Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన తొలి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.180 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన స్పందన దక్కించుకుంటున్న ఈ సినిమా, హిందీ మార్కెట్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
గురువారం విడుదలైన ‘పెద్ది’కి తొలి రోజు భారీ ఓపెనింగ్స్ లభించాయి. అయితే రెండో రోజు కలెక్షన్లు స్వల్పంగా తగ్గినప్పటికీ, మొత్తంగా బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. ప్రారంభంలో సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, క్రమంగా పాజిటివ్ టాక్ పెరగడంతో ప్రేక్షకులు థియేటర్లకు తరలివస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ నటన, పాత్ర కోసం ఆయన చూపిన అంకితభావం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
హిందీ వర్షెన్‌లో కరువు..
తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆక్యుపెన్సీతో రన్ అవుతున్న ఈ చిత్రం ఇతర భాషల్లో మాత్రం మోస్తరు వసూళ్లకే పరిమితమవుతోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌కు ఊహించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాకపోవడం ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ట్రేడ్ అంచనాల ప్రకారం, ‘పెద్ది’ హిందీ వెర్షన్ తొలి రోజు సుమారు రూ.3 కోట్ల నెట్ కలెక్షన్లు, రెండో రోజు రూ.2.5 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. అంటే రెండు రోజుల్లో కలిపి దాదాపు రూ.5.5 కోట్ల నెట్ మాత్రమే రాబట్టిందని సమాచారం. సినిమా ప్రీ-రిలీజ్ బజ్‌ను బట్టి హిందీలో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని అంచనా వేసినా, ప్రస్తుత ట్రెండ్ చూస్తే ఆ లక్ష్యం సవాల్‌గా మారే అవకాశం కనిపిస్తోంది.
ప్రచారానికి తగ్గట్టు లేని కలెక్షన్స్..
పాన్ ఇండియా సినిమాల విజయాల్లో హిందీ మార్కెట్ కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్’, ‘కాంతారా’ వంటి చిత్రాలు ఉత్తరాదిలో భారీ వసూళ్లు సాధించడం వల్లే దేశవ్యాప్తంగా సంచలన విజయాలు నమోదు చేశాయి. అయితే ‘పెద్ది’ విషయంలో అదే స్థాయి ప్రభావం ఇప్పటివరకు కనిపించడం లేదు.
చిత్రబృందం ఉత్తరాదిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. భోపాల్‌లో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో పాటు ముంబై, ఢిల్లీల్లో మీడియా సమావేశాలు నిర్వహించారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ సహా ప్రధాన తారాగణం ప్రమోషన్లలో చురుకుగా పాల్గొన్నారు. అయినప్పటికీ, ఆ ప్రచారానికి తగ్గట్టుగా హిందీ వసూళ్లు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
అయితే వీకెండ్‌లో పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. శనివారం హిందీ వెర్షన్‌కు ఆక్యుపెన్సీ పెరిగినట్లు సమాచారం. ఆదివారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే ఫస్ట్ వీకెండ్‌లో మెరుగైన వసూళ్లు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. పాజిటివ్ మౌత్ టాక్ బలంగా ఉండటంతో రానున్న రోజుల్లో ‘పెద్ది’ హిందీ మార్కెట్‌లోనూ పుంజుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.