మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనైపోతుందని సామెత. ఇప్పుడు మనం నివసిస్తున్న భూమికి సైతం రానున్న రోజుల్లో ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. ప్రస్తుతం భూమిపై జనాభా సుమారు 830 కోట్లు. ఇప్పటికే భూమిపై ఉన్న వనరులు సరిపోయే పరిస్థితి లేదు. 2070 నాటికి జనాభా 1240 కోట్లకు చేరుతుందని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటున్నది. భూమికి ఉన్న సురక్షిత పరిధి క్రమంగా తగ్గిపోతున్నదని తెలిపింది. ఇప్పటికే నగరాలు, పట్టణాలు జనాభాతో కిక్కిరిసిపోతున్నాయి. ఇదే పద్ధతిలో జనాభా పెరుగుతూ పోతే.. ఇక నాలుగు దశాబ్దాల తర్వాత పరిస్థితి సులభంగానే ఊహించుకోవచ్చు.
ఈ పరిస్థితి భూమిమీద ఉన్న వనరులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుందని నిపుణుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రానున్న రోజుల్లో వనరులు తగ్గిపోయి.. జనాభా పెరిగిపోతూ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే భూమి తన గరిష్ఠ స్థాయికి లేదా బ్రేకింక్ పాయింట్‌కు చేరుకుంటున్నదనే భావన ఉన్నది. తాజా శాస్త్రీయ పరిశోధనలు దానిని రుజువు చేస్తున్నాయి.
అధిక జనాభా అనేది ఒక సింపుల్ విషయం కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. జన సంచారం లేని ప్రాంతాలు ఆరోగ్యకరంగా, శుభ్రంగా ఉంటాయి. అదే రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఎంత దుర్లభంగా ఉంటాయో తెలియనిది కాదు. ఒక నగరంలో జనాభా పెరిగితే.. ఆ నగరానికి మౌలిక సదుపాయాల కల్పన సమస్యగా మారుతుంది. ప్రజా రవాణా పెను సవాలుగా తయారవుతుంది. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం వంటి కనీస అవసరాలు క్లిష్టంగా మారుతాయి. పరిశ్రమలు పెరగాల్సి వస్తుంది. దాని ద్వారా కాలుష్యం పెరుగుతుంది. వీటికి తోడు ఆహార ఉత్పత్తి, పంపిణీ అనేవి ప్రధాన సవాళ్లుగా ముందుకు వస్తాయి. నివాసాల నుంచి రెట్టింపు శాతంతో వచ్చే వ్యర్థ జలాలు, వ్యర్థాలు, చెత్త.. ఈ భూమిని మురికి కూపంగా మార్చేస్తాయి. అయితే.. ప్రతి ఒక్కరూతమ పర్యావరణ పరిమితులను గుర్తెరిగి, బాధ్యతాయుతంగా జీవిస్తే 250 కోట్ల జనాభా పెరుగుదలతో సరిపెట్టుకోవచ్చని గణాంకాలు పేర్కొంటున్నాయి.
భవిష్యత్తులో తలెత్తే ప్రమాదాన్ని ఇప్పటి నుంచే అదుపు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలను పరిశోధకులు కోరుతున్నారు. హద్దులు దాటితే.. పర్యావరణానికి తిరిగి సరిచేయలేని స్థాయిలో నష్టం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. జనాభా పెరుగుదలను నియత్రించడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం కాబోదని కూడా చెబుతున్నారు. ఈ భూమిపై ఎంత మంది ఉన్నారనేది సమస్య కాదని, వారు ఎలా జీవిస్తున్నారన్నదే ప్రశ్న అని పేర్కొంటున్నారు. అధిక వినియోగం, వనరుల దుర్వినియోగం, పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం వంటివే ప్రధాన అంశాలని స్పష్టం చేస్తున్నారు.
‘మనం ప్రధానమైన మార్పులు చేయని పక్షంలో ప్రస్తుత మానవాళి మార్గం సమాజాలను మరింత లోతైన సంక్షోభాల్లోకి నెట్టేసేలా ఉంది’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ బ్రాడ్‌షా పేర్కొన్నారు.
పర్యావరణ మార్పులను నియంత్రణలో ఉంచుకునేందుకు ప్లానెటరీ బౌండరీస్ పేరుతో ఒక కాన్సెప్ట్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. అందులో.. వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య నష్టం, తాగునీటి వినియోగం, భూమి వినియోగ మార్పులు.. ఈ అంశాల్లో పరిమితులు దాటితే భూమి తన స్థిరత్వాన్ని కోల్పోతుందని స్పష్టంచేస్తున్నారు. ఇప్పటికే కొన్ని హద్దులు దాటామని తాజా పరిశోధనలు పేర్కొంటున్నాయి. జీవ వైవిధ్య బాగా తగ్గిపోతున్నది. వాతావరణ మార్పుల్లో వేగం పెరిగింది. ఇది ప్రకృతిని మనుషులు ప్రభావితం చేయడాన్ని దాటిపోయి.. ప్రకృతినే మార్చే స్థాయికి వెళ్లిపోతున్నారనేందుకు ఇవి నిదర్శనాలని పేర్కొంటున్నారు.
ఇప్పటికిప్పుడు భూమి పూర్తిగా నాశనం కాకపోయినా.. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలపైనే దాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
