Crude Oil | అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా పెరిగిన క్రూడాయిల్‌ ధరలు.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతాయా?

  • Publish Date - April 3, 2024 / 10:50 AM IST

Crude Oil | అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్యారెల్‌కు 88 డాలర్ల మార్క్‌ను దాటింది. గతేడాది అక్టోబర్‌ తర్వాత భారీగా పెరిగింది. అయితే, రష్యా చమురు యూనిట్లపై ఉక్రెయిన్‌ దాడులకు పాల్పడుతున్నది. అదే సమయంలో మిడిల్‌ ఈస్ట్‌లోని దేశాల మధ్య విభేదాల నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ కూడాయిల్‌ ధరలు మంగళవారం బ్యారెల్‌కు 1.29 డాలర్లు పెరిగి 88.71 డాలర్లకు చేరుకుంది. డబ్ల్యూటీఐ క్రూడ్‌ 1.30 డాలర్లు పెరిగి.. బ్యారెల్‌కు 85.01 డాలర్లకు ఎగిసింది. మంగళవారం రష్యాలోని అతిపెద్ద రిఫైనరీలో ఒకదానిపై ఉక్రెయిన్‌ డ్రోన్‌తో దాడికి పాల్పడింది. ఈ దాడితో రిఫైనరీ ప్రైమరీ చమురు శుద్ధి యూనిట్‌పై ప్రభావం చూపింది. ప్లాంట్ మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 3.40 లక్షల బ్యారెళ్లలో ఈ యూనిట్ సగం ఉంది.

ప్రపంచదేశాలకు అత్యధికంగా చమురును ఎగుమతి చేసే మూడు దేశాల్లో రష్యా ఒకటి. ప్రస్తుతం రష్యా చమురు రిఫైనరీలపై ఉక్రెయిన్‌ దాడులతో అల్లాడుతున్నది. అదే సమయంలో రష్యా సైతం ఉక్రెయిన్‌ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను పెంచింది. ఇదిలా ఉండగా.. రెండో త్రైమాసిక ముగిసే వరకు ఒపెక్‌ దేశాలు రోజుకు 22 మిలియన్‌ బ్యారెల్స్‌ చమురు ఉత్పత్తిని కోతను కొనసాగించే అవకాశాలున్నాయి. ఒపెక్‌ చమురు ఉత్పత్తి గత నెలలో రోజుకు 50వేల బ్యారెల్స్‌ కోత విధించింది. దాంతో చమురు ఉత్పత్తి తగ్గి.. డిమాండ్‌ పెరిగే అవకాశాలున్నాయి. మరో వైపు.. సిరియా రాజధాని డమాస్కస్‌లోని తమ కాన్సులేట్‌పై అనుమానిత ఇజ్రాయెల్ వైమానిక దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెచ్చరించారు. ఇప్పటికే గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని కొనసాగిస్తున్నది. దీంతో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Latest News