Gold-Silver Price | బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూలేని విధంగా భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల కేంద్రం బడ్జెట్‌లో దిగుమతి సుంకం తగ్గించిన అనంతరం స్వల్పంగా దిగివచ్చాయి. ప్రస్తుతం మళ్లీ ధరలకు రెక్కలు వచ్చాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా మార్కెట్లలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ధరలు పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ ధరల పెంపునకు ప్రత్యక్షంగా సంబంధాలున్నాయని చెబుతున్నారు. సెప్టెంబర్ మాసంలో జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక భేటీలో వడ్డీ రేట్లను పావు శాతం తగ్గించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఇదే జరిగే బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన మాంద్యంలోకి జారుకునే అవకాశాలున్నాయంటూ పలు నివేదికలు పేర్కొంటున్నాయి. దాంతో మాంద్యం అందరినీ కలవరానికి గురి చేస్తున్నది. ఈ నేపథ్యంలో యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మాంద్యం నేపథ్యంలో చైనా, జపాన్‌తో పాటు ఇతర దేశాల సెంట్రల్ పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయి. డిమాండ్ కారణంగా ఈ ఏడాది దీపావళి నాటికి 24 క్యారెట్ల బంగారం ధర రూ.80వేల మార్క్‌ను అందుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వెండి ధర సైతం కిలోకు రూ.లక్ష మార్క్‌ను దాటే అవకాశాలు సైతం లేకపోలేదని చెబుతున్నారు. సాధారణంగా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే పసిడి ధరలు తగ్గుతూ వస్తుంటాయి.
ఎందుకంటే ఫెడ్ రిజర్వ్ జారీ చేసే ట్రెజరీ బాండ్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తిని కనబరుస్తారు. తమ పెట్టుబడులపై స్థిరమైన ఆదాయం అందించే అమెరికా బాండ్స్ మార్కెట్‌పై రాబడి అధికంగా ఉంటుంది. దాంతో పెట్టుబడులను బంగారం నుంచి బాండ్ మార్కెట్‌లోకి తరలిస్తారు. వడ్డీ రేట్లను తగ్గించిన సమయంలో మాత్రం బంగారం ధరలు పెరిగే అవకాశాలుంటాయి. ఆ సమయంలో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడిదారులు ఎక్కువ ఆసక్తిని చూపుతుంటారు. ప్రస్తుతం బంగారం ధరలు రూ.72వేల మార్క్‌ని దాటాయి. త్వరలోనే రూ.75వేలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే దీపావళి నాటికి రూ.80వేల మార్క్‌ని దాటడం ఖాయమని స్పష్టం చేస్తున్నది. అందుకు తగ్గట్లుగానే ఫ్యూచర్స్ మార్కెట్‌లో సానుకూల పవనాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో బంగారం ధర రూ.75వేల మార్క్‌ను దాటిన విషయం తెలిసిందే.