mayuri kango success story । మహేశ్ భట్ట దర్శకత్వంలో 1996లో వచ్చిన పాపా కెహ్తే హై చిత్రంతో వెలుగులోకి వచ్చిన మయూరీ కంగో.. చాలా కాలంగా సినీ పరిశ్రమలో లేదు. ప్రస్తుతం ఐటీ రంగంలో తన ప్రతిభను చాటుకుంటున్నది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే.. గూగుల్ ఇండియాలో హెడ్ ఆఫ్ ఇండస్ట్రీగా పని చేస్తున్నది. ఇంకో విషయం ఏమిటంటే.. ఆమె పెళ్లి చేసుకున్నాక ఎంబీఏ పూర్తి చేసింది. ఇంకా గుర్తు రాలేదా? మహేశ్ బాబుతో వంశీ అనే సినిమాలో నటించిన అమ్మాయి. ఈ సినిమాలో మహేశ్ భార్య నమ్రత శిరోద్కర్ కూడా నటించింది.
ఒక నటిగా ఉన్న మయూరీ కంగో ప్రస్తుతం మార్కెటీర్‌గా ఎదగడంలో సాగిన ప్రయాణం చాలా స్ఫూర్తినిస్తుంది. తల్లి థియేటర్ ఆర్టిస్టు. తండ్రి ఔరంగాబాద్‌లో రాజకీయ నాయకుడు. ఒక్కతే కుమార్తె. ఒకసారి తన తల్లి షూటింగ్ నిమిత్తం తొలిసారి ముంబైకి వచ్చిన మయూరి.. అక్కడే దర్శకుడు సయీద్ అక్తర్ మీర్జాను కలిసినట్టు ఐఎండీబీ పేర్కొంటున్నది. మయూరిలో ప్రతిభను గుర్తించిన మీర్జా.. 1995లో నసీం అనే సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా బాబ్రీ మసీదు కూల్చివేత నేపథ్యంలో తీసినది. వాస్తవానికి హెచ్‌ఎస్‌సీ బోర్డు పరీక్షల పేరుతో ఆఫర్‌ను మయూరి తిరస్కరించినా.. డైరెక్టర్‌తో పలు దఫాలుగా జరిపిన చర్చలతో అందులో నటించేందుకు అంగీకరించింది. ఆ సినిమాలో ఆమె నటనకు ముగ్ధుడైన దర్శకుడు మహేశ్ భట్.. తన తదుపరి సినిమా పాపా కెహ్తే హై లో పాత్రను ఆఫర్ చేశాడు. ఆ సినిమా కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కానప్పటికీ.. ఆమె నటనకు మాత్రం మార్కులు పడ్డాయి. ఆ తర్వాత బేతాబీ, హోగీ ప్యార్ కీ జీత్, బాదల్ వంటి సినిమాల్లో నటించింది. తెలుగులోనూ మహేశ్ బాబుతో వంశీ అనే సినిమాలో ఒక పాత్ర పోషించింది. ఇదే సినిమాలో మహేశ్ ప్రస్తుత భార్య నమ్రత శిరోద్కర్ కూడా నటించింది. టెలివిజన్ నటిగానూ పలు సీరియళ్లలో నటించిన మయూరి.. 2003లో ఆదిత్య థిల్లాన్‌ను వివాహం చేసుకున్నది. సినీ పరిశ్రమకు గుడ్‌బై చెప్పేసి.. అమెరికా వెళ్లిపోయింది.
అమెరికా వెళ్లిన తర్వాత 2005, 2007 మధ్య మార్కెటింగ్, ఫైనాన్స్‌లో న్యూయార్క్‌లోని బరుచ్ కాలేజీలో ఎంబీయే చేసింది. అనంతరం 360ఐ అనే కంపెనీలో అసోసియేట్ మీడియా మేనేజర్‌గా పని చేసినట్టు ఆమె లింకెడిన్ ప్రొఫైల్ ద్వారా తెలుస్తున్నది. అప్పటి నుంచి పలు కంపెనీల్లో వివిధ బాధ్యతల్లో పనిచేసిన మయూరి కంగో.. 2012లో భారత్‌కు తిరిగి వచ్చి.. జెనిత్ కంపెనీలో చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా చేరి, ఐదేళ్లు పనిచేసింది. 2016లో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఏజెన్సీ అయిన పర్ఫార్మిక్స్‌లో ఎండీగా మూడేళ్లు పనిచేసింది. అక్కడ నుంచి బయటకు వచ్చిన అనంతరం మయూరి.. గూగుల్‌లో ప్రవేశించింది. అందులో 2024 ఆగస్ట్ వరకూ హెడ్ ఆఫ్ ఇండస్ట్రీ – ఏజెన్సీ పార్ట్‌నర్‌షిప్ బాధ్యతలోకి వెళ్లింది. ప్రస్తుతం ఆమె గూగుల్ ఇండియాకు చెందిన ఏఐ విభాగం మార్టెక్ అండ్ మీడియా సొల్యూషన్స్ హెడ్‌గా పనిచేస్తున్నారు.