Site icon vidhaatha

ఆ ఇంటి య‌జ‌మానికి ఐదుగురు భార్య‌లు.. ఓట‌ర్లు 1200 మంది.. ఎక్క‌డో తెలుసా..?

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా లోక్‌స‌భ ఎన్నిక‌ల హ‌డావుడి కొన‌సాగుతోంది. ఆయా పార్టీల నాయ‌కులు ఓట‌ర్ల‌కు గాలం వేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రి ముఖ్యంగా ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్న కుటుంబాల‌పై పార్టీల నాయ‌కులు దృష్టి సారించారు. అయితే ఒకే కుటుంబంలో 1200 మంది ఓట‌ర్లు ఉన్నారు. మ‌రి ఆ కుటుంబ ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఉందో తెలుసుకుందాం ప‌దండీ..

అసోంలోని సోనిట్‌పూర్ జిల్లాలోని నేపాలిపామ్ గ్రామం అది. ఈ గ్రామం తేజ్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి వ‌స్తుంది. అయితే నేపాలిపామ్ గ్రామానికి చెందిన రాన్ బ‌హ‌దూర్ థ‌పాకు ఐదుగురు భార్య‌లు. 12 మంది కుమారులు, 10 మంది కుమార్తెలు ఉన్నారు. 1997 రాన్ బ‌హ‌దూర్ థ‌పా మ‌ర‌ణించారు.

ప్ర‌స్తుతం బ‌హ‌దూర్ కుటుంబంలో 2500 మంది ఉన్నారు. ఓట‌ర్లు 1200 మంది. ఇక ఆ గ్రామ‌మంతా బ‌హ‌దూర్ వార‌సులే ఉన్నారు. మొత్తం 300 కుటుంబాలు ఉన్నాయి. దీంతో 1200 మంది ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు, వారి ఓట్లు త‌మ‌కే ప‌డేలా రాజకీయ నాయ‌కులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ప్ర‌తి రోజు ఆ గ్రామానికి ఏదో ఒక పార్టీ నాయ‌కుడు వెళ్తుండ‌డంతో బ‌హ‌దూర్ ఫ్యామిలీ వార్త‌ల్లో నిలిచింది.

రాన్ బ‌హ‌దూర్ థ‌పా పెద్ద కుమారుడు టిల్ బ‌హ‌దూర్ థ‌పా మాట్లాడుతూ.. మా నాన్న‌కు ఐదుగురు భార్య‌లు. మేం 22 మంది పిల్ల‌లం(12 మంది పురుషులు, 10 మంది స్త్రీలు). నాన్న వార‌స‌త్వంగా 300 కుటుంబాలు వెలిశాయి. మా కుమారుల‌కు, వారి పిల్ల‌ల‌కు కూడా వివాహాలు అయ్యాయి. ఈ గ్రామంలో వేరే కుటుంబాలు లేనే లేవు. మాకు 65 మంది మ‌న‌వ‌ళ్లు, 70 మంది మ‌న‌వ‌రాండ్లు ఉన్నారు. నేనిప్పుడు గ్రామ పెద్ద‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాను. మాది మొద‌ట్నుంచి వ్య‌వ‌సాయ కుటుంబం. కానీ ఇప్పుడు కొంద‌రు ఉద్యోగాల బాట ప‌ట్టారు అని టిల్ బ‌హ‌దూర్ తెలిపారు. 

Exit mobile version