విధాత, హైదరాబాద్ ప్రతినిధి:
Indigo Airlines Crisis | గత వారం రోజులుగా ఇండిగో ఎయిర్ లైన్స్ వార్తలు పతాక శీర్షికలో ఉంటూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. మొన్నటి వరకు సమర్థవంతంగా నడుస్తూ ప్రయాణికుల ఆదరణ చూరగొన్నది. కానీ అకస్మాత్తుగా ప్రతిష్ఠను అమాంతం దిగజార్చుకున్నది. ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చిన బ్రాండ్ ఇమేజీని విమానాలను ఆలస్యంగా నడపడం, ఉన్నపళంగా రద్ధు చేయడం వంటి కారణాలతో పూర్తిగా కోల్పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండిగో చర్యల కారణంగా వేల మంది ప్రయాణికులు ఎదో ఒక సందర్భంలో విమానాశ్రయాల్లో పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ఇండిగో ఎయిర్ లైన్స్ కౌంటర్ల ముందు ఆందోళనలు చేసినా ప్రయోజనం లేకుండా పోతున్నది. ఈ నేపథ్యంలో ఎయిర్ లైన్స్ తీరుపై ప్రయాణికులు దుమ్మెత్తి పోస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్దాల్సిన కేంద్ర విమానయాన శాఖ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇండిగో ఎయిర్ లైన్స్‌పై ట్రోలింగ్ జరుగుతోంది.
దేశీయ విమానయాన రంగంలో ఇండిగో వాటా 60 శాతం వాటా వరకు ఉన్నది. ప్రధాన విమానాశ్రయాలతో పాటు టైర్ టూ సిటీలకు కూడా విమానాలను నడుపుతున్నది. విమానాలు ఎప్పుడైతే ఆకాశంలో ఎగురుతూ ఉంటాయో వాటి పేరు మారుమోగుతుంది. ఒక్కసారి సమస్యలు వస్తే అకాశమంతా ఎగిరినా ఆర్థికంగా నష్టపోక తప్పదు. డైరెక్టర్ల మధ్య పొరపొచ్చాలు వచ్చినా, నిర్వహణలో తేడా వచ్చినా ఇదే పరిస్థితి. విమానయాన సంస్థల కలలు పెద్దగా ఉంటాయి కాని ఒకసారి చరిత్రను పరిశీలిస్తే మనుగడకు ఆ స్థాయిలో లక్ష్యాలు లేవు. నిర్వహణ వ్యయం, ఇంధన ధరల హెచ్చు తగ్గులు, తక్కువ ఆదాయం, నియంత్రణ సంస్థల ఒత్తిడి, అధిక పోటీ వంటి కారణాలతో ప్రైవేటు విమానయాన రంగ సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్నాయనే వాస్తవం కళ్లముందు కనిపిస్తున్నది. గత ఇరవై ఐదు సంవత్సరాల్లో ప్రైవేటు విమానయాన సంస్థల పనితీరును ఒకసారి పరిశీలిస్తే, సుమారు తొమ్మిది ఎయిర్ లైన్స్.. విమానయాన రంగం నుంచి కనుమరుగు అయ్యాయి. ఇలా తెరమరుగు అయిన సంస్థలే ఇండిగో ఏయిర్ లైన్స్ అభివృద్ధి, విస్తరణకు బాటలు వేశాయి.
ఎయిర్ సహారా
సహారా ఇండియా అనే ఫైనాన్స్ కంపెనీ తొలుత 1991 సంవత్సరంలో పూర్తిగా ప్రైవేటు రంగంలో ‘ఎయిర్ సహారా’కు శ్రీకారం చుట్టింది. ఈ సంస్థకు ఆర్థికంగా ఉత్తరాది రాష్ట్రాలు వెన్నుదన్నుగా నిలబడ్డాయి. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నాయకులు తమ నల్లధనాన్ని ఈ సంస్థలో పెట్టుబడి పెట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తొలుత ఉత్తరాది రాష్ట్రాలలో తన సేవలను ప్రారంభించి ఆ తరువాత అంతర్జాతీయ కార్యకలాపాలకు విస్తరించింది. బోయింగ్ 737తో పాటు ఎయిర్ ఏ320 విమానాలను కొనుగోలు చేసింది. సహారా ఇండియా ఆర్థిక సుడిగుండాల్లో చుట్టుకోవడం, డిపాజిటర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో 2007 సంవత్సరం ఏప్రిల్ నెలలో జెట్ ఎయిర్ వేస్ రూ.1,450 కోట్లకు దీన్ని కొనుగోలు చేసింది. ఆ తరువాత దాని పేరును ‘జెట్ లైట్’గా మార్చింది. ‘జెట్ లైట్’తో పాటు జెట్ ఎయిర్ వేస్ సంస్థలు ప్రత్యేక పరిస్థితుల్లో 2019 ఏప్రిల్లో తెరమరుగు అయ్యాయి.
