Ramayana Glimpse: A Divine Journey of Faith, Emotion and Grandeur
రామాయణం గ్లింప్స్
నితేశ్ తివారీ ‘రామాయణం’ తొలి గ్లింప్స్ భవ్య దృశ్యాలు, హృద్యమైన భావోద్వేగాలతో ఆకట్టుకుంది. రాముడి జీవన ప్రయాణాన్ని క్లాసికల్ టచ్‌తో, అద్భుత వీఎఫ్ఎక్స్‌తో చూపించారు. రణబీర్ కపూర్ రాముడిగా ఒదిగిపోయాడు. దర్శకుడు నితేశ్ తివారీ ప్రతిభ మెప్పించింది.మొత్తంగా ఈ గ్లింప్స్ భారీ అంచనాలను పెంచే విధంగా నిలిచింది.
• హృదయాన్ని తాకేలా ఆకట్టుకున్న భావోద్వేగాలు
• కళ్లుచెదిరే వీఎఫ్ఎక్స్ దృశ్యాలు – డినెగ్ మాయాజాలం
• రాముడిగా నటనలో ఒదిగిపోయిన రణబీర్
• అంచనాలను అమాంతం పెంచిన దర్శకుడు నితేశ్ తివారీ
(విధాత ప్రత్యేక సమీక్ష )
శ్రీ ఆంజనేయ జయంతి సందర్భంగా విడుదలైన నితేశ్ తివారీ ప్రతిష్టాత్మక చిత్రం రామాయణం తొలి గ్లింప్స్ అంచనాలకతీతంగా స్పందన అందుకుంది. యూట్యూబ్‌లో ఇప్పటికే మిలియన్ల వ్యూస్ సాధించిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 2 నిమిషాల 38 సెకన్ల గ్లింప్స్‌లో శ్రీరాముడి జీవన ప్రయాణాన్ని భవ్యంగా, క్లాసికల్ టచ్‌తో చూపిస్తూ “మన చరిత్ర – మన సత్యం” అనే భావాన్ని ప్రతిబింబించారు.
భావోద్వేగాలే ఆయువుపట్టు : చలింపజేసిన తండ్రీకొడుకుల బంధం
‘రామ్’ అన్న పిలుపుతో వెనక్కి తిరిగి చూసే రాముడి భావోద్వేగ క్షణం
రామాయణం నిజంగా ఇలాగే జరిగిందేమో అనిపించేలా దర్శకుడు నితేశ్ తివారీ ఈ గ్లింప్స్‌లో ఇతిహాస ఆత్మను సజీవంగా చూపించాడు. ముఖ్యంగా వనవాసానికి బయలుదేరిన రాముడు గుహుడి నావలో నదిని దాటుతున్నప్పుడు “రామ్” అనే మెల్లని పిలుపు వినిపించగానే వెనక్కి తిరిగి చూసే సన్నివేశం హృదయాన్ని కదిలిస్తుంది. ఆ పిలుపు తన తండ్రి దశరథుడిదేనన్న భావనను రాముడిలో కలిగించడం, తండ్రీకొడుకుల అనుబంధాన్ని ఎంతో గాఢంగా చూపించింది. సీత, లక్ష్మణులతో కలిసి అయోధ్యను విడిచి అరణ్యవాసానికి బయలుదేరే సమయంలో కనిపించే బాధ కూడా అదే భావాన్ని మరింతగా బలపరుస్తుంది. అయోధ్యావాసులంతా చీకట్లో ఉండగా, సీతారామలక్ష్మణులే వెలుగులా కనిపించడం ద్వారా ‘అయోధ్య వెలుగు వెళ్లిపోతుంది’ అనే భావాన్ని దర్శకుడు అందంగా ప్రతిబింబించాడు.
వనవాసానికి బయలుదేరేముందు అయోధ్యలో ప్రజల మధ్య భావోద్వేగ వాతావరణం
మంత్రముగ్ధులను చేసిన విజువల్ ఎఫెక్ట్స్
ఇక వీఎఫ్ఎక్స్ విషయానికొస్తే, హాలివుడ్లో ప్రతిష్టాత్మక సంస్థ, 8 ఆస్కార్ అవార్డుల విజేత డినెగ్(DNEG) ఈ బృహత్తర ప్రాజెక్టు పనులను చేపట్టింది. రామాయణం చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రాకు చెందిన నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్‌కు డినెగ్ అనుబంధ సంస్థ. ఆ విధంగా రామాయణం డినెగ్ సొంత ప్రాజెక్ట్ కూడా డినెగ్ సంస్థ అందించిన వీఎఫ్ఎక్స్ ఈ గ్లింప్స్‌లో ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. పుష్పక విమానం, జటాయువు యుద్ధం, రాక్షసులతో పోరాట సన్నివేశాలు అబ్బురపరిచాయి. అయితే ఖరదూషణాది రాక్షసుల రూపకల్పన కొంచెం కృతకంగా కనిపించడం చిన్న లోపంగా ఇప్పుడు అనిపించినా మొత్తంగా ఎంత ఘనంగా ఉంటుందో ఊహించవచ్చు.
