Credit Card | క్రెడిట్ కార్డు వాడే కస్టమర్ మరణిస్తే.. బిల్లు ఎవరు కట్టాలి? భార్యాపిల్లలపై బ్యాంకులు ఒత్తిడి చేయొచ్చా?

Credit Card | ఒకవేళ క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే బిల్లు ఏమవుతుంది? క్రెడిట్ కార్డు బిల్లు కట్టమని అతని భార్యాపిల్లలపై బ్యాంకులు ఒత్తిడి తీసుకురావచ్చా? ఆర్‌బీఐ నిబంధనలు, చట్టాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

credit card

Credit Card | దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం రోజురోజుకీ పెరిగిపోతున్నది. షాపింగ్‌ల నుంచి ఆస్పత్రి బిల్లుల వరకు అన్నింటినీ క్రెడిట్ కార్డునే ఉపయోగిస్తున్నారు. ఆదాయాన్ని మించి వాడినప్పుడు ఆ మొత్తాన్ని ఈఎంఐ రూపంలోకి మార్చుకుని చెల్లిస్తున్నారు. క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి బతికి ఉన్నప్పుడు అతనే మొత్తం కట్టేస్తాడు. మరి ఒకవేళ క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే బిల్లు ఏమవుతుంది? క్రెడిట్ కార్డు బిల్లు కట్టమని అతని భార్యాపిల్లలపై బ్యాంకులు ఒత్తిడి తీసుకురావచ్చా? ఆర్‌బీఐ నిబంధనలు, చట్టాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా బ్యాంకులు ఇచ్చే లోన్లు రెండు రకాలుగా ఉంటాయి. అవి ఒకటి సెక్యూర్డ్ లోన్స్. రెండోది అన్‌సెక్యూర్డ్ లోన్స్. బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నప్పుడు భూమి, బంగారం తనఖా పెట్టుకుంటారు. వీటిని సెక్యూర్డ్ లోన్స్(Secured Loans) అని పిలుస్తారు. ఎటువంటి ఆస్తి తనఖా పెట్టకుండా, కేవలం కస్టమర్ ఆదాయాన్ని మాత్రమే చూసి ఇచ్చేవి అన్‌సెక్యూర్డ్ లోన్స్(Unsecured Loans). క్రెడిట్ కార్డులు కూడా వీటి కిందకే వస్తాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఇటువంటి రుణాలకు పూర్తి బాధ్యత కార్డు హోల్డర్‌కు మాత్రమే ఉంటుంది.

కుటుంబసభ్యులే బిల్లు చెల్లించాలా?

క్రెడిట్ కార్డు హోల్డర్ చనిపోతే బిల్లు కట్టమని అతని కుటుంబసభ్యులను ఒత్తిడి చేసే అధికారం బ్యాంకులకు లేదు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. పర్సనల్ లోన్స్ బకాయిలపై కస్టమర్‌కు మాత్రమే పూర్తి బాధ్యత ఉంటుంది. అతని వారసులు బిల్లు కట్టాలని బ్యాంకులు కానీ, బ్యాంక్ ఏజెంట్లు కానీ బెదిరించే అధికారం లేదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాలని వేధించడం, బెదిరించడం, ప్రైవసీకి భంగం కలిగించడం పూర్తిగా నిషిద్ధం. ఒకవేళ అలా ఎవరైనా వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే RBI లోక్‌పాల్ (అంబుడ్స్‌మెన్‌)కి కూడా ఫిర్యాదు చేయవచ్చు.

ఆస్తులు జప్తు చేయవచ్చా?

ఒకవేళ క్రెడిట్ కార్డు హోల్డర్ మరణిస్తే.. అతనికి సంబంధించిన ఆస్తుల ద్వారా బకాయిలను వసూలు చేయవచ్చు. కార్డు హోల్డర్ పేరుపై స్థిరాస్తితో పాటు బ్యాంక్ బ్యాలెన్స్, బంగారం, వెండి, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, షేర్లు వంటి వాటి నుంచి బ్యాంకులు బకాయిలను వసూలు చేసుకునే అధికారం ఉంది. అయితే, కార్డు హోల్డర్‌పై ఉన్న ఆస్తి విలువ మేరకు మాత్రమే వసూలు చేసే అధికారం ఉంటుంది. ఉదాహరణకు చనిపోకముందు క్రెడిట్ కార్డు హోల్డర్ అప్పు రూ.10 లక్షలు ఉంది. కానీ అతని ఆస్తి విలువ 5 లక్షలు మాత్రమే ఉంది. అప్పుడు బ్యాంకులు కేవలం 5లక్షలు మాత్రమే వసూలు చేయవచ్చు. మిగిలిన బకాయి కోసం కుటుంబసభ్యులపై ఒత్తిడి చేయవద్దని ఆర్‌బీఐ నిబంధనలు చెబుతున్నాయి. అంటే ఆ బకాయిని NPA ( Non Performing Asset)గా చూపించి, రైట్ ఆఫ్ చేస్తుంది.

ఆస్తులు లేనట్లయితే..!

క్రెడిట్ కార్డు హోల్డర్‌కు ఎలాంటి ఆస్తులు లేకపోతే.. ఆ అప్పును బ్యాంకులు వసూలు చేయలేవు. అలాంటి సమయంలో క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ మొత్తాన్ని NPA ( Non Performing Asset)గా చూపించి, రైట్ ఆఫ్ చేస్తుంది.

ఇన్సూరెన్స్‌తో సెక్యూరిటీ!

క్రెడిట్ కార్డులు ఇచ్చేటప్పుడు కొన్ని బ్యాంకులు ఇన్సూరెన్స్‌ను ఆఫర్ చేస్తుంటాయి. ఈ బీమా తీసుకోవడం ద్వారా క్రెడిట్ కార్డు హోల్డర్ మరణిస్తే.. ఆ ఇన్సూరెన్స్ డబ్బు నుంచి బ్యాంకులు క్రెడిట్ కార్డు బిల్లులను రికవరీ చేసుకుంటాయి. కాబట్టి క్రెడిట్ కార్డు తీసుకున్నప్పుడు దానికి ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా.. అనుకోని మరణం సంభవించినప్పుడు ఈ బకాయి భారం కుటుంబసభ్యులపై పడకుండా ఉంటుంది.

మరో ముఖ్య విషయం!

క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. కచ్చితంగా ఆ విషయాన్ని వీలైనంత తొందరగా బ్యాంకులకు తెలియజేయాలి. డెత్ సర్టిఫికెట్ సబ్‌మిట్ చేయడం ద్వారా క్రెడిట్ కార్డును క్లోజ్ చేయాలి. లేదంటే ఆ అప్పు మీద వడ్డీపై వడ్డీ పడే అవకాశం ఉంటుంది. అలాగే పాస్‌వర్డ్, లాగిన్ క్రెడెన్షియల్స్ తెలుసు కదా అని ఫ్యామిలీ మెంబర్స్ వాడితే దాన్ని అనధికారిక వినియోగం కిందనే పరిగణిస్తారు.

Read More :

క్రెడిట్ కార్డును రద్దు చేసుకుంటే ఏం జరుగుతుంది?

Credit Card | క్రెడిట్‌కార్డు ఉందా..? మరి ‘మినిమమ్‌ అమౌంట్‌ డ్యూ’ గురించి మీకు తెలుసా..?

Latest News