసేందుకు పిలుపు వస్తుందా, తానే ఫోన్ చేయాలా అనేదానిపై అభిప్రాయాలు తీసుకున్నట్టు సమాచారం.
ఇదే సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించి ఒకింత అసహనంగా, నిరాశతో మాట్లాడారు. బీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోవర్టులు ఉన్నారని ఎవరూ ఊహించని విధంగా బాంబు పేల్చారు. కేసీఆర్ కు కవిత లేఖ రాయడం సాధారణమేనని యథాలాపంగా కొట్టిపారేశారు. తన చెల్లిని ఉద్ధేశించే కోవర్టు అనే పదం కేటీఆర్ వాడారని పార్టీ ముఖ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడూ కోవర్టు అనే పదం వాడని ఆయన, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ పదం వెల్లడించారని అంటున్నారు. కాంగ్రెస్ వర్గాలే కవితను నడిపిస్తున్నాయని కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ నోట ఈ పదం రావడాన్ని పలువురు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
తొలుత ఎర్రవెల్లి ఫామ్‌హస్‌కు కవిత వెళతారని ప్రచారం జరిగినప్పుడు ఆమె ముందుగా తండ్రికి సమాచారం ఇచ్చి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే.. అటువంటిదేమీ లేకపోవడంతో తండ్రి రావద్దని చెప్పారా? అన్న సందేహాలు తలెత్తాయి. ఇవాళ మీడియా సమావేశం తరువాత కేటీఆర్ ఆమె ఇంటికి వెళ్లవచ్చనే వార్త కూడా గుప్పుమన్నా.. అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఆయన కూడా చెల్లెలి ఇంటికి వెళ్లకుండా ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా తెలంగాణలో కవిత విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు భార్య లక్ష్మీ పార్వతి విమర్శలు గుప్పించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.