విధాత, హైదరాబాద్ : ఐడీపీఎల్ భూముల ఆక్రమణలపై రేగిన రాజకీయ వివాదం అనూహ్య మలుపుతిరిగింది. సుమారు రూ. 4 వేల కోట్ల విలువైన ఐడీపీఎల్ భూములపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. సర్వే నెంబర్ 376లో ఐడీపీఎల్ భూ వివాదాలలో నిజానిజాల నిగ్గు తేల్చాలంటూ సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ బహిష్కృత ఎమ్మెల్సీ కవిత, కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు తాజాగా ఐడీపీఎల్ భూములకు సంబంధించి పరస్పర ఆరోపణలు సంధించుకోవడంతో ఈ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే మాధవరం, ఆయన కుమారుడు ఈ భూములను ఆక్రమించారని కవిత ఆరోపణలు చేసింది. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూములను అక్రమంగా క్రమబద్దీకరించుకుని వెంచర్లు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని కవిత ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే మాధవరం చేసిన భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలంటూ కవిత డిమాండ్ చేశారు.
అయితే ఎమ్మెల్యే మాధవరం మాత్రం కవిత భర్త అనిల్ ఆ భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఐడీపీఎల్ భూముల వివాదంపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మాధవరం కృష్ణారావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మాధవరం కృష్ణారావు శుక్రవారం లేఖలు పంపారు. కవిత, మాధవరంల పరస్పర ఆరోపణలతో ఐడీపీఎల్ భూములపై రాజకీయ రగడ కొనసాగుతున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం ఈ భూవివాదంపై విజిలెన్స్ విచారణ జరిపించాలని కీలక నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఇవి కూడా చదవండి :
Nitish Kumar| వివాదస్పదమైన బీహార్ సీఎం నితీష్ కుమార్ చర్య
Akhanda 2 | ‘అఖండ 2’తో రాజుకున్న ఫ్యాన్ వార్ … నందమూరి–మెగా ట్రోలింగ్‌తో సోషల్ మీడియా రచ్చ