రావణుడి పుష్పక విమానంపై జటాయువు వీరోచిత దాడి
మర్యాద పురుషోత్తముడిగా మైమరపించిన రణబీర్
శ్రీరామచంద్రమూర్తిగా రణబీర్ కపూర్ మూర్తిభవించిన శాంతంగా, మానసిక పరిణితి సాధించిన మర్యాదా పురుషోత్తముడిగా ఒదిగిపోయాడు. అతని రూపం, ఆహార్యం రాముడి పాత్రకు అచ్చుగుద్దినట్లుగా కుదిరాయి. ఇప్పటికవరకు తెలిసిన రణబీర్ వేరు, ఇకముందు కనబడబోయే రణబీర్ వేరు. దశరథ మహారాజుగా అలనాటి టీవీ రాముడు అరుణ్ గోవిల్, సీతామాతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే, రావణాసురుడిగా కేజీఎఫ్ ఫేం యశ్ పాత్రలను ఛాయామాత్రంగానే చూపించారు. అంటే, ఈ గ్లింప్స్ కేవలం శ్రీరాముడి పరిచయ దృశ్యాలుగా మాత్రమే ప్రదర్శించడం చిత్ర బృందం ఉద్దేశం.
మాటలు లేకుండా విడుదలైన ఈ వీడియో, సంగీతం తోనే భావోద్వేగాన్నిఆకాశం అంచులదాకా తీసుకెళ్లింది. ప్రముక్ జర్మన్ సంగీత కారుడు హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రహమాన్ నేపథ్య సంగీతం మనసులను తెలియకుండానే భారంగా మార్చింది. రామాయణ కావ్యంలోని సుఖదు:ఖాలను సంగీతం అద్భుతంగా ఆవిష్కరించింది.
ప్రశంసనీయంగా దర్శకుడు నితేశ్ తివారీ పనితనం
రామాయణాన్ని తెరపై సజీవంగా ఆవిష్కరించిన దర్శకుడు నితేశ్ తివారీ
ఆఖరుగా చెప్పుకుంటున్నా, ప్రముఖంగా చెప్పుకోవాల్సింది దర్శకుడు నితేశ్ తివారీ గురించి. రామాయణాన్ని ఎన్నిసార్లు చదివాడో, ఎన్నిరకాలు చదివాడో, ఆలోచనలతో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో తెలియదుగానీ, రామాయణాన్ని, దానిలోని భావోద్వేగాలను, గాఢతను, వెలుగునీడలను ప్రేక్షకులు ఆసాంతం అనుభవించేలా చిత్రీకరించినట్లు అనిపిస్తోంది. దర్శకుడిగా నితేశ్ నిబద్ఢత ఎలా ఉంటుందో ‘దంగల్’లో చూసాం కనుక నిర్మాత నమిత్ మల్హోత్రా కలల ప్రాజెక్టును తన కలగా మార్చుకున్నాడు.
శ్రీరామచంద్రుడి రూపలావణ్యాలు అద్భుతం
దివ్య కాంతిలో రాజసంగా మెరిసిపోతున్న శ్రీరాముడిగా రణబీర్ కపూర్
అతి ప్రధానంగా శ్రీరాముడు భారతీయుల మదిలో ఏ రూపంలో కొలువైఉన్నాడో దానిని మార్చడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే ఆ రూపంలో దైవత్వం ఇమిడిఉంది. అందులో తేడా జరిగినా, భారత్ ఊరుకోదు. ఇక్కడా ‘ఆదిపురుష్’ ఆ ఘోర తప్పదం చేసింది. సరే… ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే, 14ఏళ్లు వనవాసం చేసిన రాముడికి గడ్డాలు, మీసాలు పెరగవని ఎవరూ అనుకోరు. కానీ, ఆ రూపాన్ని చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడరు. హిందీ ప్రేక్షకులకు అరుణ్ గోవిల్ రూపం రాముడిగా ముద్రపడిపోయింది. పైగా పౌరాణిక చిత్రాలు హిందీలో పెద్దగా లేవు కూడా. ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసే కొన్ని విషయాలను ముట్టుకోగూడదు.
శ్రీరామచంద్రమూర్తి అంటే దక్షిణాదికి ఎన్టీఆర్ మాత్రమే
ఎన్టీఆర్ శ్రీరాముడు – మహేష్ బాబు ఏఐ రూపం: తరాల మధ్య రాముడి ప్రతిరూపం
ఇక దక్షిణాది చిత్రాల గురించి చెప్పే పనే లేదు. అందునా, తెలుగు సినిమాల్లో శ్రీరామచంద్రుడిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనేక చిత్రాల్లో నటించి, రాముడంటే ఇలాగే ఉంటాడనే అభిప్రాయాన్ని ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిపారు. తమిళంలో కూడా ఎన్టీఆర్ సినిమాలే రాముడిని చూపించాయి. ఈ విషయంలో నితేశ్ చాలా జాగ్రత్త వహించి రాముడి రూపురేఖల విషయంలో ప్రయోగాల జోలికి పోలేదు.