ఎయిర్ దక్కన్
మాజీ కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ 2003 సంవత్సరంలో ఎయిర్ దక్కన్ సంస్థను ప్రారంభించారు. సామాన్యుల నుంచి మధ్య తరగతి ప్రజలు విమానంలో ప్రయాణించేందుకు వీలుగా విమానయానాన్ని మార్చారు. చిన్న నగరాలను కలుపుతూ ఏటీఆర్ 42, 72 ఎయిర్ క్రాఫ్ట్‌లను నడిపారు. దీంతో సామాన్యుడి విమానయాన సంస్థగా అది పేరు సంపాదించుకుంది. ఆర్థిక వనరులు సరిపడా లేకపోవడంతో విస్తరణలో వెనకబడింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ 2008 సంవత్సరంలో ఎయిర్ దక్కన్‌ను టేకోవర్ చేసింది. తొలుత దక్కన్ గా మార్చి, ఆ తరువాత ‘కింగ్ ఫిషర్ రెడ్’గా ఖరారు చేసింది. కింగ్ ఫిషర్ సుడిగుండాల్లో చిక్కుకోగానే ఎయిర్ దక్కన్ కూడా కన్పించకుండా పోయింది.
పారామౌంట్ ఎయిర్ వేస్
భారత విమానయానరంగంలో అతి తక్కువ మందికే పారామౌంట్ ఎయిర్ వేస్ గురించి తెలుసు. 2005లో ప్రారంభమైన పారామౌంట్ ప్రీమియం సీట్లను తగ్గింపు ధరలకు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది. దక్షిణాది రాష్ట్రాల ప్రయాణిలను లక్ష్యంగా చేసుకుని ఎంబ్రీర్ ఈ170, 190 ఎయిర్ క్రాఫ్ట్‌లను నడిపింది. న్యాయపరమైన చిక్కులు, ల్యాండింగ్ చార్జీలు చెల్లించకపోవడం, ఆర్థిక నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా 2010లో డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దీని లైసెన్స్ రద్ధు చేసింది. ఆ తరువాత పారామౌంట్ ఆకాశంలో కన్పించకుండా పోయింది.
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్
పలు నాటకీయ పరిణామాల మధ్య కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ భారత కార్పొరేట్ చరిత్ర నుంచి కనుమరుగు అయ్యింది. 2005 సంవత్సరంలో కర్నాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ లిక్కర్ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా దీన్ని ప్రారంభించారు. ఈ రంగానికి గ్లామర్ తీసుకువచ్చి, ప్రయాణీకులకు ప్రత్యేక లాంజులు, మీల్స్, స్నాక్స్ వంటి సర్వీసులను మొదలు పెట్టారు. ఇంధన ధరల పెరుగుదల, రాకపోకల పై నియంత్రణ లేకపోవడంతో ఆర్థిక సమస్యల్లోకి వెళ్లిపోయింది. సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడం, విమానాలను ఎక్కడికక్కడే పార్కింగ్ చేయడం, రుణాల చెల్లింపులపై బ్యాంకుల ఒత్తిడి పెరగడంతో బకాయిలు రూ.7వేల కోట్లకు చేరుకున్నాయి. ఈ కారణాలతో 2012 సంవత్సరంలో డీజీసీఏ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లైసెన్స్ రద్ధు చేయడంతో శకం ముగిసింది.
జెట్ ఎయిర్ వేస్
జెట్ ఎయిర్ వేస్ అంటే నమ్మకానికి ఒక గుర్తుగా ప్రయాణికుల్లో ముద్రపడింది. 1993 సంవత్సరంలో ప్రారంభమై ప్రైవేటు రంగంలోనే ప్రీమియర్ ఎయిర్ లైన్స్‌గా గుర్తింపు పొందింది. 2007 సంవత్సరంలో ఎయిర్ సహారాను టేకోవర్ చేసి మరింత బలపడింది. మిగతా విమానయాన సంస్థలు తక్కువ ధరకు సేవలు అందించడంతో అప్పులు పెరిగి, నియంత్రణ ను కోల్పోయింది. దీంతో మనుగడ సాగించలేక చతికిలపడపోయింది. ఏప్రిల్ 2019 లో జెట్ ఎయిర్ వేస్ ఆగిపోయింది. టేకోవర్ చేసేందుకు పలువురు ముందుకు వచ్చినప్పటికీ కార్యరూపంలోకి రాలేదు. చివరకు నవంబర్ 2024 లో లిక్విడేషన్ కు గురైంది. ఆ తరువాత ప్రీమియర్ ఎయిర్ లైన్స్ కన్పించకుండా పోయింది. 76 సంవత్సరాల వయస్సు ఉన్న జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకులు నరేష్ గోయల్ మనీ ల్యాండరింగ్ కేసును ఎదుర్కొంటున్నారు. కెనరా బ్యాంకు ఫిర్యాదుతో 2023 లో ఈడీ ఆయనను అదుపులోకి తీసుకున్నది. క్యాన్సర్ చికిత్స చేసుకునేందుకు బెయిల్ లభించడంతో ఈ ఏడాది మార్చి నుంచి ముంబై, ఢిల్లీలో చికిత్స తీసుకుంటున్నారు.
