Box Office | భారతీయ సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ రికార్డులు రోజురోజుకూ సరికొత్త రికార్డులని సెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా రెండో వారంలోనే భారీ వసూళ్లు సాధించిన సినిమాలు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇటీవల విడుదలైన పాన్ ఇండియా చిత్రాలు ఈ ట్రెండ్‌ను మరింత బలపరిచాయి.
టాప్ సినిమాల వివరాలు ఇలా…
1. ధురంధర్ (2025)
బాలీవుడ్ స్పై యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం రెండో వారంలోనే ₹253.25 కోట్లు వసూలు చేసి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా, అక్షయ్ ఖన్నా విలన్‌గా కనిపించాడు. ఈ చిత్రం లైఫ్‌టైమ్‌లో ఇండియాలో ₹840.20 కోట్ల వసూళ్లు సాధించింది.
2. ధురంధర్ ది రివెంజ్ (2026)
‘ధురంధర్’ సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం కూడా రికార్డులు సృష్టించింది. రెండో వారంలో హిందీ వెర్షన్ ద్వారా ₹242.75 కోట్లు, దేశవ్యాప్తంగా ₹263.15 కోట్లు వసూలు చేసింది. ఇందులో కూడా రణవీర్ సింగ్ లీడ్ రోల్‌లో నటించగా, ఆర్. మాధవన్, సంజయ్ దత్ వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం 15 రోజుల్లోనే ₹937.32 కోట్లకు చేరుకుంది.
3. పుష్ప 2: ది రూల్ (2024)
టాలీవుడ్ నుంచి వచ్చిన ఈ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ రెండో వారంలో హిందీ వెర్షన్ ద్వారా ₹196.50 కోట్లు, దేశవ్యాప్తంగా ₹264.80 కోట్లు రాబట్టింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇండియాలో ₹1,234.10 కోట్ల లైఫ్‌టైమ్ కలెక్షన్ సాధించింది.
4. ఛావా (2025)
ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా రెండో వారంలో ₹180.25 కోట్లు వసూలు చేసింది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా లైఫ్‌టైమ్‌గా ₹601.54 కోట్లు సాధించింది.
5. బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017)
ఇప్పటికీ రికార్డుల పరంగా టాప్‌లో నిలిచిన ఈ చిత్రం రెండో వారంలో దేశవ్యాప్తంగా ₹264 కోట్లు వసూలు చేసింది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇండియాలో మొత్తం ₹1030.42 కోట్ల వసూళ్లు సాధించగా, హిందీ వెర్షన్ ఒక్కటే ₹510.99 కోట్లు రాబట్టింది.
బాక్సాఫీస్ ట్రెండ్ మారుతోంది
ఈ వివరాలను పరిశీలిస్తే, రెండో వారంలోనే భారీ వసూళ్లు సాధించడం ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు, బలమైన కంటెంట్, స్టార్ పవర్ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వరుసగా వస్తున్నారని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ధురంధర్ సిరీస్ నుంచి పుష్ప 2: ది రూల్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్ వరకు ఈ చిత్రాలు రెండో వారంలోనే రికార్డులు సృష్టిస్తూ భారతీయ సినిమా మార్కెట్ శక్తిని మరోసారి చాటిచెప్పాయి.
