Credit Score : క్రెడిట్ స్కోర్ తరచుగా చెక్ చేస్తే నష్టమా?

చేపట్టే హార్డ్ ఎంక్వైరీ vs సాఫ్ట్ ఎంక్వైరీ, క్రెడిట్ స్కోర్ ప్రభావం, ఎప్పుడూ, ఎవరు చెక్ చేస్తున్నారో తెలుసుకోవడం ముఖ్యమే.

credit-score

క్రెడిట్ స్కోర్ ను తరచుగా చెక్ చేస్తే నష్టం ఉందా? మీ క్రెడిట్ స్కోర్ ను వేరే వ్యక్తులు కూడా చూడవచ్చా? ఉచితంగా క్రెడిట్ స్కోర్ ను ఇచ్చే సంస్థలను నమ్మవచ్చా? అసలు క్రెడిట్ స్కోర్ ను ఎన్ని రోజులకు ఓసారి చెక్ చేయాలి? క్రెడిట్ స్కోర్ కోసం ఎవరికి పడితే వాళ్లకు మన సమాచారం ఇవ్వవచ్చా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తే పాయింట్లు తగ్గుతాయా?

క్రెడిట్ స్కోర్ ను తరచుగా చెక్ చేస్తే మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతోందా? అని ప్రతి ఒక్కరి ప్రశ్నిస్తుంటారు. అయితే క్రెడిట్ స్కోర్ ను చెక్ చేస్తే మీ స్కోర్ తగ్గదని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఆర్ధిక లావాదేవీలు, ఆర్ధిక క్రమశిక్షణ ఆధారంగా క్రెడిట్ స్కోర్ ఉంటుంది. ఈ స్కోర్ ను చెక్ చేస్తే పాయింట్లు తగ్గే అవకాశం ఉండదు. ఏదైనా బ్యాంకు లేదా లోన్లు ఇచ్చే సంస్థలు మీ క్రెడిట్ స్కోర్ ను చెక్ చేస్తే అప్పుడు క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరు పడితే వారు మీ వ్యక్తిగత వివరాలు, పాన్ నెంబర్ అడిగితే ఇవ్వవద్దని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు.

హార్డ్ ఎంక్వైరీ అంటే ఏంటి?

లోన్ల కోసం బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థలను సంప్రదించిన సమయంలో మీ ఆర్ధిక లావాదేవీలను అవి పరిశీలిస్తాయి. దీనినే హార్డ్ ఎంక్వైరీ అంటారు. హౌజింగ్ లోన్, వాహనాల కోసం రునాలు, వ్యక్తిగత రుణాల కోసం ధరఖాస్తు చేసిన సమయంలో బ్యాంకర్లు మీ క్రెడిట్ స్కోర్ గురించి ఎంక్వైరీ చేస్తాయి. దీన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు. ఇలా లోన్ కోసం ఆర్ధిక సంస్థలను సంప్రదించిన ప్రతిసారీ క్రెడిట్ స్కోర్ ను చెక్ చేస్తారు. ఆ వివరాలు నమోదు చేస్తారు. దీంతో క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపుతాయి. అంటే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంది. దీని వల్ల కనీసం 5 నుంచి 10 పాయింట్లు క్రెడిట్ స్కోర్ తగ్గే ఛాన్స్ ఉంది. క్రెడిట్ కార్డుకు ధరఖాస్తు చేసుకున్నా కూడా క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. లోన్ కానీ, క్రెడిట్ కార్డు కోసం కనీసం ఒక్కో ధరఖాస్తుకు కనీసం 3 నుంచి 6 నెలల టైమ్ తీసుకోవాలి.

సాఫ్ట్ ఎంక్వైరీ అంటే ఏంటి?

మీరు స్వంతంగా సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ ను చెక్ చేయడం, లేదా క్రెడిట్ బ్యూర్ వెబ్ సైట్ ద్వారా మీ సిబిల్ స్కోర్ తనిఖీ చేయడాన్ని సాఫ్ట్ ఎంక్వైరీ అంటారు. బ్యాంకులు పంపిన ముందస్తు అనుమతి పొందిన లోన్ లేదా క్రెడిట్ కార్డు ఆఫర్లు దీని కిందకు వస్తాయి. ప్రీ అప్రూవ్డ్ లేదా ప్రీ క్వాలిఫైడ్ రుణాలు లేదా క్రెడిట్ కార్డు, ఎంప్లాయిమెంట్ బ్యాక్ గ్రౌండ్ చెక్ వంటివి సాఫ్ట్ ఎంక్వైరీ పరిధిలోకే వస్తాయి. సాఫ్ట్ ఎంక్వైరీ వల్ల క్రెడిట్ స్కోర్ పై ఎలాంటి ప్రభావం పడదు. కనీసం నెలకు ఓసారి మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేయాలి. అలా చేసిన సమయంలో మీకు తెలియకుండా మీ క్రెడిట్ స్కోర్ గురించి ఎవరైనా విచారించారా అనే విషయాలు తెలుస్తాయి.

మీ క్రెడిట్ స్కోర్ ను ఎవరు చెక్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా?

భారత్ లో నాలుగు కంపెనీలు క్రెడిట్ స్కోర్ ను నిర్ధారిస్తున్నాయి. ప్రధానంగా సిబిల్ సంస్థ స్కోర్ ను ప్రమాణికంగా తీసుకుంటున్నారు. 300 నుంచి 900 వరకు క్రెడిట్ స్కోర్ ఉంటుంది. 750 పాయింట్లు ఉంటే మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నట్టుగా చెబుతారు. మీ క్రెడిట్ స్కోర్ ను ఎవరు చెక్ చేశారో తెలుసుకోవచ్చు. సిబిల్ సంస్థ నుంచి రిపోర్ట్ ను తీసుకోవడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ ను ఎవరు చెక్ చేశారో తెలిసిపోతోంది. ఈ రిపోర్టులో ఎంక్వైరీ ఇన్ఫర్మేషన్ కేటగిరిలో ఈ వివరాలు ఉంటాయి. ఈ వివరాలపై సిబిల్ ను క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మీకు తెలియకుండా ఎవరైనా మీ క్రెడిట్ స్కోర్ గురించి విచారిస్తే జాగ్రత్తగా ఉండాలి.
ఉచితంగా క్రెడిట్ స్కోర్ ఇస్తామనే సంస్థలకు ఈమెయిల్, మొబైల్ నెంబర్లు ఇవ్వవచ్చా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కొన్ని సంస్థలు ఉచితంగా ఈ వివరాలు ఇచ్చే పేరుతో మీ వివరాలను తీసుకుంటారు. అవి థర్డ్ పార్టీకి చేరుతాయి. మీకు క్రెడిట్ స్కోర్ అందిస్తామని చెబుతున్న సంస్థకు సిబిల్ సంస్థతో సంబంధం ఉందా లేదో కూడా చెక్ చేసుకోవాలి.