Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లతో సత్తా చాటుతున్న ఈ చిత్రం, హిందీ మార్కెట్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌లేక‌పోయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘పెద్ది థ్యాంక్స్ మీట్’లో నిర్మాత వెంకట సతీష్ కిలారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మొదటగా తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, సినిమా విజయానికి వారి మద్దతే ప్రధాన కారణమని అన్నారు. “తెలుగు ప్రేక్షకులు సినిమాపై చూపిస్తున్న ప్రేమకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. సోమవారం నుంచి సినిమా ఎలా నిలబడుతుందా అనే సందేహాలు ఉన్నా, ప్రేక్షకుల ఆదరణతో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది” అని పేర్కొన్నారు.

ఆదివారం నుండి మారిన ప‌రిస్థితి..

అనంతరం హిందీ వసూళ్ల గురించి మాట్లాడుతూ, చిత్రబృందం ఉత్తర భారతదేశంలో విస్తృతంగా ప్రమోషన్లు నిర్వహించినప్పటికీ ప్రారంభ రోజుల్లో ఆశించిన స్పందన రాలేదని అంగీకరించారు. అయితే ఆదివారం నుంచి పరిస్థితి మారిందని, హిందీ వెర్షన్ కలెక్షన్లు క్రమంగా పెరుగుతున్నాయని చెప్పారు.

“హిందీలో కూడా ఆదివారం నుంచి మంచి జోరు కనిపిస్తోంది. కలెక్షన్లు మెరుగుపడుతున్నాయని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా బలమైన వసూళ్లు నమోదవుతాయని ఆశిస్తున్నాం” అని వెంకట సతీష్ కిలారు వెల్లడించారు.

‘పెద్ది’ చిత్రానికి తెలుగు వెర్షన్‌లో వచ్చిన స్పందనతో పోలిస్తే హిందీ మార్కెట్‌లో ప్రారంభ వసూళ్లు తక్కువగా ఉండటం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాన్ ఇండియా సినిమాలకు ఉత్తర భారత ప్రేక్షకులతో భావోద్వేగ అనుబంధం, స్థానిక కనెక్ట్ కూడా కీలకమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జాన్వీ పాత్ర‌పై విమ‌ర్శ‌లు..

ఇదిలా ఉంటే, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రంలో సామాజికంగా అణగారిన వర్గానికి చెందిన ఓ యువకుడు క్రీడల ద్వారా తన స్వరాన్ని వినిపించిన కథను చూపించారు. రామ్ చరణ్ నటన, ఎమోషనల్ కంటెంట్, మాస్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి.

అయితే విడుదల అనంతరం జాన్వీ కపూర్ పాత్రను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు సానా ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తున్నట్లు చెబుతూ, అభ్యంతరాలు వ్యక్తమైన కొన్ని సన్నివేశాలను సినిమా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తర్వాత వివాదం కొంతమేర సద్దుమణిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం ‘పెద్ది’ తెలుగు రాష్ట్రాల్లో బలమైన వసూళ్లతో కొనసాగుతుండగా, హిందీ మార్కెట్‌లో కూడా మౌత్ టాక్ ప్రభావంతో క్రమంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో సినిమా మొత్తం బాక్సాఫీస్ ప్రదర్శన ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మారింది.