Kavitha | పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుంది.. నిరంజన్ రెడ్డికి కవిత వార్నింగ్

వనపర్తిలో నిరంజన్ రెడ్డి ఘోరాతి, ఘోరంగా అరాచకాలకు పాల్పడుతున్నారని జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన ఆరోపణలు చేశారు. చిన్న పిల్లాడిని అడిగిన ఆయన దారుణాలను చెబుతున్నారని.. ఇలాంటి వారి వల్ల జిల్లాలో బీఆర్ఎస్ బతికి బట్టకటట్టం కష్టమన్నారు.

విధాత, హైదరాబాద్ :
వనపర్తిలో నిరంజన్ రెడ్డి ఘోరాతి, ఘోరంగా అరాచకాలకు పాల్పడుతున్నారని జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన ఆరోపణలు చేశారు. చిన్న పిల్లాడిని అడిగిన ఆయన దారుణాలను చెబుతున్నారని.. ఇలాంటి వారి వల్ల జిల్లాలో బీఆర్ఎస్ బతికి బట్టకటట్టం కష్టమన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా సోమవారం కవిత వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు.  కృష్ణా నది కబ్జా చేసి ఫామ్ హౌజ్ కట్టుకుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు.  హరీష్ రావు మనిషి అని సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవటం లేదా?. నిరంజన్ రెడ్డి అరాచకాలను కేసీఆర్ కు హరీష్ రావు తెలియనివ్వటం లేదు.  అందుకే మీడియా ద్వారా పెద్దసార్ కు ఆయన ఘోరాలను చెబుతున్నా. నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసి పోతుంది. తండ్రి వయసు వారని ఇప్పటికీ గౌరవిస్తున్నా. ఎక్కువ మాట్లాడితే ఊరుకునేది లేదు’ అని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వ్యవసాయ శాఖ మంత్రిగా కేసీఆర్ అవకాశం ఇస్తే ప్రజల రక్తం తాగుతారా? అని ప్రశాంత్ రెడ్డిని కవిత ప్రశ్నించారు. ఎదుల రిజర్వాయర్ కూడా మీరు పూర్తి చేయలేదు.. కానీ మీకు మీరే నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నారని విమర్శించారు. పెబ్లేరు సంత చాలా ఫేమస్..అక్కడ 32 ఎకరాలను నిరంజన్ రెడ్డి మనుషులు కబ్జా పెట్టి అమ్ముకోవాలని చూస్తున్నారంట అని ఆరోపణలు చేశారు. కబ్జా కోరులకు పెద్ద నాయకులు సపోర్ట్ చేయవద్దని కవిత కోరారు. నేను చేసిన విమర్శలకు సమాధానం చెప్పకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు.

Latest News