నటీనటుల ఎంపికతోనే సగం విజయం
నిజానికి రామాయణ మహాఇతిహాసం భారతీయుల హృదయంలో ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిఉంటుంది. అందుకే ఈ దేశంలో 300కు పైగా రామాయణాలు రాయబడ్డాయి. రామాయణంలోని ప్రతీపాత్ర గురించి ప్రజలకు సంపూర్ణ అవగాహన ఉంది. ఏ మాత్రం తేడా చేసినా భరించలేరు. అందుకే ఆదిపురుష్ దారుణంగా ఓడిపోయింది. రామాయణం ఒక కథలా కాక, రాముడి జీవన ప్రస్థానంలా చూపిస్తేనే భావేద్వోగాలు పండుతాయి. అందులో నితేశ్ విజయం సాధించాడని ఇప్పుడే ఒక అంచనాలకు రాలేం కానీ, చూసినంత వరకు సంతృప్తిగా ఉంది. ఆయా పాత్రలకు నటీనటులను ఎంపిక చేసుకోవడంలోనే తొలి విజయం సాధించాడు. ముఖ్యంగా రణబీర్‌లో రాముడిని చూడగలిగిన నితేశ్, సాయి పల్లవిని సీతమ్మగా ఎంపిక చేసి భారత సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచేసాడు. సాయి పల్లవి ఉత్తరాది ప్రేక్షకులకు అసలు పరిచయమే లేదు. మొన్ననే తన తొలి హిందీ చిత్రం ఏక్ దిన్ ట్రైలర్ విడుదలైంది. అటువంటిది పల్లవిని ఎంపిక చేయడమంటే జానకీదేవిని పూర్తిగా అర్థం చేసుకున్నట్లు లెక్క. సీతమ్మ అద్భుత సౌందర్యరాశి మాత్రమే కాదు, ఆ అందంలో దైవత్వం ఉంటుంది. ఎవరికైనా చేతులెత్తి మొక్కాలనిపిస్తుందే తప్ప ఇతరత్రా భావనలు కలుగవు. సాయి పల్లవి అందుకే వైదేహిగా వందశాతం నప్పింది.
తాటకితో అరణ్యంలో శ్రీరాముడి యుద్ధం
సోషల్ మీడియాలో ట్రోలర్లు రకరకాలుగా విమర్శించినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వారికి చాలా కారణాలుంటాయి. విఎఫ్ఎక్స్ కూడా మైమరిపించేలా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత పేరెన్నిక గన్న డినెగ్ కంటే గొప్పగా ఎవరూ సీజీ వర్క్ చేయలేరు. పైగా వారి సొంత సినిమా. కాకపోతే, అదంతా దర్శకుడి సృజనాత్మకతపై ఆధారపడిఉంటుంది. ఎస్ఎస్ రాజమౌళిది ఈ విషయంలో అందెవేసిన చెయ్యి. అన్నట్లు ఆయన కూడా తెలుగు సూపర్‌స్టార్ మహేశ్‌బాబును తన తదుపరి చిత్రం ‘వారణాసి’లో కాసేపు రామచంద్రుడిగా మెరిపించబోతున్నాడు. మహేశ్‌బాబు కూడా శ్రీరాముడిగా చాలా బాగుంటాడని తెలుగు ప్రేక్షకుల ప్రగాఢ విశ్వాసం. ఒకరకంగా చెప్పాలంటే, రణబీర్ కన్నా మహేశే బాగున్నాడని తను రాముడిగా కనిపిస్తున్న ఏఐ చిత్రాలు చెబుతున్నాయి.
మహా కావ్యం – మహా యజ్ఞం
నితేశ్ తివారీ రామాయణాన్ని రెండు భాగాలుగా, ఒకే యజ్ఞంగా చిత్రీకరిస్తున్నాడు. ప్రతీ భారతీయుడి నరనరాన చెరగని ముద్ర వేసిన ఆది కావ్యాన్ని అమర చిత్రంలా నిలుపగలిగితే ఆయన జన్మ ధన్యమైనట్లే. భారత సినీ చరిత్రలో అత్యంత భారీగా 4000 కోట్ల ఖర్చుతో, ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదివేల మంది అహరహం శ్రమిస్తున్న ఈ చిత్రరాజం విశ్వవ్యాప్తంగా విజయం సాధించి ప్రపంచ సినీ ప్రేక్షకుల నీరాజనాలందుకోవాలని కాంక్షించడంలో తప్పులేదు కదా.
రణబీర్ కపూర్ శ్రీరామ చంద్రుడిగా, సాయి పల్లవి జానకీ దేవిగా, రవి దూబే లక్ష్మణుడిగా, యశ్ రావణాసురుడిగా, సన్నీ దేవల్ హనుమంతుడిగా, అరుణ్ గోవిల్ దశరథుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరి, రకుల్‌ప్రీత్ సింగ్ శూర్పణఖగా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటిది ఈ ఏడాది దీపావళికి, రెండవది వచ్చే దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నమిత్ మల్హోత్రా తన ప్రైమ్ ఫోకస్, నటుడు, రావణ పాత్రధారి యశ్ తన మాన్స్టర్ మైండ్ బ్యానర్లపై కలిసి నిర్మిస్తున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు.