ట్రూ జెట్
ప్రాంతీయ కనెక్టివిటీని పెంచుతూ ట్రూ జెట్ తన విమానాలను నడిపింది. ఏటీఆర్ ఎయిర్ క్రాఫ్ట్‌లతో 2015లో సేవలు ప్రారంభించారు. టైర్ టూ, టైర్ త్రీ సిటీలను లక్ష్యంగా చేసుకుని విమానాలు నడిపారు. నిర్వహణ లోపం, ఆర్థిక ఇబ్బందులు తోడవ్వడంతో ఫిబ్రవరి 2022 లో ట్రూ జెట్‌ను మూసి వేశారు. ఎయిర్ బస్ ఏ320 విమానాలతో పునరుద్ధరించేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావడంతో మళ్లీ ట్రూ జెట్ ట్రాక్ లోకి వచ్చింది. తిరిగి ప్రారంభించేందుకు పౌర విమానయాన సంస్థ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసింది. ఎయిర్ ఆపరేటర్ పర్మిషన్ లభిస్తే విమానాలను నడిపేందుకు అవకాశం లభిస్తుంది. యూఎస్ కు చెందిన ఎన్ఎస్ ఏవియేషన్ 49 శాతం వాటాలను కొనుగోలు చేయడంతో పునరుద్ధరణకు మార్గం సుగమం అయ్యింది,.
గో ఫస్ట్
ఒకప్పటి గో ఎయిర్ కాస్తా.. గో ఫస్ట్‌గా మారింది. 2005 లో ప్రారంభమైన గో ఫస్ట్ విమానయాన రంగంలో అనేక ఒడిదిడుకులను ఎదుర్కొని నిలబడింది. అనుకోని సమస్యల కారణంగా 2023 సంవత్సరంలో పూర్తిగా కుప్పకూలింది. అప్పులు రూ.6,521 కోట్లకు పెరగడం, తీర్చేందుకు ఆదాయం లేకపోవడంతో పునరుద్ధరణకు అవకాశం లేకుండా పోయింది. తప్పని పరిస్థితుల్లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ 2025 లో లిక్విడేషన్ కు ఆదేశిలివ్వడంతో లో కాస్ట్ క్యారియర్ ఆకాశంలో ఎగరకుండా ఆగిపోయింది.
విస్తారా ఎయిర్ లైన్స్
టాటా సన్స్, సింగపూర్ ఎయిర్ లైన్స్ సంస్థతో కలిసి 2015 లో విస్తారా ఏయిర్ లైన్స్ ను ప్రారంభించారు. క్రమక్రమంగా తన సేవలను విస్తరించుకుంటూ ప్రయాణీకుల ఆదరాభిమానాలను చూరగొన్నది. విస్తారా నవంబర్ 2024 లో ఏయిర్ ఇండియాలో విలీనం అయ్యింది. టాటా ఏవియేషన్, భారత ప్రభుత్వానికి చెందిన ఎయిర్ ఇండియాను టేకోవర్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విస్తారా.. ఎయిర్ ఇండియా గొడుగు కింద ఉన్నది.
ఏఐఎక్స్ కనెక్ట్
ఒకప్పటిక ఎయిర్ ఏషియా ఆ తరువాత ఏఐఎక్స్ కనెక్ట్ గా మారింది. ఎయిర్ ఇండియాను టాటా కంపెనీ టేకోవర్ చేయడంతో, ఏఐఎక్స్ కనెక్ట్ కూడా విలీనం అయ్యింది.
Read Also |
Jubilee Hills By-Election : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఖర్చు రూ. 5 కోట్ల 91 లక్షల 60 వేలు
Two Years of Congress Rule | ఏలుబడిలో ఎవరున్నా.. ఎక్కడి భూ సమస్యలు అక్కడే!
22a List Controversy | తెలంగాణ రైతులకు సర్కార్ షాక్! కోటి ఎకరాల భూములపై లావాదేవీలు బంద్!
Nirmala Sitharaman : బెంగాల్ నుంచి బాగో బాగ్
