ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొన్ని వస్తువులకు మాత్రమే ఎప్పటికీ చలనశీలత ఉంటూ ఉంటుంది. అందులో బంగారం ప్రత్యేకంగా నిలుస్తుంది. సంపదకు చిహ్నంగా మాత్రమే కాకుండా భద్రత, భవిష్యత్తుకు బలమైన పెట్టుబడిగా కూడా పసిడి పరిగణించబడుతుంది. ఈ నేపధ్యంలో గత కొన్ని నెలలుగా బంగారం ధరలు ఊహించని రీతిలో పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹1,00,000 మార్కును దాటడం అత్యంత ప్రాధాన్యత పొందిన ఆర్థిక అంశంగా మారింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.75,000 ప్రాంతంలో ఉన్న బంగారం ధర కేవలం 12 నెలల్లో ₹25,000 పెరగడం వెనుక అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావం గణనీయంగా ఉంది.
డాలర్ బలహీనత, స్టాక్ మార్కెట్ల అస్థిరత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు, అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారంపై పెట్టుబడులు పెంచిన అంశాలు, అన్నీ కలిసి బంగారం ధర పెరిగేందుకు దోహదపడ్డాయి. డాలర్ విలువ తగ్గినప్పుడు అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు చేయడం సులభం అవుతుంది. దాంతో గిరాకీ పెరిగి ధరలు పెరుగుతాయి. స్టాక్ మార్కెట్లలో నష్టాలు ఎదురైతే మదుపరులు తమ డబ్బును నష్టం కలగని ఆస్తి అయిన బంగారంమీద పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతారు. దీనివల్ల బంగారం ధర మరింతగా ఎగసిపడుతుంది.
అయితే నిపుణుల అభిప్రాయాల ప్రకారం బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు పరిమితంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మళ్లీ ధరలు తగ్గే దశకు చేరవచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, చైనా వంటి పెద్ద దేశాల కేంద్ర బ్యాంకులు తమ వద్ద ఉన్న అపారమైన బంగారు నిల్వల్లో కొంత భాగాన్ని మార్కెట్లోకి విక్రయిస్తే ఒక్కసారిగా సరఫరా పెరిగి ధర పడిపోవచ్చు. ఇదే జరిగితే ప్రస్తుత ధరల నుండి కనీసం 25 నుంచి 30 శాతం వరకు పతనం చోటు చేసుకునే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ₹1,00,000 ఉన్న 10 గ్రాముల బంగారం ధర, ₹70,000కి కూడా చేరవచ్చన్నమాట. అలాగే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే డాలర్ బలపడుతుంది. దీని ప్రభావంగా బంగారం ధరలు పడిపోతాయి. అంతేకాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లినట్లయితే, కొన్ని దేశాలు తమ బంగారు నిల్వలను విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల మార్కెట్‌లో బంగారం తక్కువ ధరకు అందుబాటులోకి రావడం వల్ల, తక్షణ ప్రభావంగా ధరల పతనం గణనీయంగా తగ్గిపోతుంది.
ప్రస్తుతం మార్కెట్ ధరలను గమనిస్తే, 22 క్యారెట్ల నగల బంగారం ధర కూడా ₹91,000 దాటిపోయింది. నగలపై తరుగు చార్జీలు, మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటివి కలిపితే ఒక తులం చిన్న గొలుసు కొనడానికి కనీసం లక్ష పదివేల రూపాయలు ఖర్చు అవుతోంది. ఇది సామాన్య వినియోగదారులకు పెద్ద భారం. ఈ ధరలు ఇకపై మరింత పెరుగుతాయా లేదా పడిపోతాయా అన్న అనిశ్చితి కొనసాగుతోంది. అయితే పెట్టుబడిదారుల విషయంలో ఇది కీలకమైన సమయంలో ఉన్నదని చెప్పవచ్చు. మరింత పెట్టుబడి పెడతారా, లేక ఇప్పటికే పెరిగిన ధరల్లో లాభాలు పొందేందుకు విత్‌డ్రా అవుతారా అన్నది వారి నిర్ణయం.
ఇక సాధారణ వినియోగదారులకు ఇదే సమయంలో బంగారం కొనుగోలు చేయాలా లేదా వేచిచూడాలా అన్న దానిపై స్పష్టత అవసరం. ధరలు మరింతగా పెరగవన్న ఊహల మధ్య కొనుగోలు చేస్తే వచ్చే రోజుల్లో నష్టాల బాటపడే ప్రమాదం ఉంది. మరోవైపు, ప్రస్తుతం ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నందున అవి పడిపోతే, సమయానికి సిద్ధంగా ఉన్న వారికి మంచి లాభాల అవకాశంగా మారవచ్చు.
ఈ నేపథ్యంలో పసిడి ధరల భవిష్యత్తు పూర్తిగా అంతర్జాతీయ ఆర్థిక పరిపరిణామాలపై ఆధారపడి ఉంది. డాలర్ బలం, కేంద్ర బ్యాంకుల చర్యలు, ప్రపంచ రాజకీయ పరిణామాలు, స్టాక్ మార్కెట్ల స్థిరత అన్నింటి కలయికే బంగారం ధరల దిశను నిర్ణయించబోతోంది. ఒకవేళ ఈ అంశాలలో ఏదైనా అనూహ్య మార్పు చోటుచేసుకుంటే, పసిడి ధరలు ఒక్కసారిగా పతనమయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. కనుక బంగారం పట్ల మక్కువ ఉన్న ప్రతిఒక్కరూ ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.
Categories : Business News, National News